Begin typing your search above and press return to search.

తెలివిగా వ్యవహరించిన అచ్చెన్న

By:  Tupaki Desk   |   15 Sep 2021 6:45 AM GMT
తెలివిగా వ్యవహరించిన అచ్చెన్న
X
తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తెలివిగా వ్యవహరించారు. తెగేదాక లాగితే మొదటికే మోసం వస్తుందని గ్రహించినట్లున్నారు అందుకనే క్షమాపణలు చెప్పి వివాదం ముగింపుకు తనవంతు ప్రయత్నించారు. ఆమధ్య అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ పై నోటికొచ్చినట్లు మాట్లాడారు. దీనిపై ప్రివిలేజ్ కమిటికి అచ్చెన్నపై ఫిర్యాదు అందింది. అచ్చెన్నపై అందిన ఫిర్యాదును విచారించేందుకు కమిటి టీడీపీ అధ్యక్షునికి నోటీసిచ్చింది.

పోయిన నెల 31వ తేదీన వ్యక్తిగతంగా విచారణకు హాజరవ్వాలని నోటీసులో కమిటి చెప్పింది. అయితే తనకు వ్యక్తిగత పనులన్న కారణంగా హాజరుకాలేనని అచ్చెన్న రిప్లై ఇచ్చారు. దాంతో విచారణను ఈనెల 14వ తేదీన అంటే మంగళవారం నాటికి అప్పట్లో వాయిదా వేసింది. కమిటి చెప్పినట్లే 14వ తేదీన విచారణ మొదలుపెట్టింది. అయితే ఇపుడు కూడా వ్యక్తిగతంగా విచారణకు రాకపోతే జరగబోయేదేమిటో అచ్చెన్న గ్రహించినట్లున్నారు. అందుకనే వేరే దారిలేక అసెంబ్లీ హాలులో జరిగిన ప్రివేలేజ్ కమిటి విచారణకు అచ్చెన్న హాజరయ్యారు. స్పీకర్ పై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు.

క్షమాపణలు చెప్పటంతో తనవైపునుండి వివాదానికి ముగింపు పలకటానికి అచ్చెన్న ప్రయత్నించినట్లే అనుకోవాలి. అయితే అచ్చెన్న క్షమాపణలపై కమిటి సభ్యులు ఏమి నిర్ణయం తీసుకుంటారో తెలీదు. ముందుగా నోటికొచ్చినట్లు మాట్లాడటం తర్వాత క్షమాపణలు చెప్పటం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని కమిటి సభ్యులు భావిస్తే అప్పుడు చర్యలు తప్పవని సమాచారం. అయితే ఆ చర్యలు ఏమిటనేది ఇపుడు సస్పెన్సుగా మారింది.

గతంలో అంటే టీడీపీ అధికారంలో ఉన్నపుడు సభలో వైసీపీ ఎంఎల్ఏ రోజా అనుచితంగా వ్యవహరించారనే సాకుతో ఏడాదిపాటు సస్పెండ్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. నిజానికి ఎంఎల్ఏని ఏడాదిపాటు సభనుండి సస్పెండ్ చేయటం తప్పు. ఏ నిబంధన ప్రకారం చూసినా ఏడాది సస్పెన్షన్ అన్నది రూల్ బుక్ లో లేదు. ఏ సెషన్లో అయితే ఎంఎల్ఏను సస్పెండ్ చేయాలని అనుకుంటారో ఆ సెషన్ జరిగినన్ని రోజులు మాత్రమే ఎంఎల్ఏను సభనుండి సస్పెండ్ చేసే అధికారం స్పీకర్ కుంది.

తమ హయాంలో రోజాకు ఏమి జరిగిందో అచ్చెన్నకు గుర్తుకొచ్చినట్లుంది. అందుకనే తెగేంతవరకు లాగితే తనపైన కూడా ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో అని అచ్చెన్న అనుమానించినట్లున్నారు. అప్పట్లో నిబంధనలకు విరుద్ధంగా రోజాపై వేటు వేసినపుడు ఇపుడు అచ్చెన్నపైన నిబంధనల ప్రకారమే అలాంటి వేటు వేసే అవకాశం ఉందని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. పైగా స్పీకర్ నిర్ణయాన్ని ఏ కోర్టులో కూడా చాలెంజ్ చేసేందుకు అవకాశంలేదు. అందుకనే తన వంతుగా వివాదాన్ని ముగింపు పలికేందుకు అచ్చెన్న ప్రయత్నించినట్లు అర్ధమవుతోంది. చివరకు ఏమవుతుందో చూడాలి.