Begin typing your search above and press return to search.

కేసీఆర్ మోదీ మీద.. రేవంత్ కేసీఆర్ మీద

By:  Tupaki Desk   |   18 Dec 2021 9:35 AM GMT
కేసీఆర్ మోదీ మీద.. రేవంత్ కేసీఆర్ మీద
X
రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రంజుగా మారుతున్నాయి. ఇందులో ఎవరి ప్రయోజనాల మేరకు వారు పావులు కదుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. రాష్ట్ర బీజేపీ నాయకులను తరిమికొట్టాలని ఏకంగా సీఎం కేసీఆరే టీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునివ్వడం పరిస్థితి తీవ్రత ఎలా ఉందో చెబుతోంది. వచ్చే సోమవారం రాష్ట్రవ్వాప్త నిరసనలకూ పిలుపునిచ్చారు.

ధాన్యం కొనుగోళ్ల అంశంపై, రాష్టానికి రావాల్సిన ప్రాజెక్టుల విషయంలో కేంద్రంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న కేసీఆర్.. ప్రజా క్షేత్రంలోనే తేల్చుకోవాలని సిద్ధమయ్యారు. ఇక టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి తరచూ ప్రజాందోళనలతో పార్టీ కార్యకర్తలను ఉత్తేజ పరుస్తున్నారు.

ఇదే కోవలో ఏకంగా కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ లోనే సభ నిర్వహించి సవాల్ చేశారు. నిత్యవసర ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా శనివారం చేవెళ్లలో పాదయాత్ర చేపట్టారు.

ఇక సమరమే.. మళ్లీ ఢిల్లీకి తెలంగాణ మంత్రులు రెండు ప్రధాన పక్షాల వైఖరి చూస్తుంటే ఇక సమరమే అన్నట్లుంది. కేంద్రాన్ని కేసీఆర్ టార్గెట్ చేస్తుంటే, కేసీఆర్ ను రేవంత్ లక్ష్యంగా ఎంచుకున్నారు. ధాన్యం కొనుగోళ్లు, బొగ్గు గనుల ప్రైవేటీకరణ అంశాల్లో కేంద్రాన్ని నేరుగా ఢీకొట్టాలని కేసీఆర్ నిర్ణయించారు.

మోదీ సర్కారు వైఖరితో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ ఆక్రోశిస్తున్న కేసీఆర్.. తాజా పరిణామాలను ఆయుధాలుగా మలుచుకోవాలని నిర్ణయించారు. బీజేపీ సర్కారుపై యుద్ధం ప్రకటించిన ఆయన శనివారం ఢిల్లీకి మంత్రులను పంపారు.

వాస్తవానికి కేసీఆరే కాక మంత్రులు ఢిల్లీ వెళ్లొచ్చి రెండు వారాలు కూడా కావడం లేదు. దాదాపు అదే అంశాలపై మళ్లీ ఢిల్లీకి పంపడమంటే కేంద్రాన్ని నేరుగా ఢీకొనడమేనని స్పష్టమవుతోంది. మరోసారి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరిని చెప్పాలని డిమాండ్ చేయనుండడం కూడా.. ఈ విషయంలో తమ తప్పేమీ లేదని కేంద్రమే తప్పించుకుంటోందని చెప్పే ఉద్దేశం కనిపిస్తోంది. శుక్రవారం జరిగిన టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల సమావేశంలో రాష్ట్రంలో ప్రతిప‌క్షాల‌ తీరుపై చర్చించారు.

సీఎం అలా పిలుపునిచ్చారేమిటి?

సీఎం స్థాయి వ్యక్తి.. ప్రతిపక్ష అది కూడా కేంద్రంలో అధికారంలోకి ఉన్న పార్టీ నేతలను తరిమికొట్టమని పిలుపునివ్వడం అంటే.. గ్రామాల్లోకి రాకుండా అడ్డుకోవాలని చెప్పడం అంటే.. కేంద్రంతో అమీతుమీకి సిద్థపడుతున్నట్టే లెక్క.

రాష్ట్రంలో బలమైన పార్టీగా ఎదుగుతున్న బీజేపీని ఇరుకున పెట్టే వ్యూహం కూడా నిన్నటి సమావేశంలో చర్చించారు. బీజేపీని గుజరాత్ గులాములుగా అభివర్ణిస్తూ.. తెలంగాణ బిడ్డల పౌరుషాన్ని ఆ పార్టీకి చూపాలని కేసీఆర్ వ్యాఖ్యానించారు. సెంటిమెంటును రగిలించే ప్రయత్నం చేశారు.

మరోవైపు బీజేపీ అంటే ఏవగింపు కలిగేలా ప్రజలను చైతన్యం చేయాలని ప్రజాప్రతినిధులకు సూచించడం గమనార్హం. బీజేపీ దిష్టిబొమ్మల దహనం వంటి ఆందోళనలకూ కేసీఆర్ పిలుపునివ్వడం విశేషం. దళితబంధు, రైతుబంధుపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని .. ఈ ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని టీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్ధేశం చేశారు. మండిపడ్డారు.

టి కాంగ్రెస్ పోరుబాట.. పాత కాపును తీసుకొచ్చి నిత్యం ఆందోళన కార్యక్రమాలతో టీపీసీసీని నడిపిస్తున్న రేవంత్... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలను ఎండగట్టేందుకు సిద్ధమయ్యారు.

అయితే, రేవంత్ టార్గెట్ ప్రధానంగా కేసీఆర్ మీదనే. పాదయాత్రల సెంటిమెంటు కోట రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో శనివారం పాదయాత్ర చేపట్టారు. పది కిలోమీటర్లు సాగే ఈ పాదయాత్రకు పాత కాపు.. సీడబ్యూసీ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.

2004-09 మధ్యన దిగ్విజయ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి. ఈ కాలంలో జరిగిన అనేక పరిణామాలకు ప్రత్యక్ష సాక్షి. విభజన సమయంలోనూ, టీఆర్ఎస్ విలీన ప్రతిపాదన వచ్చిన సమయంలోనూ ఆయనే కీలక పాత్రధారి.


అలాంటి దిగ్విజయ్ ను తాజా కార్యక్రమానికి ఆహ్వానించడం అంటే..కేసీఆర్ ను ఇరుకునపెట్టే ప్రయత్నమే. ప్రసంగంలో దిగ్విజయ్ వేసే ప్రశ్నలకు టీఆర్ఎస్ సమాధానం ఎలా ఇస్తుందో చూడాలి. అసలు ఈయనను తీసుకురావడమే రేవంత్ వ్యూహ చతురతను చాటుతోంది. ఇక కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, నిత్యావసర ధరల పెరుగుదల , భూసంస్కరణలపై పోరుకు కాంగ్రెస్ అధిష్టానం పిలుపు ఇచ్చింది. రాహుల్,ప్రియాంక గాంధీలకు సంఘీభావంగా.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు పాదయాత్రలకు దిగారు.

ఉత్తరప్రదేశ్ లోని అమేథీలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు సైతం పాదయాత్రకు పూనుకున్నారు. ఈ నేపథ్యంలో వారికి సంఘీభావంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా ఆందోళనలకు దిగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పాదయాత్ర చేపట్టారు.చేవెళ్లలో రేవంత్, ఖమ్మంలో భట్టి, సంగారెడ్డిలో జగ్గారెడ్డి పాదయాత్ర చేయనున్నారు.

తెలంగాణకు రాహుల్ సీనియర్ నేత మీనాక్షి నటరాజన్ తెలంగాణలో జనవరి 30వ తేది నుంచి 15 రోజుల పాటు పాద‌యాత్ర చేయ‌నున్నారు. ఇందులో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ 2022 ఫిబ్రవరి మొదటి వారంలో తెలంగాణకి రానున్నారు. ఒక్కరోజు పాదయాత్రలో పాల్గొంటారు. రాహుల్ వస్తున్న నేపథ్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు టీపీసీసీ ఆలోచన చేస్తోంది.