Begin typing your search above and press return to search.

అనుకున్నదే;వరంగల్ బరిలో బాబు మిత్రుడే

By:  Tupaki Desk   |   27 Oct 2015 1:39 PM GMT
అనుకున్నదే;వరంగల్ బరిలో బాబు మిత్రుడే
X
ఉన్నదే అరకొర బలం. దాంతో ఎన్నికల బరిలోకి దిగి ఉన్న పరపతిని పోగొట్టుకునే కన్నా.. కామ్ గా కూర్చోవటం ఉత్తమం. ఈ విషయం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిసినంత బాగా ఇంకెవరికి తెలుసు. పరపతి పోయే పరిస్థితిని తప్పించేందుకు మిత్రుడు సిద్ధంగా ఉంటే.. ఆనందంగా ఒప్పుకుంటారు. తెలంగాణలో ఇప్పుడు అలాంటి పరిస్థితే నెలకొంది. విభజన నేపథ్యంలో టీడీపీకి ఉన్న బలం గురించి అందరి కంటే బాగా తెలిసింది చంద్రబాబుకే. ఇప్పుడున్న పరిస్థితిలో పోటీ చేసి పరపతి తగ్గించుకునే కన్నా.. కామ్ గా వ్యవహరించటం ఉత్తమం. అందుకే అపధర్మంగా ఉన్న మిత్రుడి మాటకు విలువ ఇస్తున్నట్లుగా చెబుతూ.. మిత్రధర్మాన్ని పాటించేందుకు ముందుకొచ్చిన చంద్రబాబు వరంగల్ ఉప ఎన్నికల్లో తాము పోటీ చేయకుండా మిత్రుడికి అవకాశం ఇవ్వాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు.

వరంగల్ ఉప ఎన్నికల్లో టీటీడీపీ పోటీ చేసే అవకాశం లేదని.. మిత్రపక్షమైన బీజేపీకి అండగా నిలుస్తూ.. వారి అభ్యర్థికి తమ వంతు సాయంగా నిలుస్తామన్న మాట చెబుతారన్న వాదనకు తగినట్లే చంద్రబాబు తాజాగా నిర్ణయం తీసుకున్నారు. బాబు నిర్ణయాన్ని వెల్లడించిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రమణ.. విజయవాడలో అధినేత నిర్ణయాన్ని మీడియాకు వెల్లడించారు.

వరంగల్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిని నిలపాలన్న కార్యకర్తల కోరికను అధినేత ముందు ఉంచామని.. అయితే.. మిత్రధర్మాన్ని పాటించాలన్న విషయాన్ని చంద్రబాబు చెప్పారని.. అందుకే పోటీకి దూరంగా ఉంటూ.. బీజేపీ అభ్యర్థికి అండగా ఉంటామని చెప్పారు. ఇక.. బీజేపీ తరఫున ఎవరు పోటీ చేయాలన్న అంశాన్ని టీ బీజేపీ.. టీటీడీపీ అధ్యక్షులు కలిసి కూర్చొని నిర్ణయిస్తారని చంద్రబాబు తేల్చి చెప్పటం ద్వారా.. పార్టీలో ఎవరేం చేయాలన్న విషయాన్ని చెప్పకనే చెప్పేసినట్లైంది.