Begin typing your search above and press return to search.

తెలుగు మీడియా ఉంది చూశారు.. మరీ ఇంత ఆరాచకమా?

By:  Tupaki Desk   |   2 Dec 2019 5:10 AM GMT
తెలుగు మీడియా ఉంది చూశారు.. మరీ ఇంత ఆరాచకమా?
X
అత్యాచార బాధితురాలి పేరు.. ఫోటోల్ని ప్రసారం చేయకూడదు. పత్రికల్లో అచ్చు వేయకూడదు. అత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యుల విషయంలోనూ గోపత్యత అవసరం. వారిని ఇబ్బంది పెట్టేలా రాతలు రాయకూడదు. బాధితుల పేర్లు.. వివరాలు.. ఐడెంటిటీ తెలిసేలా వెల్లడించకూడదని దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ.. ఇందుకు భిన్నంగా వ్యవహరించిన తీరుపై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది.

నిత్యం నీతులు వల్లించే తెలుగు ఆగ్రమీడియా వ్యవహరించిన తీరును పలువురు తప్పు పడుతున్నారు. శంషాబాద్ టోల్ ప్లాజా వద్ద చోటు చేసుకున్న వెటర్నరీ వైద్యురాలు దిశపై జరిగిన హత్యాచారానికి సంబంధించి తోపు మీడియాగా చెప్పుకునే తెలుగు మీడియా సంస్థలు వ్యవహరించిన వైఖరిని పలువురు తప్పు పడుతున్నారు. పేరును.. ఫోటోలను విచ్చలవిడిగా వాడేయటమే కాదు.. ఇంకా కొత్త ఫోటోలు తెప్పించరే.. రోజూ అవే ఫోటోలు వాడటం బాగోలేదంటూ డెస్క్ లకు చెందిన కీలక ఉద్యోగులు రిపోర్టర్లపై ఒత్తిడి తెచ్చినట్లుగా తెలుస్తోంది.

విచిత్రమైన విషయం ఏమంటే.. వెటర్నరీ వైద్యురాలిపై జరిగిన అమానుష కాండను ఇంగ్లిషు మీడియాలో పెద్ద ఎత్తున ఇచ్చినప్పటికీ చాలా మీడియా సంస్థలు ఆమె పేరును.. ఫోటోలను ఇప్పటివరకూ రివీల్ చేయకపోవటాన్ని మర్చిపోకూడదు. ఇంగ్లిషు మీడియా సంస్థలు వ్యవహరించిన తీరును ప్రస్తావిస్తూ.. తెలుగులోని తోపు మీడియా సంస్థలు ఇంత భారీగా తప్పు చేయటమా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

సంచలన విషయాలు తామే ముందు ఇస్తున్నామన్న భావన కలిగించేందుకు.. మైలేజీ మత్తులో పడిపోవటం.. మిగిలిన మీడియా సంస్థల కంటే తామే వేగంగా వ్యవహరిస్తున్నామన్న విషయాన్ని చెప్పుకునేందుకు వీలుగా ఎవరికి వారు విచ్చల విడిగా ఫోటోలు.. ఇతర వివరాల్ని బయటపెట్టారన్న విమర్శ ఉంది.

నైతికత గురించి పేజీల కొద్దీ వ్యాసారాలు రాసే తోపు సంస్థలు.. సమాజం ఇలా ఉండాలి.. అలా ఉండాలంటూ క్లాసులు పీకే తెలుగు మీడియా సంస్థలు వెటర్నరీ వైద్యరాలి హత్యోదంతం వ్యవహారంలో ఎందుకిలా వ్యవహరించినట్లు? అన్న ప్రశ్నకు మాత్రం ఆయా తోపు మీడియా సంస్థలకు చెందిన ప్రముఖులు నోరు మెదపటం లేదంటున్నారు. తప్పు చేసిన తర్వాత కూడా చెంపలు వేసుకోవటానికి సైతం వెనుకాడటం ఏమిటి? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.