Begin typing your search above and press return to search.

హవ్వా.. డబ్బివ్వలేదని ఓటు వేయరట..

By:  Tupaki Desk   |   6 May 2019 10:30 AM GMT
హవ్వా.. డబ్బివ్వలేదని ఓటు వేయరట..
X
ఏదీ ఫ్రీగా రాని రోజులివి.. ప్రజాస్వామ్యం.. తొక్కు తోలు అంటూ ఎవరూ ఆలోచించడం లేదు.. అంతా కమర్షియల్.. నీకెంత..? నాకెంత..? ఉక్కునరాలు, గట్టి సంకల్పాలు అవసరం లేదు.. అందుకే రాజకీయాలు ఇలా తగలడ్డాయి.. అవినీతి మరకలంటినా జనాలు గెలిపిస్తారు.. అందలమెక్కిస్తారు...ఈ రాజ్యం ఇంతే అని సరిపెట్టుకోవాల్సిందే..

ఓటు అనేది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. దాన్ని మనకు మనంగా వెళ్లి వేయాలి.. కానీ మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం చింతగూడ గ్రామస్థులు మాత్రం డబ్బులు ఇవ్వనిదే ఓటు వేయమని భీష్మించుకు కూర్చున్నారు. వాళ్లు డబ్బులు డిమాండ్ చేసేది సమస్యల పరిష్కారం కోసం కాదు.. పక్కోళ్లకు ఇచ్చి వాళ్లకు ఇవ్వనందుకు తాము ఓటేయమని ఖరాఖండీగా చెప్పారట.. గ్రామం బాగు కోసం ఇలా చేసి ఉంటే అర్థముండేది.. కానీ స్వలాభం కోసం ఓట్లను బహిష్కరించిన గ్రామస్థుల తీరు చూసి ఇప్పుడు అందరూ షాక్ అవుతున్నారు.

తెలంగాణలో ప్రస్తుతం జడ్పీటీసీ - ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి. చింతగూడ గ్రామంలో పోటీచేస్తున్న ఓ పార్టీకి చెందిన అభ్యర్థులు తాజాగా ఒక వర్గం వారికి మాత్రమే డబ్బులు పంచారు. దీంతో మరో వర్గం వారు నిరసన తెలిపారు. తమకు ఎందుకు డబ్బులు ఇవ్వరని.. డబ్బులు పంచకపోతే ఓటు వేయమని తెగేసి చెప్పారు. డబ్బులు ఇవ్వనందుకు ఏకంగా స్థానిక నాయకులతో ఘర్షణకు దిగారు.

గ్రామస్థుల తీరు అధికారులు.. అందరినీ షాక్ కు గురిచేసింది. సమర్థులైన నాయకులను ఎన్నుకునేందుకు రాజ్యాంగం ఇచ్చిన ఓటును నేతలు డబ్బుతో కొనడం మామూలే.. జనాలు కూడా డబ్బిస్తేనే ఓటేస్తామనడం మాత్రం ఇంతకంటే దారుణంగా మరోటి లేదు. ఓటరు ప్రలోభాలకు గురవుతున్నంత వరకు దేశంలో ప్రజాస్వామ్యం తీరు మారదనడంలో ఎలాంటి సందేహం లేదు.