Begin typing your search above and press return to search.

డ్ర‌గ్స్ కేసు : సీఎం కేసీఆర్ కు సినీ ప‌రిశ్ర‌మ లేఖ‌!

By:  Tupaki Desk   |   2 Aug 2017 4:58 PM GMT
డ్ర‌గ్స్ కేసు : సీఎం కేసీఆర్ కు సినీ ప‌రిశ్ర‌మ లేఖ‌!
X
టాలీవుడ్ లో డ్ర‌గ్స్ రాకెట్ ప్ర‌కంప‌న‌లు రేపిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సిట్ నోటీసులు జారీ చేసిన 12 మంది సినీ ప్ర‌ముఖుల విచార‌ణ పూర్త‌యింది. నోటీసులు జారీ చేసినప్ప‌టి నుంచి విచార‌ణ పూర్తయ్యే వ‌ర‌కు టాలీవుడ్ సినీ ప్ర‌ముఖులు - నిర్మాత‌లు - ద‌ర్శ‌కులు - హీరోలు - ఆర్టిస్ట్ లు - టెక్నీషియ‌న్లు త‌మ త‌మ అభిప్రాయాల‌ను వెల్ల‌డించారు. ఇండ‌స్ట్రీలో ఒక‌రిద్ద‌రు చేసిన త‌ప్పుకు మొత్తం సినీరంగానికి డ్ర‌గ్స్ క‌ళంకం ఆపాదించ‌డం స‌రికాద‌ని కొంత‌మంది సినీ ప్ర‌ముఖులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కేవ‌లం సినీ రంగాన్నే టార్గెట్ చేశార‌ని, విచార‌ణ తీరు స‌రిగా లేద‌ని వ‌ర్మ ఏకంగా సిట్ అధికార‌లను సోష‌ల్ మీడియాలో విమ‌ర్శించాడు.

రాజ‌కీయ‌, వ్యాపార రంగాల‌కు చెందిన వారు ఈ రాకెట్ లో ఉన్నార‌ని, వారి పేర్లు ఎందుకు బ‌య‌ట‌పెట్ట‌డం లేద‌ని కొంద‌రు ప్ర‌శ్నించారు. టాలీవుడ్ లో ఎవ‌ర‌న్నా డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు, స‌ర‌ఫ‌రా చేసిన‌ట్లు తెలిస్తే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని మా ప్ర‌క‌టించింది. మొత్తానికి, డ్ర‌గ్స్ రాకెట్ నేప‌థ్యంలో సినీ ప‌రిశ్ర‌మ రెండుగా చీలిపోయింద‌నే వార్త‌లు కూడా కొన్ని చానెళ్ల‌లో వ‌చ్చాయి. త్వ‌ర‌లో మ‌రో సినీ ప్ర‌ముఖుల జాబితా బ‌య‌ట‌కు రానుంద‌ని కొన్ని చానెళ్ల‌లో క‌థ‌నాలు వ‌చ్చాయి. డ్ర‌గ్స్ తీసుకున్న వారు బాధ‌తులే న‌ని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. మొత్తానికి డ్ర‌గ్స్ విచార‌ణ పూర్తి అయిన నేప‌థ్యంలో తెలంగాణ‌ సీఎం కేసీఆర్ కు తెలుగు చిత్ర పరిశ్రమ తాజాగా ఓ లేఖ రాసింది.

డ్రగ్స్‌ సమస్యను అతి సున్నితంగా పరిష్కరించాలని కేసీఆర్‌ను తెలుగు సినిమా పరిశ్రమ కోరింది. డ్రగ్స్‌ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ డ్ర‌గ్స్ కేసు వ్య‌వ‌హారం కేవ‌లం కొంత‌మందికి సంబంధించిదే అయిన‌ప్ప‌టికీ, డ్రగ్స్‌ కేసు ప్రభావం ఇండ‌స్ట్రీలోని వేలాది కుటుంబాలపై పడనుందని ఆ లేఖ‌లో తెలిపింది. సినిమా పరిశ్రమ ప్రయోజనాల‌ను దృష్టిలో పెట్టుకుని హుందాగా దర్యాప్తు సాగించాలని కోరుకుంటున్నామని తెలిపింది. ద‌ర్యాప్తున‌కు తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చింది. సమాజం, మీడియా నుంచి తాము సానుభూతి కోరుకుంటున్నామని వెల్లడించింది. డ్రగ్స్‌ కేసు విచారణ జరిగిన 10 రోజులు ఇండస్ట్రీకి చీకటిరోజులుగా వర్ణించింది. డగ్స్‌ వాడిన వారిపై తామే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపింది. డ్రగ్స్‌ వ్యవహారం తమందరికీ ఓ కుదుపు, ఓ హెచ్చరిక అని తెలిపింది.

‘డ్రగ్స్ సేవించే వారు మాకు ఎప్పటికీ హీరోలు కారు. కొందరు చేసిన పొరపాట్లకు చిత్రపరిశ్రమ తలదించుకునే పరిస్థితి రావడం బాధాకరం. వారిపై మేము క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వానికి, పోలీసులకు పూర్తిగా సహకరిస్తాం, ప్రతి ఒక్కరూ సినిమా వాళ్ల మీద తీవ్రంగా స్పందించడం బాధించింది. సమాజం నుంచి మీడియా నుంచి సానుభూతి కావాలని కోరుకుంటున్నాం. సినీ పరిశ్రమకు ఈ పది రోజులు చీకటి రోజులు’ అని ఆ లేఖలో చిత్రపరిశ్రమ పేర్కొంది.