Begin typing your search above and press return to search.

ఇప్పటికైతే ఫస్ట్ ర్యాంక్ తెలంగాణదే

By:  Tupaki Desk   |   14 July 2016 4:01 AM GMT
ఇప్పటికైతే ఫస్ట్ ర్యాంక్ తెలంగాణదే
X
కొత్తగా ఏర్పడిన రాష్ట్రమే అయినా వృద్ధిలోనూ.. ఇతర అంశాల విషయంలోనూ ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతూ దూసుకెళుతున్న తెలంగాణ రాష్ట్రం మరో ఘనతను సాధించింది. సరళతర వ్యాపార నిర్వహణ అదేనండి.. ‘‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’’ (ఈ అంశం విషయంలో తమ అంశాల్ని ఏపీ సర్కారు కాపీ కొట్టిందని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆరోపించటమే కాదు.. ఈ ఉదంతంపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ అంశం కేంద్రం పరిశీలనలో ఉండటం గమనార్హం) ర్యాంకుల్లో తెలంగాణ రాష్ట్రం ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది.

తాజాగా కేంద్ర పారిశ్రామిక విధానం.. ప్రోత్సాహక శాఖ వెబ్ సైట్ దేశంలోని రాష్ట్రాలకు ర్యాంకుల్ని కట్టబెట్టింది. ఈ ర్యాంకుల్లో తెలంగాణ ఫస్ట్ ప్లేస్ లోనిలవగా.. ఉత్తరాఖండ్ రెండో స్థానంలో నిలిచింది. ఇక.. ఏపీ మూడో స్థానంలో నిలవటం గమనార్హం. అయితే.. ఈ ర్యాంక్ ఫైనల్ అని చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే.. రాష్ట్రాల పారిశ్రామిక విధానాలు.. సంస్కరణలు.. ఇతర అంశాలకు సంబంధించి రాష్ట్రాలను 340 ప్రశ్నలకు సమాధానాల్ని కోరింది. ఇందులో ప్రస్తుతానికి 190 ప్రశ్నల్ని పరిశీలించి ర్యాంకుల్ని ఖరారు చేశారు. మిగిలిన ర్యాంకుల్ని పరిశీలిస్తూ.. ఆయా ప్రశ్నలకు వారిచ్చే సమాధానాల ఆధారంగా ర్యాంకుల్ని సర్దుతుంటారు.

ఇప్పటికైతే మొదటిస్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచింది. మిగిలిన ప్రశ్నలకు సమాధానాల్ని పరిశీలిస్తూ.. ఎప్పటికప్పుడు ర్యాంకుల్ని సరి చేస్తూ ఉంటారు. మిగిలిన అన్నిప్రశ్నలకు సమాధానాల్ని పరిశీలించిన తర్వాత సెప్టెంబరులో తుది ర్యాంకును ప్రకటిస్తారు. కొత్త రాష్ట్రం.. పాలనకు కొత్త అయినా తెలంగాణ రాష్ట్రం.. తెలంగాణ సర్కారు.. దేశంలోని మిగిలిన రాష్ట్రాలన్ని తలదన్ని ఫస్ట్ ప్లేస్ లో నిలవటం చూసినప్పుడు ఈ క్రెడిట్ అంతా ముఖ్యమంత్రి కేసీఆర్ ఖాతాలో వేయాల్సిందే.