Begin typing your search above and press return to search.

అదేంది సారూ.. హోంగార్డులు.. అంగన్ వాడీలకూ కోత పెట్టుడా?

By:  Tupaki Desk   |   1 April 2020 11:30 AM GMT
అదేంది సారూ.. హోంగార్డులు.. అంగన్ వాడీలకూ కోత పెట్టుడా?
X
కరోనా వేళ.. అత్యవసర విభాగాల వారు తప్పించి.. మిగిలిన శాఖల ఉద్యోగులు ఇంటి వద్దనే ఉంటున్నారు. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన వైనం తెలిసిందే. దీంతో.. ప్రభుత్వాలకు రావాల్సిన ఆదాయాలు భారీగా తగ్గిపోవటం.. కరోనా కోసం భారీగా ఖర్చు పెట్టాల్సిన వేళ.. కేసీఆర్ సర్కారు తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఊహకు అందని రీతిలో విరుచుకుపడ్డ కరోనాను కలిసి కట్టుగా ఎదుర్కొందామంటూ ఆదివారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో సంకేతాన్ని ఇచ్చిన కేసీఆర్.. అందుకు తగ్గట్లే.. జీతాల కోతను భారీగా కోసేసి ప్రభుత్వాలకు.. ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేసే ఉద్యోగులకు.. రాజకీయ నేతలకు.. ఇలా వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా అందరికి షాకిచ్చారు.

జీతాల కోత విషయంలో అందరి ఉద్యోగులకు.. వారి స్థాయికి తగ్గట్లు వాత పెట్టటం బాగానే ఉందనుకున్నా.. విపత్తు వేళ ఒళ్లు దాచుకోకుండా పని చేస్తున్న వారి విషయంలోనూ కోతను అమలు చేయటాన్ని జీర్ణించుకో లేక పోతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యం లో కటువైన నిర్ణయం తీసుకున్నట్లు చెప్పిన సీఎం కేసీఆర్.. చిన్నస్థాయి ఉద్యోగులైన హోంగార్డులు.. అంగన్ వాడీల జీతాల్లోనూ కోత విధించినట్లుగా తాజాగా విడుదలైన జీవో స్పష్టం చేస్తోంది. ఏ శాఖకు సంబంధించిన ఉద్యోగులు.. వారి స్థాయి.. వారి వేతనాల్లో ఎంత మొత్తాన్ని కోత పెడుతున్నది చెప్పారు.

అంతేకాదు.. ఎవరైనా కోత లేకుండా జీతాలు తీసుకుంటే.. వారు జీవో 27 ప్రకారం ప్రభుత్వం నిర్దేశించిన మొత్తాన్ని మళ్లీ ఖజానాకు జమ చేయాల్సి ఉంటుందన్న రూల్ ను పెట్టేశారు. అంతేకాదు.. గ్రాంట్ ఇన్ ఎయిడ్ సంస్థల ఉద్యోగుల వేతనాలకు సంబంధించి ఇప్పటికే బిల్లులు సమర్పించి.. జారీ చేసిన చెక్కులు వెనక్కి తీసుకోవాలని నిర్ణయించారు. జీవో నెంబరు 27 కు తగ్గట్లుగా వారికి చెల్లింపులు జరుపుతారు. జీతాల కోత విషయం లో అన్నిశాఖల ఉద్యోగులకు ఒకే విధానాన్ని అమలు చేయటం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కరోనా వేళ.. రోటీన్ కు భిన్నంగా తీవ్రమైన పని ఒత్తిడిని.. భారాన్ని.. రిస్క్ ను ఎదుర్కొంటున్న హోంగార్డులు.. అంగన్ వాడీలు లాంటి చిరుద్యోగుల విషయంలో కేసీఆర్ పెద్ద మనసుతో వ్యవహరించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అత్యున్నత.. ఉన్నత ఉద్యోగస్తులు.. ఒక మోస్తరు ఉద్యోగాలు చేసే వారికి జీతం కోత వాత బాగుంటుందని.. చిరుద్యోగుల మీద కేసీఆర్ ఝుళిపించిన కోత కత్తి పదునుకు చాలామంది తీవ్ర ఇబ్బందులకు గురి కావటం ఖాయమంటున్నారు.