Begin typing your search above and press return to search.

మహిళా ఉద్యోగులకు తెలంగాణే బెస్టట..

By:  Tupaki Desk   |   21 Sep 2016 6:55 AM GMT
మహిళా ఉద్యోగులకు తెలంగాణే బెస్టట..
X
మన దేశంలో ఎక్కడ చూసినా అత్యాచారాలు - లైంగిక వేధింపులే. ఢిల్లీ వంటి నగరాల్లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. దీంతో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా ఉంది. ఆఫీసుల్లో పనిచేసే మహిళలకు బయట - కార్యాలయాల్లోనూ వేధింపులుంటున్నాయి. అయితే.. దేశ వ్యాప్తంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఈ విషయంలో ఎంతో నయమని తేలింది. ఉద్యోగినుల భద్రత విషయంలో దేశవ్యాప్తంగా సిక్కిం అత్యంత సురక్షితమైన రాష్ట్రం కాగా తెలంగాణ రెండో స్థానంలో ఉంది.

అయితే.... సిక్కిం చిన్న రాష్ర్టం కావడం.. ప్రబుత్వ - ప్రయివేటు రంగాల్లో తెలంగాణతో పోల్చితే అక్కడ తక్కువ మంది మహిళా ఉద్యోగులు ఉంటారు. తెలంగాణలోని హైదరాబాద్ లో సాఫ్టువేర్ ఇతర రంగాల్లో లక్షల సంఖ్యలో మహిళా ఉద్యోగులు ఉన్నారు. సంఖ్య పరంగా పరిగణనలోకి తీసుకుంటే తెలంగాణను టాప్ అని చెప్పుకోవాల్సి ఉంటుంది. కాగా ఉద్యోగినుల భద్రత విషయంలో ఢిల్లీ అందరికంటే చివరన ఉంది.

ఇండియాలో ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు ఏఏ నగరాలు అత్యంత భద్రతను అందిస్తున్నాయన్న విషయంమై అమెరికా సంస్థ సీఎస్ ఐఎస్ (సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్) నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇండియాలో ఉద్యోగినులకు అత్యంత భద్రతను అందిస్తున్న ప్రాంతంగా సిక్కిం నిలువగా - అత్యంత ప్రమాదకర ప్రాంతంగా ఢిల్లీ నిలిచింది. మహిళలకు పనిగంటలు - మహిళల పట్ల జరుగుతున్న నేరాలు - లైంగిక వేధింపులు - మొత్తం ఉద్యోగుల్లో మహిళల శాతం - వారికి లభించే ప్రోత్సాహకాలు - మహిళా ఔత్సాహికులు నడుపుతున్న కంపెనీలు తదితరాల ప్రాతిపదికన పాటింట్లు ఇవ్వగా - సిక్కిం 40 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచింది. ఢిల్లీకి కేవలం 8.5 పాయింట్లు మాత్రమే దక్కాయి. సిక్కిం తరువాత రెండో స్థానంలో మహిళా ఉద్యోగులకు తెలంగాణ అత్యుత్తమమని ఈ అధ్యయనంలో వెల్లడైంది. తెలంగాణకు 28.5 పాయింట్లు వచ్చాయి. ఆ తరువాతి స్థానాల్లో పుదుచ్చేరి (25.6 పాయింట్లు) - కర్ణాటక (24.7 పాయింట్లు) - హిమాచల్ ప్రదేశ్ (24.2 పాయింట్లు) - ఆంధ్రప్రదేశ్ (24 పాయింట్లు) - కేరళ (22.2 పాయింట్లు) - మహారాష్ట్ర (21.4 పాయింట్లు) - తమిళనాడు (21.1 పాయింట్లు - చత్తీస్ గఢ్ (21.1 పాయింట్లు) నిలిచాయి.