Begin typing your search above and press return to search.

మెట్రో రైల్ తో లాభ‌మా? న‌ష్ట‌మా?

By:  Tupaki Desk   |   26 Nov 2017 4:15 AM GMT
మెట్రో రైల్ తో లాభ‌మా? న‌ష్ట‌మా?
X
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హైద‌రాబాద్ మెట్రో రైలు మ‌రికొద్దిరోజుల్లో అందుబాటులోకి రానుంది. ఈ నెల 28న ప్ర‌ధాని మోడీ మెట్రో రైలును ప్రారంభించ‌నున్నారు. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం అధికారికంగా ప్రారంభ‌మైనా బుధ‌వారం ఉద‌యం 6 గంట‌ల నుంచి మాత్ర‌మే న‌గ‌ర‌వాసుల‌కు అందుబాటులోకి రానుంది.

మొద‌ట్లో చెప్పిన‌ట్లు కాకుండా మెట్రో టైమింగ్స్ విష‌యంలో ఊహించ‌ని రీతిలో నిర్ణ‌యం తీసుకున్నారు. మొద‌టి నుంచి ఉద‌యం 5 గంట‌ల నుంచి రాత్రి 11.30 గంట‌ల వ‌ర‌కు మెట్రో రైలు న‌డ‌వ‌ద‌ని తేల్చారు. మొద‌టి మూడు నెల‌లు ఉద‌యం 6 గంట‌ల‌కు మొద‌ల‌య్యే మెట్రో రైలు రాత్రి 10 గంట‌ల‌కు క్లోజ్ కానుంది. ప్ర‌యాణికుల ఆద‌ర‌ణ‌ను చూసిన త‌ర్వాత టైమింగ్స్ ను పెంచే విష‌యంలో నిర్ణ‌యం తీసుకుంటామ‌ని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. మెట్రో రైల్ ఛార్జీల ప్ర‌క‌ట‌న విష‌యంలో తెలుగులో ప్ర‌ధాన మీడియా సంస్థ‌లైన ఈనాడు.. ఆంధ్ర‌జ్యోతి రెండు వాద‌న‌లు వినిపించ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. మెట్రోరైల్ ఛార్జీలు కొన్ని మెట్రోల కంటే ఎక్కువ‌న్న విష‌యంతో పాటు.. మెట్రో రైల్ ధ‌ర‌లు భారీగా ఉన్నాయంటూ ఈనాడు పేర్కొంది. దీనికి పూర్తి భిన్న‌మైన వాద‌న‌ను.. గ‌ణాంకాల్ని ఆంధ్ర‌జ్యోతి చెప్పుకొచ్చింది. తాజాగా ప్ర‌క‌టించిన మెట్రో రైల్ ఛార్జీలు హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఏసీ బ‌స్సుల కంటే చాలా త‌క్కువ‌ని తేల్చింది.

ప్ర‌స్తుతం అమ‌ల్లో ఉన్న ఏసీ బ‌స్సు ఛార్జీలను మెట్రో రైల్ ఛార్జీల‌తో పోలుస్తూ.. కిలోమీట‌ర్ కు ఎంతెంత అన్న విష‌యాన్ని పోల్చి ప‌ట్టిక రూపంలో చెప్ప‌టంతో పాటు.. ఎంత టైం సేవ్ అవుతుంద‌న్న విష‌యాన్ని గ‌ణాంకాల రూపంలో చెప్పేసింది. ఈనాడు ఏమో మెట్రో ఛార్జీలు ప్ర‌యాణికుల‌కు భార‌మ‌న్న విష‌యాన్ని చెప్పే ప్ర‌య‌త్నం చేస్తే.. ఇందుకు భిన్నంగా ఆంధ్ర‌జ్యోతి మాత్రం అందుబాటులో ఉన్న ఆర్టీసీ బ‌స్సు చార్జీల కంటే ఎంత త‌క్కువ‌గా ఉన్నాయో చెప్పే ప్ర‌య‌త్నం చేసింది. బ‌స్సులో ప్ర‌యాణిస్తే డ‌బ్బుతో పాటు.. టైమ్ కూడా ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంది. అదే.. హైద‌రాబాద్ మెట్రో రైల్ లో ప్ర‌యాణిస్తే ఏసీ బ‌స్సు కంటే త‌క్కువ‌గా ఉండ‌టం.. విలువైన కాలాన్ని ఆదా చేసేలా ఉండ‌టం క‌లిసి వ‌చ్చే అంశంగా చెబుతున్నారు. ఒక కీల‌క అంశానికి సంబంధించి రెండు ప్ర‌ధాన మీడియా సంస్థ‌లు పూర్తి భిన్న‌మైన వాద‌న‌లు వినిపించేలా క‌థ‌నాలు అచ్చేయటం ఆస‌క్తిక‌రంగా ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.