Begin typing your search above and press return to search.

తెలుగు మీడియా పతనం..అసలేం జరుగుతోంది..?

By:  Tupaki Desk   |   11 May 2020 2:30 AM GMT
తెలుగు మీడియా పతనం..అసలేం జరుగుతోంది..?
X
ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అని పాటలు పాడేవారు ఎందరో.. కానీ ఎన్నో వ్యవస్థలు పతనమయ్యాయి. కానీ పతనం కానిది.. ఇన్నాళ్లు ప్రభుత్వాన్ని శాసించింది ‘మీడియా’. నాటి ఎన్టీఆర్ హయాం నుంచి నేటి చంద్రబాబు హయాం వరకూ తెలుగునేలపై మీడియా శాసించింది.. ప్రజలను ప్రభావితం చేసింది.. కొందరినీ ఓడించింది. కానీ ఒక్క ‘కరోనా’దెబ్బకు ఇప్పుడు కుదేలైంది. ఎందుకీ పతనం.. ఏందాక ఈ పయనం..

తెలుగు మీడియా కరోనా దెబ్బకు కుదేలైంది. జాతీయ మీడియా కూడా పతనమైనా అక్కడ ఇంతగా లేదు. కరోనాతో తీవ్రమైన సంక్షోభంలోకి మన మీడియా కూరుకుపోయింది. కరోనాతో ఈ సంక్షోభం వచ్చిందా లేదా.. కరోనాను అడ్డం పెట్టుకొని ఉద్యోగులను సాగనంపే ప్రక్రియకు మీడియా యాజమాన్యాలు తెరతీశాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. కరోనా సంక్షోభాన్ని బూచీగా చూపి ఇబ్బడిముబ్బడిగా ఉన్న జర్నలిస్టును తగ్గించుకునే ఎత్తుగడా? అన్నది అర్థం కాకుండా ఉంది. తెలుగు మీడియాలో అసలేం జరుగుతోంది..

* దమ్మున్న పత్రికలో జీతాల కోత.. తొలగింపులు

తెలుగులోనే దమ్మున్న పత్రికగా తనకు తాను ట్యాగ్ లైన్ వేసుకున్న పత్రిక లాక్ డౌన్ కరోనాతో సర్దేసుకుంది. 50శాతం ఉద్యోగులను హోల్డ్ పేరిట ఇంట్లో కూర్చుండబెట్టింది. ఉన్న ఉద్యోగులకు 25శాతం జీతాల కోత పెట్టింది. రెండు నెలల లాక్ డౌన్ కే ఎంతో పాపులారిటీ సంపాదించిన ఈ పత్రిక ఇంత నిర్ధయగా చేస్తుందని ఊహించలేదు. గత ప్రభుత్వంలో భారీగా యాడ్స్, కాంట్రాక్టులు పొందిన ఈ పత్రిక ఇప్పుడు కరోనాతో ఒక్క నెల కూడా భరించకపోవడం.. జీతాలు కట్ చేయడం.. ఉద్యోగులను తొలగించడం నిజంగా విడ్డూరమే..

*కమ్మ చానెల్ లో ఆకస్మిక తొలగింపులు

ప్రతిపక్ష పార్టీకి బాకా ఊదే కమ్మ వర్గానికి చెందిన తెలుగులోనే టాప్ న్యూస్ న్యూస్ చానెల్ లో ఇప్పటికే 35మందిని తొలగించారు. మరికొంతమందికి నోటీసులిచ్చారట.. ఈ సంస్థ యజమానికి హెయిర్ ఆయిల్, ఇతర వ్యాపారాలు కూడా ఉన్నాయి.. ఆదాయం బాగా ఉన్న కరోనాతో తొలగింపులు మాత్రం ఆపలేదు..

*తెలంగాణలో నంబర్ 1 న్యూస్ చానెల్ కు ఏం తక్కువైంది..?

తెలంగాణలోనే అత్యంత ఆర్థికంగా బలంగా ఉన్న మాజీ ఎంపీ నిర్వహిస్తున్న ఆ నంబర్ 1 చానెల్ కూడా కరోనా టైంలో , కొత్తగా ప్రారంభించిన తన పత్రికలో జర్నలిస్టును తీసేయడం.. జీతాల కోతలు విధించడం చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. దశాబ్ధాలుగా ఇనుము, ఉక్కు పరిశ్రమలు సహా దేశవ్యాప్తంగా పేరొందిన పరిశ్రమలు ఉండి.. విశ్వసనీయత కలిగిన ఆ మాజీ ఎంపీ కూడా ఇలా జర్నలిస్టుల పట్ల ఇంత నిర్ధయగా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

*చానెల్, ఆంగ్ల పత్రిక కలిగిన సంస్థలో 50శాతం కోత

ఇక ఇంగ్లీష్ పత్రిక కలిగిన తెలుగు న్యూస్ చానెల్ ఏకంగా జీతాల్లో 50శాతం కోత విధించింది. ఆ 50లో టాక్సులు కూడా కట్ చేసేసుకుందట.. ఇంతకంటే జీతం ఇవ్వకున్నా బెటర్ అని జర్నలిస్టులు ఆడిపోసుకుంటున్నారట.

*జనసేన సపోర్టు చానెల్ జీతాలివ్వడం లేదట..

కామ్రేడ్స్ స్థాపించి జనసేన పార్టీ నేత కొన్న చానెల్ లో అసలు జీతాలే ఇవ్వడం లేదట.. మూడు నెలలుగా బకాయిపడిన సంస్థ ఎప్పుడు ఇస్తుందో చెప్పడం లేదట.. యాజమాన్యం వైఖరిపై ఉద్యోగులు ధర్నా చేసినా ఆ సంస్థ తీరు మారడం లేదు.

*జర్నలిజం బ్యాక్ గ్రౌండ్ లేని సంస్థలు హుళక్కే

జర్నలిజం బ్యాక్ గ్రౌండ్ ఉన్న మీడియా సంస్థలు అంతో ఇంతో సగం ఇచ్చో సర్ధి చెప్పో జర్నలిస్టులను కాపాడుకుంటున్నాయి. కానీ ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా వ్యవస్థను మేనేజ్ చేద్దామని ఈ రంగంలోకి వచ్చి టీవీచానెల్,పత్రికలు పెట్టిన కొత్త జనరేషన్ వ్యక్తులు మీడియాలోకి ఎంటర్ అయ్యి కష్టాలు వస్తే నట్టేట ముంచి వెళ్లిపోతున్నారు. వారి వల్ల అమాయకపు జర్నలిస్టులు ఆశపడి చేరి బలైపోతున్నారు. ఇక మీడియా కూడా అప్ డేట్ కాకుండా డిజిటల్ వైపు మళ్లాకుండా పాత చింతకాయ పచ్చడి వ్యవహారాలు చేస్తూ సంస్థలను.. జర్నలిస్టులను ముంచేస్తున్నాయి. ఈ కరోనా సంక్షోభం తోనైనా మీడియా సంస్థలు కొత్త పాఠాలు నేర్పి భవిష్యత్ ను తీర్చిదిద్దుకుంటాయో.. కాలగర్భంలో కలిసిపోతాయో చూడాలి.