Begin typing your search above and press return to search.

ఇవాల్టితో తెలంగాణలో టీడీపీకి ఖాళీ

By:  Tupaki Desk   |   18 Aug 2019 6:53 AM GMT
ఇవాల్టితో తెలంగాణలో టీడీపీకి ఖాళీ
X
తెలంగాణలో అతి శక్తివంతమైన పార్టీగా.. బలమైన క్యాడర్ ఉన్న రాజకీయ పార్టీగా పేరున్న తెలుగుదేశం పార్టీ దారుణ పరిస్థితిని ఎదుర్కొంటోంది. తెలంగాణలోపార్టీని కాపాడుకునేందుకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఓకే చెబుతూ లేఖ ఇచ్చిన చంద్రబాబు.. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తే.. విభజనకు లేఖ ఇచ్చి తన గొయ్యి తానే తీసుకున్నారా? అన్న భావన కలుగక మానదు. రాష్ట్రం రెండు ముక్కలైనా.. తెలంగాణలో తన పార్టీ సేఫ్ గా ఉంటుందన్న బాబు అంచనాలు తలకిందులు కావటమే కాదు.. ఈ రోజున పార్టీ ఉనికికే ప్రమాదంలో పడిపోయిన పరిస్థితి.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం పలువురు నేతలు టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు వెళ్లిపోవటం తెలిసిందే. అయినప్పటికీ కొందరు నేతలు మాత్రం పార్టీ మీద ఉన్న మమకారం కావొచ్చు.. ఎమోషనల్ బాండేజ్ కావొచ్చు.. ఇతరత్రా కారణాలు కావొచ్చు. వరుస పెట్టి చోటు చేసుకుంటున్న పరిణామాల కారణంతో పాటు.. ఈ మధ్యన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పోటీ కూడా చేయలేని పరిస్థితిలోకి వెళ్లటం తెలిసిందే.

సమీప భవిష్యత్తులో టీడీపీకి ఎలాంటి సానుకూలత లేకపోవటం.. పవర్ ఫుల్ కేంద్రప్రభుత్వంతో పాటు.. దాన్ని నడిపించే మోడీ ఆయన సన్నిహితుడు అమిత్ షాలు తెలంగాణ మీద ప్రత్యేక కసరత్తు చేస్తున్న వేళ.. టీడీపీలో మిగిలిన నేతలంతా ఈ రోజున నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరగనున్న సభలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీలో అంతో ఇంతో ఇమేజ్ ఉన్న గుప్పెడు నేతలంతా కూడా పార్టీ మారిపోతున్నారు. ఈ రోజు బీజేపీలో చేరనున్న టీడీపీ ప్రముఖుల్ని చూస్తే.. రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావు.. లంకల దీపక్ రెడ్డి.. ఈగ మల్లేశం.. పాల్వాయి రజనీ కుమారి.. ఎర్ర శేఖర్.. మొవ్వా సత్యనారాయణ.. డాక్టర్ పుల్లారావ్ యాదవ్.. కోనేరు చిన్నా.. సామ రంగారెడ్డి.. కె. అంజయ్య యాదవ్.. సాధినేని శ్రీనివాసరావు.. బండ్రు శోభారాణి.. పి. జగన్నాయక్ తదితర నేతలు ఉన్నారు.

వీరితో పాటు మరికొందరు నేతలు.. వారి క్యాడర్ కూడా బీజేపీలో చేరనున్నారు. తాజా పరిణామంతో తెలంగాణలో టీడీపీలో దాదాపుగా ఖాళీ అయినట్లే. పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ లాంటి ఒకరిద్దరు మినహా టీడీపీలో నేతలంతా వెళ్లిపోయినట్లే. హైదరాబాద్ లో తెలంగాణ పార్టీ నేతలతో సమావేశం అయ్యే అవకాశం ఈ రోజు నుంచి బాబుకు లేనట్లేనని చెప్పాలి. తెలంగాణలో ఒకప్పుడు తిరుగులేని పార్టీగా పేరున్న టీడీపీ ఈరోజు ఉనికి కోసం పోరాడాల్సి రావటం చూస్తే.. కాల మహిమ ఎలా ఉంటుందో ఇట్టే అర్థం కాక మానదు.