Begin typing your search above and press return to search.

కేటీఆర్ కోసం కేసీఆర్..కొడుకుల కోసం మంత్రులు

By:  Tupaki Desk   |   13 Sep 2018 7:38 AM GMT
కేటీఆర్ కోసం కేసీఆర్..కొడుకుల కోసం మంత్రులు
X
ఎవరి అవకాశం వారిది.. వాళ్లు ఎన్నాళ్లుంటారో తెలియదు. అందుకే తామున్నప్పుడే అధికార మార్పిడి సామరస్యంగా జరగాలని టీఆర్ ఎస్ నేతలు భావిస్తున్నారు. కేటీఆర్ ను సిద్ధం చేస్తూ కేసీఆర్.. తమ కొడుకులను తమకు బదులుగా రాజకీయారంగేట్రం చేయించాలని టీఆర్ ఎస్ మంత్రులు - ప్రజాప్రతినిధులు ఆరాటపడుతున్నారు. ఇప్పుడీ సరికొత్త రాజకీయాలు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారాయి. తమ వారసుల కోసం ఏకంగా తమ రాజకీయ భవిష్యత్ ను కూడా త్యాగం చేయడానికి టీఆర్ ఎస్ ప్రజాప్రతినిధులు సిద్ధమైపోవడం ఇప్పుడు రాజకీయాలను షేక్ చేస్తోంది.

ఇటీవల తన కూతురు సుస్మిత కు టికెట్ ఇవ్వలేదని టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ ఏకంగా టీఆర్ ఎస్ పై తిరుగుబాటు ఎగురవేసి సంచలనం సృష్టించారు. అవకాశం వస్తే సుస్మితను పరకాల నుంచి నిలబెట్టాలని ఆలోచించారు. టీఆర్ఎస్ నుంచి రెండు టికెట్లు ఆశించగా చుక్కెదురైంది. దీంతో తిరుగుబాటు చేసి కాంగ్రెస్ బాట పడుతున్నారు.

వీరే కాదు.. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి కూడా తన కూతురు కడియం కావ్యను తన వారసురాలిగా రాజకీయ అరంగేట్రం చేయించాలని పట్టుదలతో ఉన్నారు. స్టేషన్ ఘన్ పూర్ నుంచి టీఆర్ ఎస్ టికెట్ ఆశించారు. కానీ సిట్టింగ్ లందరికీ టికెట్ ఇచ్చిన కేసీఆర్.. కడియం శ్రీహరి కోరికను తీర్చలేదు. సిట్టింగ్ తాటికొండ రాజయ్యకు టికెట్ ఇచ్చారు. దీంతో రాజయ్యకు వ్యతిరేకంగా కడియం వర్గం ప్రజాప్రతినిధులు రోడ్డెక్కారు. రాజయ్యకు టికెట్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మధ్యే రాజయ్య ఓ మహిళతో సాగించిన శృంగార వ్యవహారాల మాటలు కూడా ఈ క్రమంలోనే రిలీజ్ అయినట్టు ప్రచారం జరుగుతోంది.

ఇక ములుగు ఎమ్మెల్యే - మంత్రి చందూలాల్ కూడా తన కుమారుడు ప్రహ్లాద్ కు ఈసారి టికెట్ ఇవ్వాలని టీఆర్ ఎస్ అధిష్టానాన్ని కోరారట.. తాను ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నానని..తన కొడుక్కు టికెట్ ఇవ్వాలని కోరినా సాధ్యపడలేదు. ఇక డోర్నకల్ సిట్టింగ్ ఎమ్మెల్యే - మాజీ మంత్రి రెడ్యానాయక్ కు కూడా టీఆర్ ఎస్ టికెట్ దక్కింది. ఆయన తన కూతురు, మాజీ ఎమ్మెల్యే కవితకు మహబూబాబాద్ టికెట్ ఇవ్వాలని కోరారు. కానీ టీఆర్ ఎస్ ఇవ్వలేదు. అవసరమనుకుంటే కూతురు కోసం తన టికెట్ ఇవ్వాలని.. తాను త్యాగం చేస్తానని చెబుతున్నట్టు సమాచారం.

ఇలా తమకు బలం ఉన్నప్పుడే బిడ్డలను నేతలుగా తీర్చిదిద్దాలని ప్రజాప్రతినిధులు తపన పడుతున్నారు. తమ రాజకీయ జీవితాలను త్యాగం చేసైనా సరే కొడుకు - కూతుళ్లను అధికారంలోకి తేవాలనే ఆరాటం మొదలైంది. ఈ సరికొత్త రాజకీయం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది.