Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది లైట్ తీసుకున్నారట

By:  Tupaki Desk   |   13 April 2020 4:00 AM GMT
తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది లైట్ తీసుకున్నారట
X
కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ కారణంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా అలాంటిదే మరో అంశం వెలుగు చూసింది. సమస్యలు ఎన్ని ఎదురవుతున్నా.. ప్రజలకు ఏ మాత్రం ఇబ్బంది కలగని రీతిలో విద్యుత్ పంపిణీ సంస్థలు కరెంటు సప్లై చేస్తున్నారు. అయినప్పటికీ.. కరెంటు బిల్లు కట్టే విషయంలో రెండు తెలుగురాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు పిచ్చ లైట్ తీసుకున్నట్లుగా చెబుతున్నారు. లాక్ డౌన్ ముందు వరకూ ఠంచన్ గా కట్టిన వారు సైతం.. తాజాగా మాత్రం పిచ్చలైట్ తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.

తెలంగాణ విషయానికే వస్తే మార్చిలో కరెంటు బిల్లు కట్టని ఇంటి కనెక్షన్ దారులు ఏకంగా 22 లక్షల మంది ఉన్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఇట్టే చెప్పేయొచ్చు. ఈ కారణంగా రూ.60కోట్ల మేర ఆదాయానికి కోత పడినట్లుగా తెలుస్తోంది. ఏపీలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొని ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. సాధారణంగా కరెంటు బిల్లు కట్టే వారంతా ప్రతి నెల 20లోపే చెల్లిస్తుంటారు. ఎందుకంటే.. చెల్లింపుల గడువు 20 వరకే ఉంటుంది. గత నెలలో లాక్ డౌన్ 23 నుంచి అమల్లోకి తెచ్చారు. అయినప్పటికీ లక్షలాది మంది కరెంటు బిల్లులు కట్టకుండా ఉండటం ఆసక్తికరంగా మారింది.

గతంలో 90 నుంచి 95 శాతం వరకూ కరెంటు బిల్లుల్ని తూచా తప్పకుండా చెల్లించేవారు. అందుకు భిన్నమైన పరిస్థితులు ఇప్పుడున్నాయి. తెలంగాణలో 1.10కోట్ల మంది డొమెస్టిక్ కస్టమర్లు ఉంటే.. వారిలో ఇరవై శాతం మంది బిల్లులు చెల్లించే విషయాన్ని పట్టించుకోలేదని చెబుతున్నారు. అదే సమయంలో గతంతో పోలిస్తే.. ఆన్ లైన్ లో బిల్లుల చెల్లింపులు కరోనా కారణంగా పెరిగినట్లుగా గుర్తించారు. ఏమైనా.. లాక్ డౌన్ లెక్క తేలే వరకూ కరెంటు బిల్లుల చెల్లింపుల్లో ఇబ్బందులు తప్పవన్న మాట వినిపిస్తోంది.