Begin typing your search above and press return to search.

మ‌రాఠాల బాట‌లోకి క‌న్న‌డిగులు వ‌చ్చేశారే!

By:  Tupaki Desk   |   9 Sep 2017 9:02 AM GMT
మ‌రాఠాల బాట‌లోకి క‌న్న‌డిగులు వ‌చ్చేశారే!
X
నేటి ఉద‌యం ఐబీపీఎస్ ప‌రీక్ష కోసం క‌ర్ణాట‌క‌కు వెళ్లిన తెలుగు విద్యార్థుల‌కు ఎదురైన అరుదైన అనుభ‌వం లెక్క‌లేన‌న్ని ప్ర‌శ్న‌ల‌కు తెర లేపింద‌నే చెప్పాలి. బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం నిర్వ‌హించే ఈ ప‌రీక్ష కోసం దేశ‌వ్యాప్తంగా నిరుద్యోగులు ఆస‌క్తి చూపుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే దేశంలో ఎక్క‌డ ఐబీపీఎస్ ప‌రీక్ష జ‌రిగినా... దేశంలోని అన్ని ప్రాంతాల నిరుద్యోగులు అక్క‌డికి ప‌రుగులు పెడుతున్నారు. ఈ క్ర‌మంలోనే నేటి ఉద‌యం క‌ర్ణాట‌క వ్యాప్తంగా నిర్వ‌హిస్తున్న ఈ ప‌రీక్ష కోసం తెలుగు విద్యార్థులు కూడా పెద్ద సంఖ్య‌లోనే ద‌ర‌ఖాస్తులు చేసుకున్నారు. ప‌రీక్ష‌కు బాగానే సిద్ధ‌మైన తెలుగు విద్యార్థులు నిన్న రాత్రి త‌మ ఊళ్ల నుంచి క‌ర్ణాట‌క‌లోని త‌మ‌కు కేటాయించిన ప‌రీక్షా కేంద్రాల‌కు బ‌య‌లుదేరారు. నేటి ఉద‌యం కర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరు స‌హా - దావ‌ణ‌గేరే - బ‌ళ్లారి - హుబ్లీ త‌దిత‌ర ప‌ట్ట‌ణాల‌కు తెలుగు విద్యార్థులు చేరుకున్నారు.

తెలుగు విద్యార్థులంతా ప‌రీక్ష ఎలా రాయాల‌న్న దానిపై ఆలోచిస్తూ అక్క‌డ ల్యాండైతే... వారిని ఎలా ఎదుర్కోవాల‌నే విష‌యంపై అప్ప‌టికే అన్ని ప్ర‌ణాళిక‌లు ర‌చించుకున్న క‌న్న‌డిగులు రంగంలోకి దిగిపోయారు. తెలుగు విద్యార్థులు దిగిన ప్ర‌తిచోటా క‌న్న‌డిగులు రంగంలోకి దిగి.. వారిని అడ్డుకున్నారు. త‌మ రాష్ట్రంలో ప‌రీక్ష రాయ‌డానికి వీల్లేద‌ని భీష్మించిన క‌న్న‌డిగులు.. తెలుగు విద్యార్థులు వెంట‌నే వెన‌క్కు వెళ్లిపోవాల‌ని హుకుం జారీ చేశారు. హుబ్లీ లాంటి ప్రాంతాల్లో అయితే మ‌రింత రెచ్చిపోయిన క‌న్న‌డిగులు... తెలుగు విద్యార్థుల చేతుల్లోని హాల్ టికెట్ల‌ను చించేశారు కూడా. దీంతో భీతావ‌హులైన కొంద‌రు తెలుగు విద్యార్థులు ప‌రీక్ష రాయ‌కుండానే వెనుదిరిగారు. అయినా క‌న్న‌డిగులు ఈ త‌ర‌హా ఉద్య‌మానికి తెర తీసిన వైనంపై ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నాలు వినిపిస్తున్నాయి.

ఇప్ప‌టికే ఉత్త‌రాది వారిని త‌మ రాష్ట్రంలో అడుగుపెట్ట‌నిచ్చేది లేదని మ‌రాఠాల అడ్డాగా ఉన్న మ‌హారాష్ట్రకు చెందిన ప్ర‌జ‌లు వాదిస్తూనే ఉన్నారు. వీరి త‌ర‌ఫున వ‌కాల్తా పుచ్చుకున్న శివ‌సేన - మ‌హారాష్ట్ర న‌వ నిర్మాణ సేన త‌దిత‌ర రాజ‌కీయ పార్టీలు కూడా ఉత్త‌రాదిపై ఎప్ప‌టిక‌ప్పుడు విషం చిమ్ముతూనే ఉన్నారు. తాజాగా క‌న్న‌డిగులు కూడా మ‌రాఠాల మాదిరే ఇప్పుడు కొత్త అవ‌తారం ఎత్తార‌న్న వాద‌న వినిపిస్తోంది. త‌మ రాష్ట్రంలోని బ్యాంకుల్లోని ఉద్యోగాలు త‌మ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు మాత్ర‌మే ద‌క్కాల‌ని - వాటిని కొల్ల‌గ‌ట్టేందుకు వ‌చ్చే ఏ ఇత‌ర రాష్ట్ర నిరుద్యోగుల‌నైనా తాము అడ్డుకుని తీర‌తామంటూ క‌న్న‌డిగులు చెబుతున్న వైనం ఇప్పుడు నిజంగానే ఆందోళ‌న రేకెత్తిస్తోంది. మ‌రి ఈ వివాదాన్ని ఎలా ప‌రిష్కరిస్తారో చూడాలి.