Begin typing your search above and press return to search.

తెలంగాణ‌లో మ‌రో ఉప ఎన్నిక‌... రెడీ అవుతోన్న టీఆర్ఎస్ ?

By:  Tupaki Desk   |   5 May 2021 3:30 AM GMT
తెలంగాణ‌లో మ‌రో ఉప ఎన్నిక‌... రెడీ అవుతోన్న టీఆర్ఎస్ ?
X
తెలంగాణ‌లో 2018 డిసెంబ‌ర్‌లో సాధార‌ణ ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ రెండున్న‌రేళ్ల‌లో తెలంగాణ‌లో ఎప్పుడూ ఎన్నిక‌ల మూడ్ ఉంటూనే ఉంది. ప్ర‌తి రెండు, మూడు నెల‌ల‌కు ఏదో ఒక ఎన్నిక జ‌రుగుతోంది. ఎప్పుడూ ఎన్నిక‌ల‌తో ఇక్క‌డ పొలిటిక‌ల్ హీట్ మామూలుగా లేదు. ఈ యేడాది ఇప్ప‌టికే దుబ్బాక‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగారెడ్డి మృతితో అక్క‌డ ఉప ఎన్నిక జ‌రిగింది. దుబ్బాక ఉప ఎన్నిక ఎంతో హైఓల్టేజ్ టెన్ష‌న్ క్రియేట్ చేయ‌గా ఆ ఎన్నిక‌ల్లో బీజేపీ గెలిచింది. ఆ వెంట‌నే గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నికలు వ‌చ్చాయి. ఇక తాజాగా నాగార్జునా సాగ‌ర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక‌తో పాటు రెండు కార్పొరేష‌న్లు, ఐదు మున్సిపాల్టీల‌కు కూడా ఎన్నిక‌లు జ‌రిగాయి.

వీటితో తెలంగాణ‌లో ఎన్నిక‌లు ముగిసిన‌ట్టే అనుకుంటోన్న టైంలోనే ఇప్పుడు మ‌రో ఉప ఎన్నిక‌కు రంగం సిద్ధ‌మ‌వుతోంది. కేసీఆర్ కేబినెట్ నుంచి బ‌ర్త‌ర‌ఫ్ అయిన వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ త‌న నియోజ‌క‌వ‌ర్గంలో అనుచ‌రుల‌తో ఈ రోజు స‌మావేశ‌మ‌వుతున్నారు. అనంత‌రం ఆయ‌న త‌న‌కు జ‌రిగిన అవ‌మానం నేప‌థ్యంలో టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయ‌డంతో పాటు త‌న ఎమ్మెల్యే ప‌ద‌విని కూడా వ‌దులుకోనున్నార‌ని తెలుస్తోంది. ఈట‌ల ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం దాదాపు ఖ‌రారైన‌ట్టే అంటున్నారు. అదే జ‌రిగితే హుజూరాబాద్‌ అసెంబ్లీ స్థానానికి ఆరు నెలల్లోగా ఎప్పుడైనా ఉప ఎన్నిక నిర్వహించాలి.

అటు ఈట‌ల కూడా త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి ఇంట గెలిచి చూపించాకే ర‌చ్చ గెల‌వాల‌ని చూస్తున్నారు. త‌న రాజీనామాతో హుజూరాబాద్‌కు ఉప ఎన్నిక తీసుకొచ్చి, అక్కడ గెలిచి టీఆర్ఎస్‌, కేసీఆర్‌కు సవాల్‌ విసరాలని భావిస్తున్నార‌ట‌. ఈట‌ల బీజేపీలో చేరినా లేదా ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా ఆయ‌న‌కు బీజేపీ, కాంగ్రెస్ నుంచి కూడా స‌హ‌కారం ల‌భించ‌వ‌చ్చ‌ని అంటున్నారు. అదే జ‌రిగితే అక్క‌డ ఈట‌ల గెలుపు సులువే అవుతుంది. ఇక ఈట‌ల వ్య‌వ‌హారాల‌ను ఓ కంట క‌నిపెడుతోన్న టీఆర్ఎస్ అధిష్టానం సైతం హుజూరాబాద్ ఉప ఎన్నిక‌కు ఇప్ప‌టి నుంచే రెడీ అవుతోంది. టీఆర్ఎస్ నుంచి రెడ్డి వ‌ర్గం నేత లేదా ఈట‌ల‌ను క్యాస్ట్ ఈక్వేష‌న్‌తో ఢీ కొట్టాలంటే బీసీ నేత‌నే రంగంలోకి దింపాల‌ని భావిస్తోంద‌ట‌.

సాగ‌ర్ ఉప ఎన్నిక కోసం ముందు నుంచే ఎలా వ్యూహాలు ప‌న్నిందో ఇప్పుడు ఇప్పుడు హుజూరాబాద్‌లోనూ అదే పంథాలో ముందుకు వెళ్లాల‌ని ఆ పార్టీ భావిస్తోంది. ఈట‌ల మాత్రం ఇంట త‌న స‌త్తా ఏంటో చూపించాక‌... త‌న‌తో క‌లిసి వ‌చ్చే శ‌క్తుల‌తో కేసీఆర్‌కు షాక్ ఇవ్వాల‌ని చూస్తున్న‌ట్టు భోగ‌ట్టా ?