Begin typing your search above and press return to search.

112 పద్మాల్లో తెలుగోళ్లు14 మంది

By:  Tupaki Desk   |   26 Jan 2016 4:42 AM GMT
112 పద్మాల్లో తెలుగోళ్లు14 మంది
X
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే పద్మ పురస్కారాలకు సంబంధించి ఈసారి భారీగానే ప్రకటించారు. తాజా పద్మాల ప్రకటనలో తెలుగువారి వాటా కూడా ఎక్కువనే చెప్పక తప్పదు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది భారీగా పద్మ పురస్కారాల్ని ప్రకటించింది. మొత్తం మూడు విభాగాల (పద్మవిభూషణ్.. పద్మ భూషణ్.. పద్మశ్రీ)కు సంబంధించి మొత్తం 112 మందిని ఎంపిక చేశారు. వీరిలో తెలుగు ప్రాంతానికి చెందిన వారు 14 మంది ఉండటం విశేషంగా చెప్పాలి.

ఇక.. దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ అవార్డులు తెలుగోళ్లు ఇద్దరికి దక్కటం మరో విశేషంగా చెప్పాలి. ఈ అవార్డును ఈనాడు సంస్థల అధినేత.. మీడియా మొఘల్ చెరుకూరి రామోజీరావుకు.. ప్రఖ్యాత నాట్య కళాకారిణి యామినీ కృష్ణమూర్తికి దక్కాయి. కేంద్రం ప్రకటించిన పద్మ విభూషణ్ పురస్కారాలు మొత్తం 10 మందిని ఎంపిక చేస్తే.. ఇందులో ఇద్దరు తెలుగోళ్లు ఉండటం గమనార్హం.

ఇక.. పద్మభూషణ్ అవార్డుల విషయానికి వస్తే.. పద్మభూషణ్ ను ఈసారి 19 మందిని ఎంపిక చేయగా వారిలో ఐదుగురు తెలుగు ప్రాంతానికి చెందిన వారు ఉండటం మరో విశేషంగా చెప్పాలి. వీరిలో యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ (సాహత్యం..విద్య).. డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డి (గ్యాస్ట్రో ఎంట్రాలజీ).. డాక్టర్ ఆళ్ల వెంకట రామారావు (సైన్స్ అండ్ ఇంజనీరింగ్).. సైనా నెహ్వాల్ (క్రీడలు-బ్యాడ్మింటన్).. సానియా మీర్జా(క్రీడలు- టెన్నిస్)లకు దక్కాయి.

ఇక.. పద్మశ్రీ కేటగిరిలో మొత్తం 83 మందికి పురస్కారాలు లభించగా.. అందులో ఏడుగురు తెలుగువారికి పురస్కారాలు లభించాయి. పద్మవిభూషణ్.. పద్మ భూషణ్ లతో పోలిస్తే.. పద్మశ్రీలు తెలుగువారికి కాస్త తక్కువే వచ్చాయని చెప్పాలి. ఇక.. పద్మశ్రీ పురస్కారాలు వచ్చిన తెలుగు వారిని చూస్తే.. ఎస్.ఎస్. రాజమౌళి (సినిమా).. లక్ష్మా గౌతడ్ (పెయింటింగ్).. డాక్టర్ మన్నం గోపీచంద్ (వెద్యం).. డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే (వైద్యం).. డాక్టర్ నాయుడమ్మ యార్లగడ్డ (వైద్యం).. సునీతా కృష్ణన్ (సేవారంగం).. డాక్టర్ టీవీ నారాయణ (సామాజిక సేవ)లు ఉన్నారు. తెలుగు ప్రాంతానికి చెందిన ఇంతమందికి పద్మ పురస్కారాలు దక్కటం తెలుగువారందరికి గర్వకారణమే.