Begin typing your search above and press return to search.

కేసీఆర్ చదివిన కాలేజీలో ‘తెలుగు’ తీసేశారు

By:  Tupaki Desk   |   20 March 2021 11:30 AM GMT
కేసీఆర్ చదివిన కాలేజీలో ‘తెలుగు’ తీసేశారు
X
తెలుగు భాష మీదా.. దాని నుడికారం మీద అమితమైన అభిమానాన్ని ప్రదర్శిస్తుంటారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. నాలుగేళ్ల క్రితం ప్రపంచ తెలుగు మహాసభల్ని ఘనంగా నిర్వహించిన ఆయన.. ఆ సందర్భంగా తెలుగు గురించి.. దాని గొప్పతనం గురించి.. అమ్మ భాష మీద తమ ప్రభుత్వం చేపట్టే చర్యల గురించి చెప్పినప్పుడు తెలుగు వారంతా తెగ సంతోష పడిపోయారు. ఎన్నాళ్లకు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న నేత.. అమ్మభాష మీద ప్రదర్శించిన ఆదరణ.. దానికి ఇస్తానన్న ప్రాధాన్యతను చూసి.. రాష్ట్రాలకు అతీతంగా అభినందనలు వెల్లువెత్తాయి. కట్ చేస్తే.. మిగిలిన వాటి మాదిరే.. కేసీఆర్ ఇచ్చిన హామీలేవీ అమలు కాలేదు. అంతేనా.. అంతకు మించిన ఒక అంశం తాజాగా బయటకు వచ్చి షాకింగ్ గా మారింది.

తెలుగు భాషా పండితుల్ని తయారు చేసే 14 ప్రాచ్యకళాశాలల్లో 13 మూతపడిన షాకింగ్ నిజం బయటకు వచ్చింది. అంతేనా.. కేసీఆర్ అన్నంతనే ఆయన మాటలు.. తెలుగు మీద ఆయనకున్న పట్టు ఇట్టే గుర్తుకు వచ్చేస్తాయి. ఆయన గొప్ప వక్తగా మారటానికి అవసరమైన నైపుణ్యాల్ని ఏ కాలేజీలో అయితే నేర్చుకున్నారో.. అదే కాలేజీలో తెలుగు కోర్సును తొలగించిన వైనం వెల్లడైంది. కేసీఆర్ హయాంలోనూ.. అమ్మభాషపై పెరుగుతున్న నిరాదరణకు ఇది ప్రత్యక్ష సాక్ష్యమని చెబుతున్నారు.

ఒకటి నుంచి పదో తరగతి వరకు నిర్బంధ తెలుగు బోధనను చట్టంగా తీసుకొచ్చి.. తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచినప్పటికీ.. తెలంగాణ కేంద్రీయ విద్యాలయాల్లో పదో తరగతి వరకూ నిర్బంధ తెలుగు బోధన అమలు కావటం లేదన్న కొత్త విషయం తాజాగా బయటకొచ్చింది. తెలుగు పండితులకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చే కాలేజీలు తెలంగాణలో 14 ఉంటే.. అందులో ఒక్క తెలంగాణ సారస్వత పరిషత్ మినహా మిగిలినవన్నీ మూతబడ్డాయి. గొప్ప గొప్ప సాహితీమూర్తులు.. భాషావేత్తలు.. తెలుగు బోధకులను సమాజానికి అందించిన ఆంధ్ర ప్రాచ్య కళాశాలగా ప్రారంభమైన అన్ని కాలేజీల్ని తీసేశారు.

అన్నింటికి మించిన ముఖ్యమంత్రి కేసీఆర్ చదివిన సిద్దిపేట డిగ్రీ కాలేజీలో బీఏ కోర్సులోని ‘ప్రత్యేక తెలుగు సాహిత్యం’ సబ్జెక్టును ఈ ఏడాది నుంచి పూర్తిగా తొలగించినట్లు సమాచారం. 60 ఏళ్లుగా ఆ కాలేజీలో అందుబాటులో ఉన్న ఈ కోర్సును ఈ ఏడాది నుంచి తొలగించటం.. ఆ నిర్ణయాన్ని ఒక అధికారి పుణ్యమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ చదివిన కాలేజీలో.. ఆయన చేసిన కోర్సును ఎత్తేసిన వైనంపై పెద్ద సారు ఎలా స్పందిస్తారో చూడాలి.