Begin typing your search above and press return to search.

స్పేస్‌ టెక్నాలజీతో అదరగొడుతున్న టీఎస్ పోలీస్ శాఖ!

By:  Tupaki Desk   |   17 Jan 2020 6:09 AM GMT
స్పేస్‌ టెక్నాలజీతో అదరగొడుతున్న టీఎస్ పోలీస్ శాఖ!
X
సమాజంలో వచ్చే కొత్త కొత్త సమస్యలకి పరిష్కారం చూపుతూ - సమాజంలో ఎటువంటి గొడవలు - అల్లర్లు జరగకుండా చూసుకోవాల్సిన భాద్యత పోలీసులదే. కానీ , పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా దుర్ఘటనలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. దీనితో ఇటువంటి సమస్యలని ఎదుర్కోవడానికి తెలంగాణ పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు సరికొత్త విధానాలతో ముందుకు అడుగులు వేస్తుంది. టెక్నాలజీ సాయంతో నేర దర్యాప్తులో దేశంలోనే నం.1గా ఉన్న తెలంగాణ పోలీసు శాఖ విప్లవాత్మక ముందడుగు వేసింది.

నేరాల నియంత్రణకు స్పేస్‌ టెక్నాలజీని వాడాలని నిర్ణయించింది. రోడ్డు ప్రమాదం జరిగినా.. బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం సేవించినా క్షణాల్లో డీజీపీ కార్యాలయంలో తెలిసిపోతుంది. వెంటనే సంబంధిత ఠాణా అధికారులను అప్రమత్తం చేస్తారు. వారు నిమిషాల్లో ఘటనాస్థలానికి చేరుకుని చర్యలు తీసుకుంటారు. రాష్ట్రంలో నేర నియంత్రణ - మెరుగైన ట్రాఫిక్‌ వ్యవస్థ ఏర్పాటు ద్వారా రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించడం - అన్ని పోలీస్‌ స్టేషన్‌ సరిహద్దుల నిర్ధారణకు స్పేస్‌ టెక్నాలజీని ఉపయోగించుకోవాలని రాష్ట్ర పోలీస్‌ శాఖ నిర్ణయించింది. ఈ అంశాలపై డీజీపీ ఎం. మహేందర్‌ రెడ్డి గురువారం తెలంగాణ స్టేట్‌ రిమోట్‌ సెన్సింగ్‌ అప్లికేషన్‌ సెంటర్‌ కార్యాలయంలో ట్రాక్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ శ్రీనివాస్‌ రెడ్డి, ట్రాక్‌ సైంటిఫిక్‌ ఇంజనీర్లతో ప్రత్యేక భేటీ నిర్వహించారు. ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి రాష్ట్రంలో నేరాలను తగ్గించడం, మెరుగైన ట్రాఫిక్‌ వ్యవస్థ ఏర్పాటు ద్వారా రోడ్డు ప్రమాదాలకు చెక్‌ పెట్టవచ్చని డీజీపీ మహేందర్‌ రెడ్డి తెలిపారు. దీనికిగాను ట్రాక్‌ తో త్వరలోనే ఎంవోయూ కుదుర్చుకోనున్నట్లు తెలిపారు.

రిమోట్‌ సెన్సింగ్‌ ద్వారా రాష్ట్రంలో ఎక్కువగా నేరాలు జరిగే ప్రాంతాల మ్యాపింగ్ - తరచుగా రోడ్డు ప్రమాదాలు జరిగి మరణాలు అధికంగా సంభవించే ప్రాంతాలు - కీలక రోడ్డు మలుపులతో కూడిన సమగ్ర సమాచారం కలిగిన మ్యాపింగ్‌ ని ట్రాక్‌ సాయంతో చేపట్టనున్నారు. దీంతో పాటు రాష్ట్రంలోని అన్ని పోలీస్‌ స్టేషన్ల సరిహద్దులను రెవెన్యూ రికార్డులతో అనుసంధానం చేసి మ్యాపింగ్‌ చేయాలని కూడా నిర్ణయించారు. తద్వారా పోలీస్‌ స్టేషన్ల సరిహద్దుల పేర్లు స్పష్టంగా తెలియడంతో పాటు ఫిర్యాదుల నమోదుకు సరైన పోలీస్‌ స్టేషన్‌ ను ఎంచుకునే అవకాశం ప్రజలకు ఏర్పడుతుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బహిరంగంగా మద్యం సేవించే ప్రదేశాలను గుర్తించి వాటిని కూడా జియో మ్యాపింగ్‌ చేయాలని డీజీపీ కోరారు. ఆయా ప్రదేశాలను హైదరాబాద్‌ లోని పోలీస్‌ ప్రధాన కార్యాలయం - జిల్లా పోలీస్‌ కార్యాలయాల ద్వారా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తారు. తద్వారా మహిళలపై జరిగే నేరాలు కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఏర్పడుతుందన్నారు.