Begin typing your search above and press return to search.

‘ఏపీ బాగు’ తెలుగు మీడియాకు ఇష్టం లేదా?

By:  Tupaki Desk   |   25 Jan 2017 7:07 AM GMT
‘ఏపీ బాగు’ తెలుగు మీడియాకు ఇష్టం లేదా?
X
మీడియా సంగతి కాసేపు పక్కన పెడదాం. సోషల్ మీడియాకు వద్దాం. నెట్ వాడే ప్రతి ఆంధ్రుడు.. చాలామంది తెలంగాణ వారు గడిచిన మూడు రోజులుగా ఫక్కాగా ఫాలో అవుతున్న అంశాల్లో విశాఖ ఆర్కే బీచ్ లో ఏపీ యువత నిర్వహించనున్న మౌన దీక్ష సంబంధించిన అంశాలు. దీనిపై ఆన్ లైన్ జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. ఫేస్ బుక్.. ట్విట్టర్.. యూట్యూబ్.. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు అన్ని మాథ్యమాల్లోనూ ఇదే చర్చ.

ఆన్ లైన్ లో మౌనదీక్ష మీద సాగుతున్న చర్చ..వెల్లడవుతున్న ఆకాంక్షలు చూస్తే.. వాతావరణం భారీగా హీట్ ఎక్కిపోయిందన్న భావన కలగటం ఖాయం. ఇలాంటి వేళ.. పొద్దున్నే వచ్చిన తెలుగు పత్రికల్ని చూస్తే షాక్ తినాల్సిందే. ఒక్క సాక్షి మినహా.. మిగిలిన రెండు ప్రధాన పత్రికల్లో విశాఖలో ఏపీ యూత్ చేపట్టనున్న మౌన దీక్షను మొదటి పేజీలో మాట వరసకు ఇచ్చింది లేదు.

తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో తెలంగాణ ఉద్యమ నేతల చేత.. ఆంధ్రోళ్ల మీడియా ఆంధ్రోళ్ల మీడియా అంటూ తరచూ విమర్శలు ఎదుర్కొన్న వేళ.. వారి వ్యాఖ్యల్ని.. విమర్శల్ని.. వారి ప్రకటనల్ని తాటికాయంత అక్షరాలతో తొలి పేజీల్లో ప్రచురించిన ప్రధాన పత్రికలు.. ఈ రోజు ఆంధ్ర ప్రజల బాగు కోసం చేపట్టిన నిరసన ర్యాలీని చాలా పరిమితంగా కవర్ చేయటం గమనార్హం.

ఇదంతా చూసినప్పుడు కలిగే అభిప్రాయం ఒక్కటే.. ఆంధ్రా బాగుపడటం తెలుగు దినపత్రికలకు ఇష్టం లేదా? అని. దినపత్రికలతో పోలిస్తే.. టీవీ ఛానళ్లు కొంతలో కొంత బెటర్ అని చెప్పాలి. సోషల్ మీడియాలో ఆర్కే బీచ్ మౌన దీక్షపై లక్షలాది మంది యూత్ కదిలిపోతుంటే.. అలాంటి విషయాలేమీ ప్రస్తావించకుండా.. తమదైన వార్తల్ని భారీగా అచ్చేసిన వైనం చూస్తే.. తెలుగు దినపత్రికలకు ఆంధ్రోళ్ల బాగు అవసరం లేదేమోనన్న భావన కలగటం ఖాయం. ఇలాంటి భావన కలిగితే.. తమ వ్యాపార మూలాలు కదిలిపోతాయన్న విషయాన్ని తెలుగు మీడియా గుర్తిస్తే మంచిదన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.