Begin typing your search above and press return to search.

తెలుగు ముఖ్యమంత్రులకు ఇలాంటి ఐడియాలు రావెందుకు?

By:  Tupaki Desk   |   8 July 2022 3:13 AM GMT
తెలుగు ముఖ్యమంత్రులకు ఇలాంటి ఐడియాలు రావెందుకు?
X
నోరు తెరిస్తే చాలు.. మాటలు కోటలు దాటతాయి. తమ ప్రభుత్వంలో ప్రజలకు చేస్తున్న మేలు గురించి.. తమ పాలన గొప్పతనం గురించి గొప్పలు చెప్పే విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకరి కంటే ఒకరన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. మరి.. అలాంటి ముఖ్యమంత్రులు కొన్ని కీలక అంశాల మీద పెదవి విప్పటం తర్వాత.. అసలు దాన్నో సమస్యగా కూడా గుర్తించని వైనం కనిపిస్తుంటుంది.

పాలనలో పెద్ద పీట వేయాల్సిన విద్యా.. వైద్యానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఎలా వ్యవహరిస్తాయి.. బడ్జెట్ లో వాటికి జరిపే కేటాయింపులు మాటేమిటి? అన్న విషయం గణాంకాలు చెప్పేస్తుంటాయి.

తమకు తాముగా ఐడియాలు రాకున్నా.. తోటి రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు చేపట్టే వినూత్న కార్యక్రమాల్ని చూసైనా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం చేపట్టిన ఒక కార్యక్రమం ఆసక్తికరంగానే కాదు.. స్కూలుకు వెళ్లే విద్యార్థులకు వరంగా మారిందని చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు మంచి చదువు అన్నంతనే ప్రైవేటు స్కూళ్లు తప్పించి.. సర్కారీ స్కూళ్లకు అస్సలు ఓటు వేయని వేళ.. అందరూ బడిబాట పట్టే విషయంలో ప్రైవేటునే నమ్ముకోవాల్సిన పరిస్థితి.

ప్రైవేటు స్కూళ్లలో.. బండెడు పుస్తకాలు ఇవ్వటం.. వాటిని నిత్యం మోసుకుంటూ వెళుతూ చిన్నారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటారు. అలాంటి చికాకులకు చెక్ చెప్పేందుకు వీలుగా ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం కొత్త విధానాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. బ్యాగ్ లెస్ డేస్ పేరుతో వారంలో ఒక రోజును కేటాయించింది. శనివారం అందుకు తగ్గ రోజుగా డిసైడ్ చేసింది.

అంటే.. ప్రతి శనివారం స్కూల్ కు వెళ్లే పిల్లలు తమ పుస్తకాల్ని మోసుకు వెళ్లే భారం తగ్గుతుంది. వారంలో మిగిలిన రోజుల్ని వదిలేస్తే.. ప్రతి శనివారం మాత్రం యోగా.. వ్యాయామం.. క్రీడలు.. కల్చరల్ యాక్టివిటీస్ మాత్రమే నిర్వహించేలా తాజాగా సరికొత్త ఆదేశాల్ని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. విద్యను మరింత వినోదాత్మకంగా తయారు చేయటమే ఉద్దేశమని చెబుతున్నారు.

పిల్లలకు స్కూళ్ల మీద మరింత ఆసక్తి పెంచేలా చేయటంతో పాటు.. వారికి అవసరమైన వ్యాయామం.. యోగా.. క్రీడా పోలీసులతో పాటు కల్చరల్ యాక్టివిటీస్ కారణంగా వారికి మరింత మనో వికాసాన్ని కల్పించాలన్నదే లక్ష్యంగా చెబుతున్నారు. మరి.. ఈ తరహాలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఎందుకు ఆలోచించవు? అలా చేస్తే చిన్నారులకు బండెడు పుస్తకాలు మోసే తిప్పలు ఒకరోజైనా తప్పుతాయి కదా?