Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యేల‌కు నోటీసులు స‌రే..రిజ‌ల్ట్ ఏంటి?

By:  Tupaki Desk   |   3 March 2016 4:05 PM GMT
ఎమ్మెల్యేల‌కు నోటీసులు స‌రే..రిజ‌ల్ట్ ఏంటి?
X
తెలుగుదేశం పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో ఇటీవ‌ల‌ చేరిన ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ నోటీసులు జారీ చేశారు. త‌మ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్‌లో చేరిన ఐదుగురు ఎమ్మెల్యేల‌పై అనర్హత వేటు వేయాలంటూ తెలుగుదేశం పార్టీ పిటిష‌న్ ఇచ్చింది. దీనిపై స్పీకర్ మధుసూదనా చారి ఈ రోజు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని స్పీకర్ వారిని ఆదేశించారు. నోటీసులు అందుకున్న వారిలో మాజీ శాస‌న‌స‌భా ప‌క్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు - ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి - వివేకానంద - సాయన్న - ప్రకాశ్ గౌడ్ లకు నోటీసులు అందజేశారు.

అయితే ఇప్ప‌టికే నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలపై చ‌ర్య‌ల విష‌యంలో ఏ అడుగు ముందుకు ప‌డ‌లేదు. ఈ నేప‌థ్యంలో తాజా నోటీసులను కూడా టీడీపీ ఫిర్యాదు చేసినందుకు జారీచేసిన శ్రీ‌ముఖాలుగా భావించాలా లేదా సీరియ‌స్ చ‌ర్య‌లు ఉంటాయా అనే చ‌ర్చ పొలిటిక‌ల్ స‌ర్కిల్‌లో జ‌రుగుతోంది. స‌ద‌రు పార్టీ మారిన ఎమ్మెల్యేల‌పై చ‌ర్య తీసుకోవాల‌ని ఈ అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా గ‌ట్టిగా ప‌ట్టుప‌ట్ట‌నున్న‌ట్లు పార్టీ ఎమ్మెల్యేలు వివ‌రిస్తున్నారు.

ఇదిలాఉండ‌గా టీడీపీ త‌ర‌ఫున 15 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది గులాబీ గూటికి చేరిన సంగ‌తి తెలిసిందే. పార్టీ మార‌డ‌మే కాకుండా ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర‌రావు నేతృత్వంలోని ఆ ప‌ది మంది ఎమ్మెల్యేలు స్పీక‌ర్ మ‌ధుసూద‌న చారికి లేఖ రాస్తూ త‌మ పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేస్తున్న‌ట్లు తెలిపారు. దీనిపై ఇప్ప‌టివ‌ర‌కు నిర్ణ‌యం ఏదీ వెలువ‌డ‌లేదు. ఈ ప‌రిణామాల క్ర‌మంలో తాజా నోటీసులు ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి.