Begin typing your search above and press return to search.

సెలవొస్తే తెలుగోళ్లు.. ఇళ్లల్లో ఉండటం లేదా?

By:  Tupaki Desk   |   19 July 2015 5:05 AM GMT
సెలవొస్తే తెలుగోళ్లు.. ఇళ్లల్లో ఉండటం లేదా?
X
సెలవొస్తే.. హాయిగా ఇంట్లో కూర్చొని కుటుంబ సభ్యులతో ముచ్చట్లతో.. టీవీ చూస్తూ ఉండిపోయే రోజులు చెల్లిపోయాయా? అంటే అవుననే చెప్పకతప్పదు. గత కొన్నేళ్లుగా లైఫ్ స్టైల్ లో వస్తున్న మార్పులు.. ఇప్పుడు మరింత జోరందుకున్నట్లుగా కనిపిస్తోంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజల జీవనవిధానం మారిందా? వారి అలవాట్లు.. అభిరుచుల్లో పెద్దఎత్తున మార్పు చోటు చేసుకుంటుందా? అంటే అవుననే చెప్పాల్సి వస్తోంది. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తే.. ఏ మాత్రం సెలవు దొరికినా ఎవరికి వారు ప్రయాణం చేసే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

గత పదేళ్ల కాలంలో ప్రయాణాలు చేసే వారి సంఖ్య పెరిగినప్పటికీ.. గత మూడేళ్లుగా ఇది మరింత పెరిగినట్లుగా చెప్పాలి. ఒక్కమాటలో చెప్పాలంటే.. సెలవు రోజు తెలుగు వారు ఇళ్లల్లో ఉండేందుకు ఏ మాత్రం ఇష్టపడటం లేదు. తెలిసిన స్నేహితుల ఇళ్లకో.. బంధువుల ఇళ్లకో లేదంటే.. విహారయాత్రలకు.. పుణ్యక్షేత్రాలకు ఇలా ఏదో ఒక కారణంగా ఇంట్లో ఉండకుండా ఉంటున్న పరిస్థితి.

ఒకవేళ.. వరుసగా రెండు.. మూడు రోజులు సెలవులు వస్తే.. ముందుగానే.. ఆయా రోజులకు ఏదో ఒక ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటున్న పరిస్థితి. నిజానికి ఈ కొత్త అలవాటు.. ఐటీ బూమ్ తో మొదలైందని చెప్పాలి. కాలేజీ నుంచి చదువులు అయిపోయిన వెంటనే ఉద్యోగులు వచ్చేయటం.. జీతాలు భారీగా ఉండటంతో.. వారాంతం రెండు రోజులుగా ఉండటంతో.. ఒక్కడిగా ఉండలేక.. రెండు రోజుల సెలవల్ని నచ్చిన వారి దగ్గరో.. ఇంటికి వెళ్లేందుకో వినియోగించటం మొదలైంది.

శుక్రవారం రాత్రి మొదలయ్యే ప్రయాణం.. సోమవారం తెల్లవారుజాముకు పూర్తయ్యేలా ప్లాన్ చేసే ధోరణి షురూ అయి.. అదిప్పుడు పీక్ స్టేజ్ కి చేరిందని చెప్పొచ్చు.తాజాగా శనివారం సంగతే తీసుకోండి. ఒక్క శనివారం రోజున గోదావరి పుష్కరాలు చేసిన వారి సంఖ్య 1.05కోట్లు. వీరు కేవలం స్నానం చేసిన వారు మాత్రమే. వీరు కాకుండా.. ప్రయాణాల్లో ఉన్న వారి సంఖ్య చేరిస్తే మరింత ఎక్కువగా ఉంటారు. మరి జనాలు గోదావరి పుష్కరాల్లో బిజీగా ఉన్నారని భావిస్తే తప్పులో కాలేసినట్లే.

ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో శనివారం అర్థరాత్రికి 90వేల మంది దర్శనం చేసుకుంటే.. స్వామివారి దర్శానానికి వేలాదిమంది ఇంకా వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఇక.. ఈ రెండే కాదు.. హైదరాబాద్ మహా నగరమే తీసుకుంటే.. గోదావరి పుష్కరాల కోసం భారీగా జనాలు బయటకు వెళ్లినా.. మల్టీఫ్లెక్సులు.. షాపింగ్ మాల్స్.. పర్యాటక ప్రదేశాలు.. పలుహ్యాంగౌట్స్ అన్నీ కిక్కిరిసి ఉన్న విషయాన్ని మర్చిపోలేం.

ఈ వ్యవహారం ఒక్క హైదరాబాద్ కు మాత్రమే కాదు.. విశాఖ.. విజయవాడ.. గుంటూరు.. ఒంగోలు.. నెల్లూరు.. తిరుపతి.. శ్రీశైలం.. ఇలాంటి చాలానే పట్టణాల్లో ఇలాంటి పరిస్థితే. మొత్తంగా చూస్తే.. సెలవు రోజు ఇంట్లో ఉండే కన్నా.. నలుగురు కలిసి బయటకు వెళ్లటం అన్నది ఒక అలవాటుగా మారినట్లుగా కనిపిస్తోంది.