Begin typing your search above and press return to search.
తెలుగు మహసభలు అదుర్స్ అంటున్న కోడెల
By: Tupaki Desk | 21 Dec 2017 5:14 AM GMTతెలుగు రాష్ర్టాలకు సంబంధించిన అరుదైన - ఆసక్తికరమైన కలయిక చోటుచేసుకున్న సందర్భంగా ఆత్మయ ముచ్చట్లు తెరమీదకు వచ్చాయి. రెండు రాష్ర్టాల అసెంబ్లీల రథసారథులు అయిన స్పీకర్లు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య ఆత్మీయ రీతిలో మాటామంతి సాగింది. ఈ భేటీకి గుంటూరు వేదికగా నిలిచింది. తెలంగాణ శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళుతున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి రెండవ కుమారుడి వివాహానికి హాజరుకాలేక పోయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు మర్యాదపూర్వకంగా కలుసుకునేందుకు బుధవారం కుటుంబసభ్యులతో ఆయన గుంటూరు వచ్చారు. ఈ సందర్భంగా కొత్తపేటలోని మనోహర క్లినిక్ వద్ద మధుసూదనాచారిని కోడెల మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. తన కుమార్తె వైద్యవృత్తిని పూర్తిచేసిందని ఈ సందర్భంగా తెలంగాణ స్పీకర్ కు పరిచయం చేశారు. అదే విధంగా మధుసూదనాచారి తన కుటుంబ సభ్యులను కోడెలకు పరిచయం చేశారు.
ఈ సందర్భంగా ఇద్దరు స్పీకర్లు ఇష్టాగోష్టిగా మాట్లాడుకున్నారు. తెలంగాణలో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలు సూపర్.. అద్భుతంగా నిర్వహించారు.. ఇదో చారిత్రక ఘట్టమని కోడెల అన్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ప్రస్తావనకు వచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి మధ్యలో ప్రీ బడ్జెట్ సెషన్స్ కు అవకాశాలు ఉన్నాయని కోడెల వివరించారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మీడియాతో మాట్లాడుతూ మూడు దశాబ్దాలుగా కోడెల కుటుంబంతో తనకు అనుబంధం ఉందని చెప్పారు.తామిద్దరం మంచి దోస్తులం అని - గతంలో ఒకే పార్టీలో పనిచేశామని, ఎప్పటినుంచో తమ మధ్య సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పారు. శాసనసభ వ్యవహారాలలో కూడా ఇద్దరం సమన్వయంతో పనిచేస్తున్నామని వివరించారు. తన రెండవ కుమారుడి వివాహానికి కోడెలను ఆహ్వానించామని, అయితే అనివార్య కారణాల వల్ల ఆయన రాలేనందున ఆశీస్సుల కోసం గుంటూరు వచ్చినట్లు వివరించారు. వివాహ అనంతరం పుణ్యక్షేత్రాల సందర్శన కూడా కలిసి వచ్చిందని తెలిపారు.
విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం అనంతరం గుంటూరు చేరుకున్న మధుసూదనాచారి కుటుంబ సభ్యులు కోటప్పకొండ - శ్రీకాళహస్తి మీదుగా సాయంత్రానికి తిరుపతి చేరుకుని గురువారం శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. స్పీకర్ కోడెల మీడియాతో మట్లాడుతూ రెండు రాష్ట్రాలకు స్పీకర్లుగా ఉన్నందున అవగాహనతో తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి తగిన నిర్ణయాలు తీసుకుంటామన్నారు. తెలంగాణా స్పీకర్ తిరుపతి వెళుతున్న విషయం తెలుసుకున్న ఎపి స్పీకర్ కోడెల తిరుమలలో, అలాగే విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయాల్లో ఎలాంటి ప్రోటోకాల్ ఇబ్బంది లేకుండా మధుసూదనాచారి కుటుంబ సభ్యులకు దర్శన భాగ్యం కల్పించాలని సంబంధిత దేవాలయాల అధికారులను స్పీకర్ కోడెల ఆదేశించారు.