Begin typing your search above and press return to search.

జూన్ లో మరోసారి భేటీ కానున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు ..!

By:  Tupaki Desk   |   20 May 2020 8:50 AM GMT
జూన్ లో మరోసారి భేటీ కానున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు ..!
X
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి..మరోమారు భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ భేటీ నదీజలాలే ప్రధాన అంశంగా జరగబోతుంది అని తెలుస్తోంది. లాక్‌ డౌన్ ముగిసిన తర్వాత వీరి సమావేశం ఉంటుందని, ఉన్నతస్థాయి వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ మేరకు జూన్ మొదటి వారంలో ఈ భేటీ ఉండవచ్చనే సమాచారం. ఇప్పటివరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్ ఇప్పటికి నాలుగుసార్లు సమావేశమయ్యారు.

తొలిసారిగా అధికారుల బ‌ృందంతో కలిసి జూన్ 28న ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఆగస్టు1న రెండో సారి, సెప్టెంబర్ 23న మూడోసారి అధికారుల బృందంతో కలిసి భేటీ అయ్యారు. ఈ ఏడాది జనవరి 13న నాలుగోసారి భేటీ అయ్యారు.ఈ సమావేశాలలో ప్రధానంగా విభజన సమస్యలు కొన్ని కొలిక్కితేవడంతో పాటు గోదావరి-కృష్ణా అనుసంధానం, సాగునీటి ప్రాజెక్టులపైనే ప్రధానంగా చర్చించారు.

పోతిరెడ్డిపాడు విస్తరణకు సంబంధించి అసెంబ్లీలో ప్రకటన చేసిన తర్వాత జగన్‌ తెలంగాణ సీఎంను కలిశారు. నదుల అనుసంధాన సమస్యపై గతంలో మూడుసార్లు ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరిగింది. తాజా మీడియా సమావేశంలోనూ.. మొత్తం కృష్ణా, గోదావరిలో నీటి లభ్యత.. ఇరు రాష్ట్రాల అవసరాల ప్రాతిపదికగా ముందుకు వెళ్తామని కేసీఆర్‌ ప్రతిపాదించారు. పోతిరెడ్డిపాడు జీవో కేంద్రంగా.. ప్రస్తుతం ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు వివిధ వేదికలపై పోరాడుతున్న నేపథ్యంలో.. ఇరువురు ముఖ్యమంత్రుల భేటీతోనే ఈ అంశం ఓ కొలిక్కివస్తుందని అందరూ భావిస్తున్నారు. ప్రస్తుతం పోతిరెడ్డిపాడు జీవో పై ఇరు రాష్ట్రాల్లో రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.