Begin typing your search above and press return to search.

చంద్రుళ్ల ఇద్ద‌రికి దెబ్బేసిన ఎన్నిక‌లు!

By:  Tupaki Desk   |   23 May 2019 8:02 AM GMT
చంద్రుళ్ల ఇద్ద‌రికి దెబ్బేసిన ఎన్నిక‌లు!
X
తెలుగు రాష్ట్రాల్లోని ఇద్ద‌రు చంద్రుళ్ల‌కు ఒకేసారి షాకిచ్చారు తెలుగు ప్ర‌జ‌లు. ఒక‌రి అహంకారానికి.. మ‌రొక‌రి మితిమీరిన ఆత్మ‌విశ్వాసానికి భారీ దెబ్బ త‌గిలింద‌ని చెప్పాలి. చేతికి అధికారం ఇచ్చింది రాష్ట్రాన్ని అభివృద్ధి చేయ‌మంటే..ఇద్ద‌రు చంద్రుళ్లు ఆ విష‌యాన్ని వ‌దిలేసి.. దేశాన్ని ఏలేస్తామ‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన తీరు ప్ర‌జ‌ల్లో కోపాన్ని పెంచ‌ట‌మే కాదు.. వారికి బుద్ధి చెప్పాలన్న త‌మ నిర్ణ‌యాన్ని ఓటుతో చెప్పార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

నూటికి వెయ్యిశాతం త‌మ గెలుపు ఖాయ‌మ‌న్న చంద్ర‌బాబు.. తాజాగా వెలువ‌డుతున్న ఫ‌లితాల్ని క‌ల‌లో కూడా ఊహించి ఉండ‌రు. ఓడిపోతే ఓడిపోవ‌చ్చు కానీ.. మ‌రీ ఇంత దారుణ‌మైన ఓట‌మిని ఆయ‌న ఎప్పుడూ ఊహించి ఉండ‌రు. టీడీపీ చ‌రిత్ర‌లో ఇంత దారుణ‌మైన ఓట‌మికి బాబు కార‌ణమ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. పాల‌న‌లో ఆయ‌న వైఫ‌ల్యమే ఏపీలో దారుణ ఫ‌లితాల‌కు కార‌ణంగా చెప్పాలి.

175 స్థానాలున్న ఏపీ అసెంబ్లీలో క‌డ‌ప‌టి వార్త‌ల ప్ర‌కారం 152 స్థానాల్లో అధిక్య‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తుంటే.. అధికార టీడీపీకి కేవ‌లం 23 స్థానాలు మాత్ర‌మే రావ‌టం చూస్తే.. ప్ర‌జ‌ల్లో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం మీద ఎంత‌టి వ్య‌తిరేక‌త ఉంద‌న్న విష‌యం ఇట్టే అర్థం కాక మాన‌దు.

ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు సైతం తెలంగాణ ప్ర‌జ‌లు ఓటుతో బుద్ధి చెప్పార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. తాను ఏమ‌నుకుంటే అదే వేదం అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తూ.. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో ఆయ‌న చెప్పిన మాట‌ల‌కు స్పంద‌న‌గా తెలంగాణ ప్ర‌జ‌లు త‌మ ఓటుతో స‌మాధానం చెప్పార‌ని భావించ‌క త‌ప్ప‌దు. తెలంగాణ‌ను బంగారు తెలంగాణ చేయ‌టం మానేసి.. ఢిల్లీకి వెళ్లేసి ఏలేద్దామ‌న్న కేసీఆర్ ఆలోచ‌న‌ను ఆదిలోనే గండికొట్టార‌ని చెప్పాలి.

తాను ఢిల్లీలో చ‌క్రం తిప్పుతూ.. తెలంగాణ‌లో కొడుక్కి ప‌ట్టం క‌ట్టాల‌న్న ఆలోచ‌న‌ను తెలంగాణ ప్ర‌జ‌లు తిర‌స్క‌రించిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు. మొత్తం 17 స్థానాల్లో ఒక స్థానం త‌న మిత్రుడికి వ‌దిలేసిన కేసీఆర్‌.. మిగిలిన 16 ఎంపీ స్థానాల్లో విజ‌యం ఖాయ‌మ‌న్న ధీమాను వ్య‌క్తం చేశారు. నిన్న‌టికి నిన్న (బుధ‌వారం) పార్టీ ఎంపీ అభ్య‌ర్థులంతా గెలుస్తున్నార‌ని.. వేడుక‌ల‌కు సిద్ధం కావాల‌న్న పిలుపునివ్వ‌టం ద్వారా మితిమీరిన ఆత్మ‌విశ్వాసాన్ని ప్ర‌ద‌ర్శించారు. తీరా చూస్తే.. 16 ఎంపీ స్థానాల‌కు కేవ‌లం 8 స్థానాల్లో మాత్రం టీఆర్ ఎస్ అధిక్య‌త‌లో కొన‌సాగుతున్న ప‌రిస్థితి. 2014 ఎన్నిక‌ల్లో 11 స్థానాలున్న పార్టీ ఇప్పుడు మూడు ఎంపీస్థానాల్ని కోల్పోయే ప‌రిస్థితి కేసీఆర్ వైఫ‌ల్యంగా చెప్ప‌క త‌ప్ప‌దు. అన్నింటికి మించి ఆయ‌న కుమార్తె.. నిజామాబాద్ ఎంపీ క‌విత ప్ర‌స్తుతం వెనుకంజ‌లో ఉన్న వైనం షాకింగ్ గా మారింది. కార‌ణాలు ఏమైనా.. మొత్తంగా చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు ప్ర‌జ‌లు ఇద్ద‌రు చంద్రుళ్ల‌కు షాకిచ్చార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.