Begin typing your search above and press return to search.

మోడీ సొంతూరుకి వెళ్లిన జ‌ర్న‌లిస్ట్ ఏం చెప్పారంటే

By:  Tupaki Desk   |   13 Dec 2017 7:38 AM GMT
మోడీ సొంతూరుకి వెళ్లిన జ‌ర్న‌లిస్ట్ ఏం చెప్పారంటే
X
ఇటీవ‌ల కాలంలో మ‌రే ప్ర‌ధానమంత్రికి రానంత ఇమేజ్ మోడీ సొంతం. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా అంద‌రూ ఆయ‌న్ను అభిమానించారు. ఓటుహ‌క్కు లేనోళ్లు సైతం మోడీ.. మోడీ అనేందుకు ఉత్సుక‌త ప్ర‌ద‌ర్శిస్తారు. రాక్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న మోడీ ప్ర‌ధాని కుర్చీలో కూర్చున్నంత‌నే దేశం రూపురేఖ‌ల్ని మార్చేయ‌టంతో పాటు.. రాజ‌కీయాల్ని సంపూర్ణంగా మార్చేస్తార‌ని అనుకున్నారు.

ప్ర‌ధానిగా ప‌ద‌విని చేప‌ట్టి ద‌గ్గ‌ర‌ద‌గ్గ‌ర నాలుగేళ్లు కావొస్తోంది. దాదాపుగా రెండు ద‌శాబ్దాలుగా మోడీ పుణ్య‌మా అని ఆయ‌న సొంత రాష్ట్రమైన గుజ‌రాత్ లో బీజేపీ అధికారంలో ఉంది. ఇప్పుడా రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఇలాంటి వేళ‌.. స‌గ‌టు గుజ‌రాతీ ఏమ‌నుకుంటున్నారన్న విష‌యం చాలానే క‌థ‌నాలు చెప్పాలి.
మ‌రి.. మోడీ సొంతూరు.. అదే చిన్న‌ప్పుడు ఆయ‌న చ‌దువుకున్న ఊరు.. రైల్వే స్టేష‌న్ లో టీ అమ్మిన చోట ప్ర‌ధాని గురించి ఏమ‌నుకుంటున్నారు? తాజాగా జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ విజ‌య అవ‌కాశాలు ఎలా ఉంటాయ‌న్న అంచ‌నాను చెబుతున్నార‌న్న విష‌యంపై ఆస‌క్తిక‌ర‌మైన అంశాల్ని వెల్ల‌డించారు తెలుగు జ‌ర్న‌లిస్ట్ ఒక‌రు. ఒక ప్ర‌ధాన మీడియా సంస్థ‌కు చెందిన ఆయ‌న‌.. మోడీ సొంతూరుకు వెళ్లారు. అక్క‌డ ప్ర‌జ‌ల‌తో మాట్లాడారు. గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో బీజేపీ విజ‌య అవ‌కాశాల మీద ఆరా తీశారు. ఈ సంద‌ర్భంగా మోడీ సొంతూరు ఎలా ఉంది? ఎలాంటి అభివృద్ధి ఉంద‌న్న విష‌యంతో పాటు.. మోడీ టీ అమ్మిన ఇనుప‌రేకుల షాపు ఫోటోను కూడా తెలుగు ప్ర‌జ‌ల‌కు అందించారు. మ‌రి.. ఆయ‌నేమంటున్నారు? ఆయ‌నేం చెప్పారో ఆయ‌న మాట‌ల్లోనే చ‌దివితే..

"వడ్‌ నగర్‌.. గుజరాత్‌ మెహసానా జిల్లాలో ఒక చిన్న పట్టణం. మెహసానా లోక్‌ సభ నియోజకవర్గం - ఉంఝా అసెంబ్లీ నియోజకవర్గంలో ఇది భాగం. ఇక్కడ జనాభా 30 వేలకు మించి ఉండదు. ప్రధాని మోదీ పుట్టిన ఊరు అయినందువల్ల ఈ ఊరులో లేని సౌకర్యాలు లేవు. ఊరి చుట్టుపక్కల కూడా బాగా అభివృద్ధిపరిచారు. మోదీ ఒకప్పుడు టీ అమ్మిన రైల్వే స్టేషన్‌ ను బాగా అభివృద్ధి పరుస్తున్నారు. ఆయన టీ అమ్మిన ఇనుప షెడ్‌ ను మాత్రం ముట్టుకోలేదు. బస్టాండ్‌ ను కూడా ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్యంతో ఆధునికంగా తీర్చిదిద్దుతున్నారు. వడ్‌ నగర్‌ మహాభారతం - బౌద్ధుల కాలం నుంచీ చరిత్రలో ఉన్నదని స్థానికులు అంటారు. అందుకు నిదర్శనంగా ఈ పట్టణంలో బోధిసత్వుడి విగ్రహం ఉంది. ఒకనాడు రాజులు ఈ పట్టణాన్ని ఏలారనడానికి చిహ్నంగా చుట్టూ కోటగోడలు - ద్వారాలు కనిపిస్తాయి"

"నగరం మధ్యలో మోదీ చిన్నప్పుడు ఈత కొట్టిన పెద్ద సరస్సు ఉంది. దీన్ని సుందరీకరిస్తున్నారు. చాలా ఇళ్లు పాతకాలపు చారిత్రక కట్టడాల్లా కనిపిస్తాయి. మోదీ 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకున్న బీఎన్‌ స్కూలు రైల్వేస్టేషన్‌ ఎదురుగానే ఉంది. పట్టణ వీధుల్లో తిరుగుతుంటే ఆవులు తచ్చాడడం - పిల్లలు సైకిళ్లపై ఆడుకోవడం - గృహిణులు ఇళ్ల అరుగులపై కూర్చుని ముచ్చట్లు చెప్పుకోవడం వంటి సహజ దృశ్యాలెన్నో కనిపిస్తాయి. అక్కడ కనపడ్డ ప్రతి వృద్ధుడూ తనకు మోదీ - ఆయన కుటుంబం తెలుసునని చెబుతారు. మోదీ గురించి ప్రతి ఒక్కరి వద్దా జ్ఞాపకాలెన్నో ఉన్నాయి. తాను ఆయనకు సీనియర్‌ నని ఒకరు చెబితే.. తనకంటే సీనియర్‌ అని మరొకరు చెబుతారు. ప్రతి ఒక్కరూ మోదీ ఇంటిని - ఆయన తచ్చాడిన ప్రదేశాల్ని చూపడానికి ఉత్సుకత ప్రదర్శిస్తారు. తనను వడ్‌ నగర్‌ నుంచి ఢిల్లీ పిలిపించారని జగదీశ్‌ అనే వృద్ధుడు చెప్పారు. తన మనవడి పెళ్లి కార్డు మోదీకి ఇచ్చేందుకు వడ్‌ నగర్‌ నుంచి ఢిల్లీ వెళ్లానని బాలచంద్రభాయ్‌ అనే బాల్యమిత్రుడు తెలిపారు"

"ఇంతవరకు ఒక ఎత్తయితే.. వడ్‌ నగర్‌ లో బీజేపీకి మెజారిటీ వస్తుందా.. ఈ ఊరు ఉన్న నియోజకవర్గంలో బీజేపీ గెలుస్తుందా..? ఈ ప్రశ్నకు ఎవరూ కచ్చితమైన సమాధానమివ్వడం లేదు. దీనికి కారణం వడ్‌ నగర్‌ లో పాటీదార్లు - బీసీలు - దళితులు - ముస్లింలు అధికంగా ఉండడమే. బీజేపీ తప్పక గెలుస్తుందని - కావాలంటే రాసిస్తానని జగదీశ్‌ భాయ్‌ ప్రజాపతి చెప్పారు. రైల్వేస్టేషన్‌ పక్కన మోదీ సోదరుడు ఒకప్పుడు నడిపిన దుకాణాన్ని ఈయన ఇప్పుడు నిర్వహిస్తున్నారు. పొరుగునే ఉన్న బాల్‌ బదరీశ్‌ మాత్రం ఈ విషయం ఒప్పుకోవడం లేదు. మెహసానాలోని ఏడు అసెంబ్లీ సీట్లలో రెండు సీట్లే బీజేపీకి దక్కుతాయని అన్నారు. బాల్‌ బదరీశ్‌ పటేల్‌ కనుక అలా మాట్లాడుతున్నారని ప్రజాపతి చెప్పారు. కావాలంటే నా ఫోన్‌ నంబర్‌ ఇస్తాను.. 18 వ తేదీ ఫోన్‌ చేయండని.. బదరీశ్‌ సవాల్‌ చేశారు. ఇక్కడ పటేళ్లు చాలా ఆగ్రహంతో ఉన్నారని, బీజేపీ అభ్యర్థి ప్రచారానికి వస్తే తమ మహిళలు వెళ్లగొట్టారని ఆయన తెలిపారు"

"మోదీ చదువుకున్న బీఎన్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ అశోక్‌ గోస్వామి కూడా ఈసారి బీజేపీ - కాంగ్రెస్‌ మధ్య గట్టి పోటీ ఉందని చెప్పారు. ప్రజలు కులమతాల ప్రాతిపాదికన విడిపోవడమే ఇందుకు కారణమన్నారు. అయితే మోదీ తమ ప్రాంత వాసిగా ప్రజలంతా భావిస్తున్నందున బీజేపీకే విజయావకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. స్కూల్లో పనిచేస్తున్న అటెండర్లు మాత్రం.. బీజేపీ దెబ్బతినే అవకాశాలున్నాయన్నారు. పెద్ద నోట్ల రద్దు - జీఎస్టీ ప్రభావం ఇక్కడ ఎక్కువగా ఉంది. మెహసానా జిల్లాలోని ఆరు నియోజకవర్గాల ఫలితాలను పాటీదార్లు - ఓబీసీలు - హార్దిక్‌ పటేల్‌ - అల్పేశ్‌ ఠాకూర్‌ - జిగ్నేష్‌ మేవాణీ శాసించనున్నారు. ఇక్కడ శివాజీ - పటేల్‌ - భగత్‌ సింగ్‌ లతో పాటు హార్దిక్‌ పటేల్‌ ఫొటోను చేర్చిన బ్యానర్లు చాలా చోట్ల కనిపిస్తాయి. రెండ్రోజుల కింద పోలీసుల అనుమతి లేనప్పటికీ హార్దిక్‌ భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించినప్పుడు జనం వేల సంఖ్యలో హాజరయ్యారు. అప్పుడు బీజేపీ - పాటీదార్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పాటీదార్లు బీజేపీ శిబిరాల్లోకి చొరబడి మరీ కొట్టారని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు"