Begin typing your search above and press return to search.

సొంత నేతలకే షాకిచ్చిన అచ్చెన్న

By:  Tupaki Desk   |   19 July 2021 6:30 AM GMT
సొంత నేతలకే షాకిచ్చిన అచ్చెన్న
X
తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సొంతపార్టీ నేతలు, శ్రేణులకే షాకిచ్చారట. చాలాకాలం తర్వాత శ్రీకాకుళం జిల్లాలోని సొంత నియోజకవర్గం టెక్కలిలో ఈ మధ్య అచ్చెన్న పర్యటించారట. పర్యటన సందర్భంగా పార్టీ ఆఫీసులో మద్దతుదారులు, నియోజకవర్గంలోని ముఖ్యనేతలతో సమావేశం జరిపారట. ఇంతమంది ఒకే చోట సమావేశమైనపుడు సహజంగానే అధికారపార్టీ నేతలపై ఆరోపణలు చేయటం సహజమే.

ఇపుడు కూడా చాలామంది నేతలు వైసీపీ నేతలపై ఆరోపణలు చేశారట. దానికి సమాధానంగా అచ్చెన్న చెప్పిన మాటలతో సొంతపార్టీ నేతలకే మతులు పోయాయట. ఇంతకీ అచ్చెన్న చెప్పిందేమంటే వైసీపీ నేతలపై పోరాటాలు మానేయమన్నారట. కొంతకాలం పాటు మన పోరాటాలను ఆపేయండని స్పష్టంగా చెప్పారట. వైసీపీ నేతలపై మనం పోరాటాలు చేసి సాధించేది కూడా ఏమీ లేదని కాబట్టి ఎవరి పనుల్లో వాళ్ళనుండమన్నారట.

వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు వైసీపీ నేతల విషయం చూద్దామంటు అచ్చెన్న స్పష్టంగా చెప్పేశారు. దాంతో ఏమి మాట్లాడాలో అర్ధంకాక టీడీపీ నేతలు మౌనంగా ఉండిపోయారట. అచ్చెన్న తాజా వైఖరి చూస్తుంటే తనపై పడిన కేసుల ప్రభావం బాగా కనిపిస్తోందని అర్ధమవుతోంది. నిజానికి అచ్చెన్న జిల్లాలో కూడా ఎక్కువగా ఉండటంలేదు. ఉంటే ఇటు విజయవాడలో లేకపోతే వైజాగ్ లో ఎక్కువగా ఉంటున్నారట.

పార్టీ జాతీయ అధ్యక్షుడు పిలుపిచ్చిన నిరసన కార్యక్రమాల్లో కూడా ఫుల్లుగా ఇన్వాల్వ్ కావటం లేదని పార్టీలోనే టాక్ నడుస్తోంది. జగన్ ప్రభుత్వంపై నిరసనలు తెలపాలని చంద్రబాబు చాలాసార్లే పిలుపునిచ్చారు. అయితే పార్టీ సీనియర్ నేతలు, జిల్లాల్లోని నేతలు+కార్యకర్తలు నిరసన కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటున్నారో చూసుకోవాల్సిన బాధ్యత అచ్చెన్నదే. అయితే చంద్రబాబు పిలుపు ప్రకారం మిగిలిన అందరితో పాటు తాను కూడా అన్నట్లుగా మాత్రమే అచ్చెన్న నిరసన కార్యక్రమాల్లో మమ అనిపిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

తాజా వైఖరి ప్రకారం మిగిలిన మూడేళ్ళు కూడా అచ్చెన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహా అయితే మీడియాలో మాత్రమే కనబడే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఉన్న కేసుల కారణంగా భవిష్యత్తులో మరిన్ని కేసులు పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత తనపైనే ఉందని అచ్చెన్నకు అర్ధమైనట్లుంది. తన విషయాలనే సక్రమంగా చూసుకోలేకపోతున్న అచ్చెన్న ఇక మద్దతుదారుల వ్యవహారాలను ఏమి చూడగలరు ? అందుకనే ముందుజాగ్రత్తగా దూకుడు తగ్గించుకోమని సలహా ఇచ్చినట్లు అనిపిస్తోంది. కళ్ళు మూసుకుని కూర్చుంటే మూడేళ్ళు ఇట్టే గడచిపోతాయి కాబట్టి ఎవరు కూడా ఆవేశపడి ఇబ్బందుల్లో పడద్దని సలహా ఇచ్చారు.

ప్రతిపక్ష పార్టీ నేతలపై వైసీపీ ప్రభుత్వం కేసులు పెడుతున్నది వాస్తవమే. అయితే ఎవరి మీదైతే అవినీతి ఆరోపణలున్నాయో, ఎవరైతే మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నారో వాళ్ళమీద మాత్రమే కేసులు పడుతున్నాయి. టీడీపీ అధికారంలో ఉన్నపుడు కూడా వైసీపీ నేతలపై ఎన్నో కేసులు పెట్టింది. చెవిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి లాంటి ఎందరో నేతలపై అనేక కేసులు నమోదుచేసింది. ఎంఎల్ఏలను సైతం వదలకుండా జైళ్ళకు పంపిన విషయం తెలిసిందే. అధికారంలో ఉన్నప్పటి టీడీపీ యాక్షన్ కు ఇపుడు వైసీసీ రియాక్షన్ అన్న విషయం అచ్చెన్నకు ఇపుడు బాగా అర్ధమైనట్లుంది. అందుకనే ప్రభుత్వం, వైసీపీ నేతలపై పోరాటాలొద్దని స్పష్టంగా చెప్పేశారు.