Begin typing your search above and press return to search.

వీడియో గేమ్ లు ఆడే మీ పిల్లలకు ఈ వార్త చెప్పండి

By:  Tupaki Desk   |   6 Feb 2022 3:32 AM GMT
వీడియో గేమ్ లు ఆడే మీ పిల్లలకు ఈ వార్త చెప్పండి
X
వీడియో గేమ్ లో ఉన్న సిత్రం ఏమంటే.. పరిచయం కానంత వరకు ఏం ఫర్లేదు. కానీ.. ఒకసారి పరిచయమై.. కనెక్టు అయ్యాక దాని నుంచి బయటపడటం మామూలు విషయం కాదు. ప్రేమలో పడినోడు ఎలా అయితే అయిపోతాడో.. వీడియో పిచ్చలో పడినోడి పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ ఉండదని చెప్పాలి. అయితే.. మోతాదు మించిన వీడియో గేమ్ లు ఎంత అపాయకరమన్న విషయాన్ని తాజా ఉదంతం స్పష్టం చేస్తుంది. ఒక హెచ్చరికను ఇస్తున్నగా ఉండే ఈ ఉదంతం గురించి వీడియో గేమ్ లు ఆడే వారంతా చదవాల్సిందే.

గతంతో పోలిస్తే.. వీడియో గేమ్ ల ఆసక్తి ఇప్పుడు మరింత పెరిగిపోయింది. అందునా.. చేతిలోకి ఇమిడిపోయే సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత.. ఈ అలవాటు కాస్తా.. వ్యసనంగా.. దాని మత్తు నుంచి బయటకు రాలేని పరిస్థితి. అనంతపురం జిల్లాలోని బెణికల్లు గ్రామానికి చెందిన మహేశ్ ఇంటర్ చదువుతున్నాడు. ఇంట్లోని పరిస్థితుల కారణంగా అతన్ని చదువు మాన్పించి.. పనిలో చేర్చాడు. పనికి వెళ్లినందుకు ఇచ్చే డబ్బుతో ఒక స్మార్ట్ ఫోన్ కొన్నాడు. అందులో ఫ్రీ ఫైర్ గేమ్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకొని గంటల తరబడి ఆడేవాడు. అలా నిత్యం ఆటలో మునిగి తేలేవాడు.

ఇదిలా ఉంటే.. ఈ మధ్యన అతడి ఆరోగ్యం దెబ్బ తింది. దీంతో.. రెండు రోజుల క్రితం అతని తండ్రి మహేశ్ ను తీసుకొని ఒక డయాగ్నిస్టిక్ సెంటర్ కు తీసుకెళ్లారు. తన కొడుకు మూడు నెలలుగా రాత్రిల్లు నిద్రపోవటం లేదని.. అన్నం సరిగా తినటం లేదని చెప్పారు. దీంతో.. వైద్య పరీక్షలు నిర్వహించిన వారు.. అతడి బ్రెయిన్ దెబ్బ తిన్నదన్న విషయాన్ని గుర్తించారు. స్థానిక వైద్యులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయటంతో అతడ్ని బళ్లారిలోని న్యూరాలజిస్టు వద్దకు తీసుకెళ్లారు. అదే పనిగా వీడియో గేమ్ లు ఆడటం.. మిగిలినవన్నీ వదిలేయటంతో ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయన్న మాటను చెబుతున్నారు. ఏదైనా మితంగా ఉన్నంతవరకు ఓకే. అంతకు మించి అయితే ఇలాంటి సమస్యలు ఎదురవుతాయని చెబుతున్నారు.