Begin typing your search above and press return to search.

తెలంగాణ వాహ‌న‌దారుల‌కు స్వీట్ న్యూస్‌

By:  Tupaki Desk   |   3 July 2018 5:04 AM GMT
తెలంగాణ వాహ‌న‌దారుల‌కు స్వీట్ న్యూస్‌
X
కొత్త వాహ‌నం కొనే వారికి వ‌చ్చి ప‌డే తిప్ప‌లు కొన్ని త‌ప్ప‌వు. వెహికిల్ కొన‌టం ఒక ఎత్తు అయితే.. త‌మ ఇంటికి ఏ మాత్రం సంబంధం లేని రీతిలో అల్లంత దూరాన ఉండే ఆర్టీవో ఆఫీసుకు వెళ్ల‌టం.. అక్క‌డ గంట‌ల కొద్దీ స‌మ‌యాన్ని ఖ‌ర్చు చేస్తే కానీ.. వాహ‌న రిజిస్ట్రేష‌న్ పూర్తి అయి.. నెంబ‌రు చేతికి రాని ప‌రిస్థితి. ఇక్క‌డితో అవ‌స్థ‌లు పూర్తి కావు. రిజిస్ట్రేష‌న్ చేయించుకున్న కొద్దిరోజుల‌కు హైసెక్యురిటీ ప్లేట్ త‌యారైంద‌న్న స‌మాచారం.. ఆ త‌ర్వాత మ‌ళ్లీ వాహ‌నాన్ని తీసుకెళితే.. కొత్త ప్లేట్ బిగిస్తారు.

ఎవ‌రైనా స‌రే.. కొత్త వాహ‌నం కొంటే.. క‌నిష్ఠంగా రెండుసార్లు ఆర్టీవో కార్యాల‌యాల‌కు తిర‌గాల్సిందే. దీని కార‌ణంగా స‌మ‌యం వృధా కావ‌టమే కాదు.. ఆర్టీవో ఆఫీసుల్లో అవినీతి పెర‌గ‌టానికి ఇదో కార‌ణంగా మారుతోంది. ఇదిలా ఉంటే.. వాహ‌న‌దారుల ఇబ్బందులు తొల‌గించ‌టానికి ఏపీ ప్ర‌భుత్వం వాహ‌నాలు అమ్మే డీల‌ర్లే రిజిస్ట్రేష‌న్ కార్య‌క్ర‌మాన్ని పూర్తి చేసేలా కార్య‌క్ర‌మాన్ని ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రీక్షించి.. అమ‌లు చేస్తున్నారు.

అయితే.. ఈ వాహ‌నాల‌న్నీ వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల‌కు ఉప‌యోగించుకునే వారి కోస‌మే. టూవీల‌ర్లు.. ఫోర్ వీల‌ర్లను అమ్మే డీల‌ర్లే.. వాహ‌న‌దారుల రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ‌ను పూర్తి చేసే వీలు ఉంటుంది. ఏపీ అనుస‌రిస్తున్న ఈ విధానాన్ని తాజాగా తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు సైతం అమ‌లు చేయాల‌ని భావిస్తోంది. ప్ర‌యోగాత్మ‌కంగా హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలోని ఒక‌ట్రెండు ర‌వాణా శాఖ కార్యాల‌యాల ప‌రిధిలో అమ‌లు చేసి.. వాటి ప‌లితాల ఆధారంగా తెలంగాణ వ్యాప్తంగా ఈ కొత్త విధానాన్ని అమ‌లు చేయాల‌ని భావిస్తున్నారు.

కొద్ది సంవ‌త్స‌రాల క్రిత‌మే ఇదే విధానాన్ని ఏపీ స‌ర్కారు విశాఖ‌ప‌ట్నంలో ప్ర‌యోగాత్మ‌కంగా అమ‌లు చేసి.. ఆ త‌ర్వాత రాష్ట్రమంతా విస్త‌రించింది. తాజాగా.. కేసీఆర్ స‌ర్కారు సైతం ఇదే బాట‌లో న‌డ‌వాల‌ని భావిస్తోంది. ఇదంతా వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల కోసం వినియోగించే వాహ‌నాలకు మాత్ర‌మే. ఈ నిర్ణ‌యం కార‌ణంగా ర‌వాణా శాఖ అధికారుల‌పై ప‌ని ఒత్తిడి త‌గ్గ‌టంతో పాటు.. వాహ‌న కొనుగోలుదారుల‌కు ఆర్టీవో ఆఫీసుల చుట్టూ తిరిగే తిప్ప‌లు త‌ప్ప‌నున్నాయి. హైసెక్యూరిటీ నెంబ‌రు ప్లేట్ సైతం.. ఫోరూంల‌లోనే అందించే ఏర్పాట్లు చేయాల‌ని తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు భావిస్తోంది.