Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల సీఎంలు..ఆ రాష్ట్రాల గురించి వింటున్నారా?

By:  Tupaki Desk   |   28 March 2021 7:30 AM GMT
తెలుగు రాష్ట్రాల సీఎంలు..ఆ రాష్ట్రాల గురించి వింటున్నారా?
X
లాక్ డౌన్ అవసరం లేదని అసెంబ్లీ సమావేశాల్లో తేల్చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. అందుకు కారణం కూడా ఆయన వెల్లడించారు. నిజమే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో లాక్ డౌన్ ను విధించే పరిస్థితి ప్రభుత్వానికి లేదు. దాన్ని అమలు చేస్తే.. తట్టుకునే సత్తా ప్రజలకు లేదు. ఇలాంటివేళ.. అప్రమత్తంగా ఉంటూ.. జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అయితే..లాక్ డౌన్ విధించకున్నా.. కొన్ని అంశాల్లో కఠినంగా వ్యవహరించటం ద్వారా కేసుల నమోదును తగ్గించుకునే వీలుంది.

తెలుగు రాష్ట్రాల్లో మాస్కుల్ని ధరించటం మానేసి చాలా కాలమే అయ్యింది. ఒక లెక్క ప్రకారం మాస్కుల విషయంలో ప్రజల్లో అవగాహన 90 శాతం ఉంటే.. మాస్కును విధిగా పెట్టుకుంటున్న వారు కేవలం 44 శాతం మాత్రమే. తెలుగు రాష్ట్రాల్లో ఈ సంఖ్య మరింత తక్కువన్న మాట వినిపిస్తోంది. మరి.. అలాంటి వారి విషయంలో మొన్నటివరకు చర్యలు లేవు. రెండు రోజుల నుంచే మాస్కులు పెట్టుకోవటం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మహారాష్ట్ర.. పంజాబ్.. కర్ణాటక.. కేరళ.. లాంటి కొన్ని రాష్ట్రాలతో పోలిస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసుల సంఖ్య తక్కువే. అయితే.. కఠిన చర్యలు తీసుకోవటంతో పాటు.. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఉదాహరణకు కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్న నిబంధనల్ని చూసైనా తెలుగు రాష్ట్రాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్న మహారాష్ట్రలో మాల్స్.. రెస్టారెంట్లు.. పార్కుల్ని రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మూసి ఉంచుతున్నారు. మాస్కు ధరించని వారికి రూ.500.. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేసిన వారికి రూ.వెయ్యి చొప్పున జరిమానా విధిస్తున్నారు.

గుజరాత్ విషయానికి వస్తే.. తమ రాష్ట్రానికి వచ్చే ఇతర రాష్ట్రాల వారు తప్పనిసరిగా కరోనా నెగిటివ్ నివేదిక ఉంటే తప్పించి తమ రాష్ట్రంలోకి అనుమతించమని చెబుతోంది. మరోవైపు గోవాలోనూ కఠిన చర్యల్ని తీసుకుంటున్నారు. హోలీ.. సాబ్ ఏ బారత్.. ఈస్టర్.. ఈద్ ఉల్ ఫితర్ పండుగల్ని పరిగణలోకి తీసుకొని ఉత్తర.. దక్షిణ గోవా జిల్లాల్లో 144వ సెక్షన్ అమలు చేస్తున్నారు.

ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే పెళ్లిళ్లకు 200 మంది వరకే అనుమతి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. మధ్యప్రదేశ్ లోని 12 నగరాల్లో ఆదివారం లాక్ డౌన్ విధిస్తున్నట్లు ఆ రాష్ట్రం పేర్కొంది. ఇలా పలు రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యల్ని పరిశీలించి.. అందుకు తగ్గట్లు నిర్ణయాల్ని తీసుకుంటే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ అంశంపై ఎప్పుడు ఫోకస్ పెడతారో?