Begin typing your search above and press return to search.

12 రాష్ట్రాలు తగ్గించాయి.. తెలుగు రాష్ట్ర సీఎంలు నిర్ణయం తీసుకోరెందుకు?

By:  Tupaki Desk   |   5 Nov 2021 3:58 AM GMT
12 రాష్ట్రాలు తగ్గించాయి.. తెలుగు రాష్ట్ర సీఎంలు నిర్ణయం తీసుకోరెందుకు?
X
దేశంలో మరెక్కడా లేని రీతిలో సంక్షేమ పథకాల్ని అమలు చేసే రాష్ట్ర ముఖ్యమంత్రులుగా తెలుగు రాష్ట్రాలకు చెందిన సీఎంలు కేసీఆర్.. వైఎస్ జగన్మోహన్ రెడ్డిలకు మంచి పేరు ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సరిగా లేకున్నా.. ప్రజల కోసం.. కొన్ని వర్గాల సంక్షేమం కోసం వారు ప్రకటించే పథకాలు తరచూ హాట్ టాపిక్ గా మారతుంటాయి. ఇలా ఉండగా.. పెట్రోల్.. డీజిల్ ధరలు భారీగా పెరిగిపోయి.. సామాన్యుడికి చుక్కలు కనిపిస్తున్న వేళ.. రాష్ట్రాలు తమ వాటా కింద వడ్డించే పన్ను పోటు నుంచి తప్పించరేమన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పని పరిస్థితి.

ఇదిలా ఉంటే.. రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్.. డీజిల్ ధరల పెరుగుదలకు కళ్లాలు వేస్తే.. కేంద్రం విధించే ఎక్సైజ్ పన్నును లీటరు పెట్రోల్ మీద రూ.5.. లీటరు డీజిల్ మీద రూ.10 చొప్పున తగ్గిస్తూ.. కేంద్రం కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. కేంద్రం నోటి నుంచి ఈ నిర్ణయం వచ్చిన వెంటనే.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని కొన్ని రాష్ట్రాలు తమ వంతుగా పెట్రోల్.. డీజిల్ మీద తాము విధించే వ్యాట్ ను కొంతమేర తగ్గించారు. దీంతో.. వినియోగదారులకు ఉపశమనం లభిస్తున్న పరిస్థితి.

అయితే.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం రాష్ట్రాలు విధించే వ్యాట్ పోటును తగ్గించే అంశం మీద ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన వెలువడకపోవటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. దేశ వ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో పెట్రోల్.. డీజిల్ మీద ఆయా రాష్ట్రాలు సైతం తమ పన్ను వాటాను కొంతమేర తగ్గించేసుకున్నాయి. అయితే.. ఇలా తగ్గింపు నిర్ణయాన్ని తీసుకున్న రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఒక్క ఒడిశాలో మాత్రం నవీన్ పట్నాయక్ సర్కారు ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాలు కాకుండా.. వ్యాట్ భారాన్ని కొంతమేర ఉపసంహరించుకునేలా నిర్ణయం తీసుకున్న రాష్ట్రాల్లో ఒడిశా నిలిచింది. అందరూ ఎంతోకొంత వ్యాట్ పోటును తగ్గించుకుంటున్న వేళ.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆ దిశగా ఎందుకు ఆలోచించటం లేదు? అన్నది ప్రశ్నగా మారింది.

అసోం

లీటరు పెట్రోల్.. డీజిల్ మీద రూ.7 చొప్పున తగ్గిస్తూ నిర్ణయం
త్రిపుర

లీటరు పెట్రోల్.. డీజిల్ మీద రూ.7 చొప్పున తగ్గింపు
కర్ణాటక

తెలుగు రాష్ట్రాలకు పక్కనే ఉన్న కర్ణాటకలోనూ లీటరు పెట్రోల్.. డీజిల్ పై రూ.7 చొప్పున తగ్గింపు. దీంతో.. లీటరు పెట్రోల్ మీద రూ.14 వరకు.. డీజిల్ మీద దాదాపుగా రూ.19లకు కాస్త ఎక్కువే తగ్గింది.

గోవా

రాష్ట్ర వ్యాట్ పోటును తగ్గిస్తూ నిర్ణయం. లీటరు పెట్రోల్.. డీజిల్ మీద రూ.7చొప్పున తగ్గింపు

బిహార్

లీటరు పెట్రోల్ మీద రూ.1.30.. డీజిల్ మీద రూ.1.90చొప్పున తగ్గింపు

ఉత్తరాఖండ్

లీటరు పెట్రోల్ మీద రూ.2 తగ్గింపు.. డీజిల్ మీద ఎలాంటి తగ్గింపు లేదు

మణిపూర్

లీటరు పెట్రోల్.. డీజిల్ మీద రూ.7 చొప్పున తగ్గింపు

ఉత్తరప్రదేశ్

యోగి సర్కారు తమ రాష్ట్ర వాటాగా ఉన్న దాని నుంచి లీటరుకు రూ.7 చొప్పున తగ్గిస్తూ నిర్ణయం

గుజరాత్

లీటరు పెట్రోల్.. డీజిల్ మీద రూ.7 చొప్పున తగ్గింపు

హరియాణా

చాలా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాదిరి లీటరు పెట్రోల్ డీజిల్ మీద రూ.7 చొప్పున తగ్గింపు నిర్ణయం

హిమాచల్ ప్రదేశ్

తగ్గింపుపై మిగిలిన రాష్ట్రాలకు భిన్నంగా స్పందించింది. తగ్గింపు ఎంతన్న విషయాన్ని వెల్లడించలేదు కానీ.. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని పేర్కొన్నారు.

ఒడిశా

లీటరు పెట్రోల్.. డీజిల్ మీద రూ.3 చొప్పున తగ్గింపు. కాకుంటే.. ఈ నిర్ణయం ఈ రోజు (శుక్రవారం) నుంచి అమల్లోకి రానుంది.

తెలుగు రాష్ట్రాలు (ఏపీ.. తెలంగాణ)

దొందూ దొందే అన్నట్లుగా.. ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా బయటకు రాలేదు. దీపావళి పూర్తి అయిన నేపథ్యంలో ఇవాళ ఏమైనా ప్రకటిస్తారేమో చూడాలి.