Begin typing your search above and press return to search.

ఇక ఫిలిం ఇండస్ట్రీ డార్లింగ్ ఎవరంటే..?

By:  Tupaki Desk   |   13 Dec 2018 3:30 PM GMT
ఇక ఫిలిం ఇండస్ట్రీ డార్లింగ్ ఎవరంటే..?
X
ఫిలిం ఇండస్ట్రీలో డార్లింగ్ అని ప్రభాస్ నే కదా అంటారు.. ఇంకా డౌటేంటి అంటారా? ఐతే ఈ డార్లింగ్ సినిమా వాడు కాదులెండి. ఒక రాజకీయ నాయకుడు. ఆల్రెడీ సినీ రంగం ఆయనతో చాలా సన్నిహితంగా ఉంటోంది. ఇకముందు మరింతగా ఆయనకు చేరువయ్యే ప్రయత్నం చేయబోతోంది. ఆయన అభిమానం చూరగొనడానికి.. ప్రాపకం సంపాదించడానికి మున్ముందు సినీ జనాలు కొంచెం గట్టిగానే ప్రయత్నించే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇంతకీ ఆ డార్లింగ్ ఎవరు అంటారా.. కల్వకుంట్ల తారక రామారావు ఉరఫ్ కేటీఆర్. తండ్రి కేసీఆర్ లాగా కాకుండా జనాలతో చాలా సన్నిహితంగా మెలుగుతాడు కేటీఆర్. యూత్ ఐకాన్ అనిపించుకున్న కేటీఆర్ ట్రెండీగా కనిపిస్తాడు.. మాట్లాడతాడు.. తరచుగా సినిమాలు చూస్తాడు. సినిమా వాళ్లతో కలిసి వేడుకల్లోనూ పాల్గొంటాడు.

తాజా ఎన్నికల్లో టీఆర్ ఎస్ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో కేటీఆర్ ఇమేజ్ మరింత పెరిగింది. టీఆర్ ఎస్ విజయంతో సినీ పరిశ్రమ అంతా ఆ పార్టీ మద్దతుదారులైపోయారు. కేసీఆర్.. కేటీఆర్ లను పెద్ద ఎత్తున అభినందనల్లో ముంచెత్తారు. కేటీఆర్ తో స్నేహానికి ఇప్పుడు సినీ జనాలంతా పోటీ పడుతున్నారు. ఆయనకు ఎలాగూ సినిమాలపై ఆసక్తి ఉండటంతో ఇక టాలీవుడ్లో జరిగే సినీ వేడుకలకు ఆయన్ని ముఖ్య అతిథిగా రప్పించడానికి పోటీ పడే పరిస్థితి కనిపిస్తోంది. ముందుగా ‘వినయ విధేయ రామ’ టీం ఆయన నుంచి కమిట్ మెంట్ తీసుకుందట. ఈ చిత్ర ఆడియో వేడుకకు కేటీఆరే ముఖ్య అతిథి అంటున్నారు. చరణ్ తో కలిసి ‘ఆర్ ఆర్ ఆర్’లో నటిస్తున్న ఎన్టీఆర్ కూడా ఈ వేడుకకు వచ్చే అవకాశాలున్నాయి. ఐతే కేటీఆర్ ఈ వేడుకకు ప్రధాన ఆకర్షణ అవుతాడనడంలో సందేహం లేదు. మున్ముందు మరిన్ని వేడుకల్లో కేటీఆర్ తళుక్కుమనే అవకాశాలు కనిపిస్తున్నాయి.