Begin typing your search above and press return to search.

అమెరికా అప్ డేట్స్...తెలుగు మీడియా అతికి హద్దేలేదా?

By:  Tupaki Desk   |   4 March 2017 10:47 AM GMT
అమెరికా అప్ డేట్స్...తెలుగు మీడియా అతికి హద్దేలేదా?
X
అమెరికా పరిణామాల గురించి తెలుగు టీవీ చానళ్లు చేస్తున్న అతికి హద్దు అంటూ లేకుండాపోతోంది. సమాచారం ఇచ్చే నెపంతో ప్రత్యేకించి తెలుగు టీవీ చానళ్లు ప్రసారం చేస్తున్న వార్తా కథనాలను చూస్తే నివ్వెరపోవాల్సి వస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలస వాద విధానాల్లో చేపట్టిన మార్పులు ఆందోళన కర పరిణామాలే అయినప్పటికీ.. తెలుగు మీడియా మాత్రం ఈ విషయాలను చాలా పెద్దగా చూపుతూ, ఇరవై నాలుగు గంటలూ ఇదే ప్రపంచం అన్నట్టుగా చూపుతూ... అమెరికాలో తమ వాళ్లను కలిగిన తెలుగు వాళ్లలో తీవ్రమైన ఆందోళనను పెంచుతోంది.

తెల్ల కొవ్వు.. ట్రంపోన్మాదం... అనే హెడ్డింగులు పెట్టి తెలుగు టీవీ చానళ్లు తమ పాండిత్యాన్ని అంతా ప్రదర్శిస్తున్నాయి. అమెరికాలో అంతా అయిపోతోంది.. తెలుగు వాళ్లకు తీవ్రమైన కష్టాలొచ్చేశాయి.. ట్రంప్ భారతీయులపై కక్ష సాధింపు చర్యలు చేపట్టాడు... మన వాళ్లను కష్టాల్లోకి నెట్టేస్తున్నాడు.. అన్నట్టుగా ఇష్టానుసారమైన కథనాలు ఇస్తున్నాయి తెలుగు చానళ్లు. వీళ్ల హెడ్డింగులు చూస్తేనే.. ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాయో అర్థం అవుతోంది.

అమెరికా అధ్యక్షుడు చాలా స్పష్టంగా చెబుతున్నాడు... మా వలస వాద విధానాలను మారుస్తున్నాం - కాబట్టి వీసాల నిబంధనలు మారతాయి అని. భారత్ మీద ఎలాంటి వ్యతిరేకతనూ వ్యక్తం చేయడం లేదు ట్రంప్. అయితే తెలుగు మీడియా మాత్రం ట్రంప్ కసి అంతా ఇండియా మీదే అన్నట్టుగా చూపుతోంది. అలాగే గుర్తించాల్సిన మరో విషయం ఏమిటంటే.. వీసాల జారీ విషయంలో అమెరికా సమీక్షించుకోవడం ఇది కొత్తేమీ కాదు. ఒబామా హాయంలోనూ ఇలాంటి జరిగాయి. ట్రంప్ హయాంలోనూ జరుగుతున్నాయి.

అలాగే అమెరికన్ కాంగ్రెస్ లో ట్రంప్ ఒక విషయాన్ని స్పష్టం చేశాడు. ప్రతిభా వంతులకు తాము స్వాగతం పలుకుతామని ఆయన స్పష్టం చేశాడు. కాబట్టి.. నిజంగానే ప్రతిభ కలిగిన వారు ఆందోళన చెందనక్కర్లేదు. హెచ్ వన్ బీ సవరణలు కూడా ఒక విధంగా ఇండియన్ ఉద్యోగులకు చాలా మేలు చేస్తాయి. అయితే... ఈ విషయాన్ని మీడియా పట్టించుకోవడం లేదు.

కేవలం సంచలన కథనాలు ప్రసారం చేయడమే పనిగా పెట్టుకుని.. అమెరికాలో పిల్లలో, బంధువులో కలిగిన వారిని టెన్షన్ పెడుతున్నాయి తెలుగు టీవీ చానళ్లు. అక్కడ ఏదో జరిగిపోతోందని జనాలు ఆందోళన చెందేలా చేస్తున్నాయి ఛానళ్లు. మిడిమిడి నాలెడ్జ్ తో ఈ చానళ్ల జర్నలిస్టులు చేస్తున్న అతికి హద్దు లేకుండా పోతోంది.

ఇక భారతీయులపై జరిగిన కాల్పుల ఉదంతం విషయానికి వస్తే.. అది ఖండించాల్సిన దుశ్చర్యే. అలాగని అక్కడ చాలా సంవత్సరాలుగా ఉన్న భారతీయులకు మరీ ముప్పేం ముంచుకురాలేదు. ప్రతిసారీ అలాంటి సంఘటనలు జరగకపోవచ్చు.

ఇక ట్రంప్ వీసా విధానాల్లో మార్పులు చేసినా, వలస వాద విధానాలను మార్చుకున్నా.. అది ప్రపంచాన్నంతటికీ వర్తిస్తుంది. కేవలం భారత్ వ్యతిరేకంగానో, తెలుగు వాళ్లకు వ్యతిరేకంగానో ఆ నిర్ణయం తీసుకోలేదు. అమెరికా ఫస్ట్ అంటున్న ట్రంప్ ను ప్రశ్నించే అధికారం మనకు లేదు. ఇక్కడ జరుగుతున్న అక్రమాలను ప్రశ్నించలేని మీడియా.. అమెరికా అప్ డేట్స్ అంటూ తప్పుడు కథనాలు రాస్తూ జనాల్లో టెన్షన్ పెంచుతోంది. వీటిని విశ్వసించే ముందు ఎవరికి వారు పరిశీలించుకోవాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/