Begin typing your search above and press return to search.

అలెర్ట్ అయిన టీడీపీ... పవర్ ఫుల్ గానే... ?

By:  Tupaki Desk   |   27 Dec 2021 11:30 PM GMT
అలెర్ట్ అయిన టీడీపీ... పవర్ ఫుల్ గానే... ?
X
ఏపీలో కొత్త రాజకీయ పార్టీ మీద జరుగుతున్న ప్రచారంతో తెలుగుదేశం పార్టీ ఒక్కసారిగా అలెర్ట్ అయినట్లుగా కనిపిస్తోంది. గత ఇరవై నాలుగు గంటలుగా ఏపీలో కొత పార్టీ మీదనే టీడీపీలో విసృతమైన చర్చ సాగుతోందని తెలుస్తోంది. అనుకూల మీడియాలోనూ దీని మీదనే డిబేట్స్ సాగుతున్నాయి. ఇక ఏపీలో ముద్రగడ పద్మనాభానికి ఒక బలమైన సామాజికవర్గంలో పెద్ద ఎత్తున అనుచరగణం ఉంది. ఆయన ప్రభావం కూడా గట్టిగానే ఉంటుంది.

ఇక ఆయన రంగంలోకి దిగితే యాంటీ టీడీపీగానే కధ ఉంటుంది అన్న లెక్కలు కూడా ఉన్నాయి. దాంతో టీడీపీలో సీరియస్ డిస్కషన్ సాగుతోంది అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉండగానే ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఏపీకి చంద్రబాబు నాయకత్వమే శరణ్యమని చెప్పడం విశేషం. ఏపీ వైసీపీ ఏలుబడిలో అస్తవ్యస్థమైపోయిందని ఆయన విమర్శించారు.

అన్ని రంగాలు కునారిల్లాయని, ఏపీలో పాలన అన్నదే లేదని, అభివృద్ధి జాడ లేదని, వ్యవస్థలు కుప్పకూలాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాన్ని వైసీపీ సర్వనాశనం చేసిందని, ఈ టైమ్ లో చంద్రబాబు లాంటి సమర్ధుడి నాయకత్వం అవసరమని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపుని ఎవరూ అడ్డుకోలేరని అచ్చెన్న సంచలన కామెంట్స్ చేయడం విశేషం. ఏపీలో మూడవ పార్టీ అంటూ వస్తున్న వార్తలకు రియాక్షన్ గానే దీన్ని చూడాలని అంటున్నారు. ఒక విధంగా ఏపీలో కొత్త పార్టీ ఏర్పాటు ప్రతిపాదనలు సాగుతున్న నేపధ్యంలో ఇక ప్రయోగాలకు ఇది సమయం కాదని టీడీపీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఒక్క చాన్స్ అంటూ అధికారాన్ని హస్తగతం చేసుకున్న జగన్ ఏపీలో అన్ని వర్గాలను మోసం చేసారని కూడా టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. అంతే కాదు ఏపీలో ఉద్యోగులకు సీపీస్ రద్దు చేస్తామని చెప్పి జగన్ మోసం చేశారని ఆయన ఆరోపించారు. ఇక కనట్రాక్ట్ కార్మికుల విషయంలో ఇదే రకమైన మోసం జరిగింది అన్నారు. చంద్రబాబు వస్తేనే ఉద్యోగ కార్మిక వర్గాలకు కూడా న్యాయం జరుగుతుంది అని అచ్చెన్న అంటున్నారు.

అంటే టీడీపీ పవర్ ఫుల్ నినాదం అయిన సమర్ధుడు చంద్రబాబుని మళ్లీ జనం ముందుకు తీసుకువెళ్లడానికి రెడీ అవుతోంది అని తెలుస్తోంది. జనాలు సైతం ఈసారి టీడీపీకే ఓటు చేస్తారని, మరే పార్టీని నమ్మరని కూడా ధీమా వ్యక్తం చేస్తోంది. మొత్తానికి మూడవ పార్టీ అంటూ ప్రచారం జరుగుతున్న గంటల వ్యవధిలోనే టీడీపీ అలెర్ట్ కావడం, చాలా దూకుడుగా రియాక్ట్ కావడం బట్టి చూస్తూంటే ఏపీలో ఈసారి రాజకీయ సమరం మామూలుగా ఉండే అవకాశాలే లేవు అంటున్నారు. చూడాలి మరి చంద్రబాబు సమర్ధ నాయకత్వం నినాదం టీడీపీకి ఏ విధంగా మేలు చేస్తుందో.