Begin typing your search above and press return to search.

వేల కోట్లు వ‌చ్చి ప‌డుతున్నాయ్.. కేంద్రం హ్యాపీ!

By:  Tupaki Desk   |   1 March 2020 6:11 AM GMT
వేల కోట్లు వ‌చ్చి ప‌డుతున్నాయ్.. కేంద్రం హ్యాపీ!
X
టెలికాం కంపెనీలు చెల్లిస్తున్న బ‌కాయిలతో కేంద్ర ప్ర‌భుత్వం హ్యాపీ అవుతుండ‌వ‌చ్చు. గ‌తంలో వాడుకున్న సాంకేతిక‌త‌కు సంబంధించి ప్ర‌ముఖ టెలికాం కంపెనీలు వేల కోట్ల రూపాయ‌ల‌ను కేంద్రానికి చెల్లిస్తూ ఉన్నాయి. ఇటీవ‌లే సుప్రీం కోర్టు తీర్పుతో టెలికాం కంపెనీలు ఈ డ‌బ్బులు క‌ట్టాల్సి వ‌చ్చింది. తాము క‌ట్ట‌లేమ‌ని, దివాళా తీయాల్సిందే అని స‌ద‌రు కంపెనీలు కోర్టుకు విన్న‌వించాయి. అయినా కోర్టు మాత్రం రాజీ ప‌డ‌లేదు. చెల్లించాల్సిన బ‌కాయిలు అన్నీ చెల్లించాల్సిందే అని స్ప‌ష్టం చేసింది.

అస‌లే టెలికాం కంపెనీలు భారీ న‌ష్టాల‌తో ఉంటున్నాయి. జియో వ‌చ్చాకా ఎయిర్ టెల్ - ఐడియా వంటి కంపెనీలు త‌ప్ప‌నిస‌రిగా భారీ ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించాల్సి వ‌చ్చింది. అంత‌కు ముందు ఆ యా కంపెనీలు భారీ స్థాయిలో క‌స్ట‌మ‌ర్ల నుంచి చార్జీలు వ‌సూలు చేసుకునేవి. ఇప్పుడు మాత్రం ఆ అవ‌కాశం లేకుండా పోయింది. ఇదే స‌మ‌యంలో.. ఈ బ‌కాయిల వ్య‌వ‌హారం వాటికి భారంగా మారింది.

ఒక‌వైపు పోటీలో కొన‌సాగాలి, మ‌రోవైపు వేల కోట్ల రూపాయ‌ల పాత బ‌కాయిలు చెల్లించాలి ఇదీ ప‌రిస్థితి. ఈ ప‌రిణామాల్లో అవి చెల్లింపులు చేప‌ట్టాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ భార‌తీ ఎయిర్ టెల్ 18 వేల కోట్ల రూపాయ‌లు, వొడాఫోన్-ఐడియా 3,500 కోట్ల రూపాయ‌లు, టాటా టెలీ స‌ర్వీసెస్ 2,197 కోట్ల రూపాయ‌లు చెల్లింపులు చేసిన‌ట్టుగా తెలుస్తోంది. ఏతావాతా ఇప్ప‌టి వ‌ర‌కూ 23 వేల కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ టెలికాం కంపెనీలు కేంద్రానికి చెల్లించిన‌ట్టుగా స‌మాచారం!

అయితే ఇంకా చెల్లించాల్సిన మొత్తం భారీగా ఉంది. అదంతా ల‌క్ష కోట్ల రూపాయ‌ల‌కు పైనే కావ‌డం గ‌మ‌నార్హం. ఈ డ‌బ్బులంతా కేంద్రానికి చేరితే ప్ర‌భుత్వం ఫుల్ ఖుషీ కానుంద‌ని తెలుస్తోంది. ద్ర‌వ్య‌లోటు భ‌ర్తీకి టెలికాం బ‌కాయిల చెల్లింపు వ‌ర‌ప్ర‌దంగా మార‌నుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.