Begin typing your search above and press return to search.

ఉన్నదే ముగ్గురు.. రెండు చీలిక భేటీలా?

By:  Tupaki Desk   |   26 Oct 2017 4:10 AM GMT
ఉన్నదే ముగ్గురు.. రెండు చీలిక భేటీలా?
X
తెలంగాణ తెలుగుదేశం పార్టీ చిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆ పార్టీలో ఉన్నదే ముగ్గురు ఎమ్మెల్యేలు. ఇవాళ రెండు టీడీఎల్పీ భేటీలు జరగబోతున్నాయి. రెండు భేటీల మీద కూడా ‘అధికారిక’ అనే ముద్ర ఉండడం ఇంకా పెద్ద విశేషం. ఒకవైపు అధికారిక శాసనసభాపక్ష ఫ్లోర్ లీడర్ పిలుపు ఇచ్చిన, అసెంబ్లీ టీడీఎల్పీ ఆఫీసులో జరగాల్సి ఉన్న భేటీ. మరోవైపు పార్టీ రాష్ట్ర అద్యక్షుడు- తమ జాతీయ అధ్యక్షుడి పురమాయింపు మేరకు పార్టీ పరంగా ‘అధికారికంగా’ ప్రెవేటు హోటల్లో నిర్వహించదలచుకుంటున్న భేటీ. ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలో ఏ భేటీకి ఎందరు హాజరు అవుతారు? అనే దానిని బట్టి.. తెలంగాణలో టీడీఎల్పీ అదే విధంగా పార్టీ భవిష్యత్తు ఏమిటి అనేది నిర్ణయమౌతుంది.

తెలుగుదేశం నాయకుడు రేవంత్ రెడ్డి పార్టీని వీడిపోతున్న ప్రస్తుత ఎపిసోడ్ రకరకాల మలుపులు తిరుగుతోంది. అంతా గందరగోళం అవుతోంది. చంద్రబాబునాయుడు ప్రదర్శించిన అత్యుత్సాహం వలన ఇలాంటి గందరగోళం ఏర్పడిందని పలువురు అనుకుంటున్నారు. ఎందుకంటే.. రేవంత్ టీడీఎల్పీ భేటీ పెట్టినా కూడా అక్కడ ఉన్నదే ముగ్గురు. ఆర్.కృష్ణయ్య ఎటూ రారు. ఏదో రగడ లేకుండా గడచిపోయేది. మధ్యలో రమణ తరపైకి వచ్చి - రేవంత్ మామూలు ఎమ్మెల్యే మాత్రమే నంటూ - తాను ఎల్పీ భేటీ గోల్కొండ హోటల్లో పెడుతున్నట్లుగా ప్రకటించడం ఒక వివాదం. అదే సమయంలో.. ఆ సమావేశానికి రేవంత్ ను పిలవలేదని కూడా వార్తలు వస్తున్నాయి.

చంద్రబాబునాయుడు మౌనంగా ఉంటే పోయేదని, ఇప్పుడు పరువు బజార్న పడుతోందని పలువురు అంటున్నారు. చంద్రబాబునాయుడు అమరావతిలో ఉన్నంతకాలమూ ఆయనకు తెలంగాణ పార్టీ గురించి పట్టించుకోవడానికి తీరిక ఉండదు గానీ, లండన్ నుంచి ఇక్కడ పార్టీ గొడవల్లో తలదూరుస్తున్నాడని పలువురు అనుకుంటున్నారు. నిజానికి ఆయన తొలినుంచి తెలంగాణ పార్టీ గురించి వారానికి ఒక గంటైన సమయం - శ్రద్ధ కేటాయించి ఉంటే ఇలాంటి దుస్థితే ఏర్పడేది కాదనే అభిప్రాయాలు కూడా వినవస్తున్నాయి.

ఇప్పుడు తెదేపాకు ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఎవరు ఎటువైపో తేల్చడానికి అన్నట్లుగా.. రెండు ఎల్పీ భేటీలు జరగబోతున్నాయి. ఒక్కో భేటీకి ఒక్కో ఎమ్మెల్యే మాత్రం వస్తారని - సీఎం అభ్యర్థి అయిన మూడో ఎమ్మెల్యే డుమ్మా కొడతారని పలువురు జోకులేసుకుంటున్నారు.