Begin typing your search above and press return to search.

కాంగ్రెస్‌ లో చేరే టీడీపీ నేత‌లు ఎవ‌రంటే...

By:  Tupaki Desk   |   23 Feb 2018 3:30 PM GMT
కాంగ్రెస్‌ లో చేరే టీడీపీ నేత‌లు ఎవ‌రంటే...
X
`కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించ‌నున్న‌ బ‌స్సుయాత్ర తెలంగాణ రాజ‌కీయాల్లో కీల‌క ఘ‌ట్టంగా నిలుస్తుంది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ పాల‌న‌కు వ్య‌తిరేకంగా ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌ప‌ర‌చ‌డం, మా పార్టీ శ్రేణుల‌ను ఏకతాటిపైకి తేవ‌డం వంటి ల‌క్ష్యాలే కాకుండా కొత్త చేరిక‌ల‌కు వేదిక‌గా కాంగ్రెస్ బ‌స్సుయాత్ర ఉంటుంది. ప‌లువురు ముఖ్య నాయ‌కులు యాత్ర సంద‌ర్భంగా కాంగ్రెస్‌లో చేర‌నున్నారు` ఇది తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌ కుమార్ రెడ్డి ఇటీవ‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌.

తెలంగాణ‌ కాంగ్రెస్ కెప్టెన్ ఇంత ధీమాగా చేసిన ప్ర‌క‌ట‌న స‌హ‌జంగానే రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశం అయింది. టీపీసీసీ ర‌థ‌సార‌థి చేసిన ప్ర‌క‌ట‌న మేర‌కు ఎవ‌రు కాంగ్రెస్ గూటికి చేర‌నున్నార‌నే చ‌ర్చ తెర‌మీద‌కు వ‌చ్చింది. ఈ క్ర‌మంలో మెజార్టీ వ‌ర్గాలు తెలుగుదేశం వైపు చూస్తున్నాయి.ఇప్పటికే రేవంత్ రెడ్డి నేతృత్వంలో తొలివిడ‌త‌గా భారీగా కాంగ్రెస్ లోకి చేరిక‌లు జ‌రిగాయి. కాగా.. రెండో ద‌ఫా చేరిక‌ల‌్లో వివిధ పార్టీల ముఖ్యనేత‌లు కాంగ్రెస్ కండువా క‌ప్పుకునేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ప‌లువురు సీనియ‌ర్ నేత‌లు హ‌స్తం గూటికి చేరుతార‌ని అంటున్నారు.

గాంధీ భ‌వ‌న్ వ‌ర్గాల్లో సాగుతున్న చ‌ర్చ ప్ర‌కారం ఉమ్మడి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాకు చెందిన టీడీపీ సీనియ‌ర్ నేత‌లు - మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యేలు అయిన కొత్తకోట ద‌యాక‌ర్ రెడ్డి - కొత్తకోట సీత ద‌యాక‌ర్ రెడ్డి - మాజీ ఎంపీ రావుల చంద్రశేఖ‌ర్ రెడ్డి - ఉమ్మడి మెద‌క్ జిల్లా - గ‌జ్వేల్ నియోజ‌క వ‌ర్గం నుంచి కూడా నేతల క్యూ కట్టనున్నట్లు తెలుస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో కేసీఆర్‌ పై పోటీ చేసిన వంటేరు ప్రతాప్ రెడ్డి - నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ - మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర రావు - ఉమ్మడి క‌రీంన‌గ‌ర్ జిల్లా నుంచి మాజీ మంత్రి పెద్దిరెడ్డి కాంగ్రెస్ కండువా క‌ప్పుకునేందుకు రంగం సిద్దమైన‌ట్లు సమాచారం. కాగా రావుల చేరిక‌పై మాత్రం మ‌రింత స్పష్టత రావాల్సి ఉంద‌ని పీసీసీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇక బీసీ ఉద్యమ‌నేత కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ సైతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఆయ‌నకు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు ఇప్పటికే డిల్లీ పెద్దలతో చ‌ర్చలు కూడా పూర్తైనట్లు తెలుస్తోంది.. ఇక గ‌తంలో టీఆర్ ఎస్ ను వీడిన జిట్టా బాల‌కిష్టారెడ్డి కూడా హ‌స్తం గూటికే చేర‌నున్నట్లు సమాచారం. మొత్తంగా రాబోయే కాలంలో కాంగ్రెస్‌ లో పెద్ద ఎత్తున్నే చేరిక‌లు ఉంటాయ‌ని విశ్లేషిస్తున్నారు.