Begin typing your search above and press return to search.

అమెరికాలో గాయ‌ప‌డ్డ శ్రీ‌లేఖ‌ కోసం విరాళాల సేక‌ర‌ణ‌!

By:  Tupaki Desk   |   27 Oct 2017 1:27 PM GMT
అమెరికాలో గాయ‌ప‌డ్డ శ్రీ‌లేఖ‌ కోసం విరాళాల సేక‌ర‌ణ‌!
X
భ‌విష్య‌త్తుపై గంపెడాశ‌ల‌తో ఉన్న‌త విద్యన‌భ్య‌సించ‌డం కోసం అమెరికాకు వెళ్లిన తెలుగు విద్యార్థిని కొల్లూరు శ్రీ‌లేఖ దురదృష్ట‌వ‌శాత్తు రోడ్డు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. అమెరికా కాల‌మానం ప్ర‌కారం సోమ‌వారం రాత్రి 7.45 గంట‌ల స‌మ‌యంలో ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగింది. న్యూయార్క్ లో ఆమె చ‌దువుతున్న‌ యూనివ‌ర్సిటీ నుంచి హాస్ట‌ల్ కు వ‌స్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. బ‌స్సుదిగి హాస్ట‌ల్ కు వెళ్ల‌డం కోసం రోడ్డు దాటుతున్న శ్రీ‌లేఖ‌ను వేగంగా దూసుకువ‌చ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఆమె త‌ల‌కు - శ‌రీరానికి బ‌ల‌మైన‌ గాయాల‌య్యాయి. తీవ్రంగా గాయ‌ప‌డ్డ శ్రీ‌లేఖ‌ను న్యూయార్క్ లోని జాన్స‌న్ న‌గ‌రంలో ఉన్న విల్స‌న్ హాస్ప‌ట‌ల్ కు త‌ర‌లించారు. అక్క‌డి వైద్యులు శ్రీ‌లేఖ మెద‌డుకు శ‌స్త్ర చికిత్స నిర్వ‌హించారు. త‌ల‌కు బ‌ల‌మైన గాయం కావ‌డంతో వైద్యులు గ‌త నాలుగు రోజులుగా ఆమెకు వెంటిలేట‌ర్ పై చికిత్స అందిస్తున్నారు. ఇంకా ఆమె ప‌రిస్థితి విష‌మంగానే ఉంది. ప్ర‌స్తుతం ఆమె చావుబ‌తుకుల మ‌ధ్య కొట్టుమిట్టాడుతూ మృత్యువుతో పోరాడుతోంది.

ఖ‌మ్మం జిల్లాలోని మ‌ధిర మండ‌లంలోని దెందుకూరు గ్రామానికి చెందిన కొల్లూరి శ్రీ‌లేఖ ఈ ఏడాది ఆగ‌స్టు నెల‌లో ఎంఎస్ చ‌దివేందుకు అమెరికా వెళ్లింది. కొల్లూరి సురేష్‌ - సుమ‌తిల‌కు శ్రీ‌లేఖ ఏకైక కుమార్తె. వారిది మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబం. సురేష్ కు రెండు ఎక‌రాల పొలం మాత్ర‌మే ఉంది. చ‌దువులో శ్రీ‌లేఖ‌ బాగా రాణిస్తుండ‌డంలో బ్యాంక్ లోన్ సాయంతో ఆమెను ఎంస్ చ‌దివిస్తున్నారు. అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి కుటుంబానికి ఆస‌రాగా ఉంటుంద‌నుకున్న కూతురు రోడ్డు ప్ర‌మాదానికి గురి కావ‌డంతో ఆ త‌ల్లిదండ్రులు క‌న్నీరుమున్నీర‌వుతున్నారు. తీవ్ర గాయాల‌తో ఆసుప‌త్రిలో ఉన్న త‌మ కూతురుని చూసేందుకు అమెరికా వెళ్ల‌డానికి సిద్ధ‌మవుతున్నారు. వారిద్ద‌రికీ ఇప్ప‌టివ‌ర‌కు పాస్ పోర్టులు కూడా లేక‌పోవ‌డంతో వాటి కోసం ద‌రఖాస్తు చేసుకున్నారు.

ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు కోసం అమెరికాకు వ‌చ్చిన మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబానికి చెందిన శ్రీ‌లేఖ దురదృష్ట‌వ‌శాత్తు రోడ్డు ప్ర‌మాదానికి గుర‌వ‌డం అమెరికాలోని తెలుగువారిని క‌ల‌చి వేసింది. అమెరికాలో వైద్య ఖ‌ర్చుల‌ను భ‌రించే స్థితిలో శ్రీ‌లేఖ కుటుంబం లేక‌పోవ‌డంతో ఆమెకు స‌హాయం అందించ‌డానికి అక్క‌డి తెలుగు వారు మాన‌వతా దృక్ప‌థంతో స్పందించారు. శ్రీ‌లేఖ వైద్య ఖ‌ర్చుల‌ కోసం క్లౌడ్ ఫండింగ్ ద్వారా విరాళాలను సేక‌రించాలనే బృహ‌త్ కార్యాన్ని మొద‌లు పెట్టారు. 1,50,000 డాల‌ర్ల విరాళాల సేక‌ర‌ణ ల‌క్ష్యంగా ఓ ఆన్ లైన్ ఫండ్ రైజ‌ర్ ను అక్క‌డి తెలుగువారు ప్రారంభించారు. స‌దుద్దేశంతో ప్రారంభించిన ఆ ఫండ్ రైజ‌ర్‌ కు మంచి స్పంద‌న వ‌స్తోంది. చావుబ‌తుకుల మ‌ధ్య కొట్టుమిట్టాడుతున్న శ్రీ‌లేఖను కాపాడుకునేందుకు చాలామంది దాత‌లు సహృద‌యంతో విరివిగా విరాళాలు ఇస్తున్నారు. సహృద‌యంతో ముందుకు రండి.... ఆ విరాళ నిధికి చేయి చేయి క‌ల‌పండి......ఓ నిండు ప్రాణాన్ని కాపాడేందుకు మీ వంతు స‌హాయం చేయండి!