Begin typing your search above and press return to search.

మూడు రోజులే గడువు.. ఎటు తేల్చని టీఆర్ఎస్

By:  Tupaki Desk   |   11 March 2020 5:20 AM GMT
మూడు రోజులే గడువు.. ఎటు తేల్చని టీఆర్ఎస్
X
రాజ్యసభ ఎన్నికలకు కేవలం మూడు రోజులే గడువు ఉంది. ఆంధ్రప్రదేశ్ లో వాటికి అభ్యర్థుల ఎంపిక పూర్తి కాగా తెలంగాణలో మాత్రం ఇప్పటివరకు అభ్యర్థులు ఖరారు కాలేదు. తెలంగాణలో ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాలకు టీఆర్ఎస్ కే దక్కనున్నాయి. దీంతో రాజ్యసభకు ఎవరూ పంపుతారనేది ఇంకా ఎటు తేలలేదు. రాజ్యసభ అభ్యర్థిత్వం కోసం తీవ్ర పోటీ నెలకొనడంతో కేసీఆర్ మల్లగుల్లాలు పడుతున్నారు. ఎవరినీ ఎంపిక చేయాలనే విషయంపై ఎటు తేల్చుకోలేకపోతున్నారు. నామినేషన్ల దాఖలుకు ఇంకా మూడు రోజులే ఉన్నాయి. సామాజిక సమీకరణాలతో పాటు విధేయత, విశ్వసనీయత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థుల ఎంపిక చేయనున్నారని తెలుస్తోంది.

ఈ నెల 13వ తేదీతో నామినేషన్ల దాఖలుకు గడువు ముగుస్తున్నా టీఆర్ఎస్ నుంచి ఎలాంటి స్పందన ఉండడం లేదు. కాకపోతే రెండు రాజ్యసభ స్థానాలకు మాత్రం తీవ్ర పోటీ ఉంది. అయితే తెలంగాణలో ఎమ్మెల్సీ స్థానాలు రెండు ఖాళీ ఉన్నాయి. వాటికి సంబంధించి అభ్యర్థులను ఇంకా నిర్ణయించలేదు. దీంతో ఆ రెండు, ఈ రెండూ కలిపి అభ్యర్థులను ఒకేసారి ప్రకటిస్తారని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ వచ్చింది. దీంతోపాటు గవర్నర్‌ కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా ఉంది. ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలనూ టీఆర్‌ఎస్సే దక్కించుకోనుంది. వీటికి అభ్యర్థులను ఖరారు చేయాలి. రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్‌ కె.కేశవరావు రాజ్యసభ సభ్యత్వం పదవీ కాలం ముగుస్తుండగా ఆయనకు తిరిగి ఇచ్చే అవకాశం ఉంది. ఇక మిగిలిన ఒక స్థానాన్ని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో పాటు కవిత పేరు వినిపిస్తోంది. అయితే చివరకు పొంగులేటిని ఖరారు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే సాధారణ ఎన్నికల్లో ఖమ్మం స్థానాన్ని నామా నాగేశ్వర్ రావుకు పార్టీ టికెట్ ఇవ్వడంతో సిట్టింగ్ ఎంపీగా ఉన్న పొంగులేటి పక్కకు జరిగారు. దీంతో అప్పుడు త్యాగం చేయడం తో ఇప్పుడు రాజ్యసభ కు పంపిచే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ స్థానంపై ఆశలు పెట్టుకున్న మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డిని ఎమ్మెల్సీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు మరో ఎమ్మెల్సీ స్థానానికి సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌ కు ఇస్తారని సమాచారం. ప్రస్తుతానికి ఈ విధంగా చర్చ సాగుతోంది. ఈ అభ్యర్థిత్వాలపై తుది నిర్ణయం టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తీసుకోనున్నారు. ఈరోజో, రేపో అభ్యర్థుల ఖరారు కొలిక్కి వచ్చి ప్రకటించే అవకాశం ఉంది.