Begin typing your search above and press return to search.

'నాసా'లో స్పేస్ కమాండర్‌ గా తెలుగు తేజం .. హైదరాబాద్ తో ప్రత్యేక అనుబంధం !

By:  Tupaki Desk   |   31 May 2021 5:38 AM GMT
నాసాలో స్పేస్ కమాండర్‌ గా తెలుగు తేజం .. హైదరాబాద్ తో ప్రత్యేక అనుబంధం !
X
రాజాచారి .. ఇప్పుడు ఈ పేరు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నాసాలో ధ్వని పలుకుతోంది. దీనికి ప్రధాన కారణం నాసా త్వరలోనే చేపట్టబోయే స్పేస్ఎక్స్‌ క్రూ-3 మిషన్‌ కి ఈయన కమాండర్ గా ఎంపిక అయ్యారు. ఈ స్పేస్‌ మిషన్‌ ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌ (ఐఎస్‌ ఎస్‌)కు వెళ్తుంది. ప్రస్తుతం అయన అమెరికా వాయుసేనలో కల్నల్‌ గా పనిచేస్తున్నారు. వచ్చే ఏడాది ఈ మిషన్‌ అంతరిక్షంలోకి వెళ్లనుంది. త్వరలో ఈ మిషన్‌లో నాలుగో సభ్యుడు కూడా చేరతారని నాసా సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. దీని పై అయన మాట్లాడుతూ .. నేను చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నా. టామ్‌ మార్ష్‌ బర్న్‌, మాథ్యూస్‌ మారర్‌ తో కలిసి అంతరిక్ష కేంద్రానికి వెళ్లేందుకు అవకాశం రావడాన్ని గౌరవంగా భావిస్తున్నా అని రాజాచారి ఓ ట్వీట్‌ చేశారు.

రాజాచారికి ఇది మొదటి అంతరిక్ష యాత్ర. ఆయన 2017లో నాసాలో చేరారు. అప్పటి నుంచి హ్యూస్టన్‌ లోని నాసాకు చెందిన జాన్సన్‌ స్పేస్‌ సెంటర్‌ లో రెండు సంవత్సరాలపాటు శిక్షణ తీసుకున్నారు. 2017లో నాసాకు చెందిన ఆస్ట్రోనాట్ ప్రోగ్రామ్‌ లో పాలుపంచుకున్న 12మంది ట్రైనీల్లో ఆయన కూడా ఒకరు. ఈ టీమ్‌లో ఏడుగురు పురుషులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. 18,300 మంది అభ్యర్థుల నుంచి ఈ 12 మందిని ఎంపిక చేశారు. పైలట్‌ గా శిక్షణతోపాటు స్పేస్‌ వాక్‌ లో కూడా ఆయనకు ట్రైనింగ్‌ ఇచ్చారు. పైలట్‌ గా 2,500 గంటలకు పైగా విమానాలు నడిపిన అనుభవం అయన సొంతం. ఇటీవలే రాజాచారి ఆర్టెమిస్‌ టీమ్‌ లో సభ్యుడిగా ఎంపికయ్యారని, భవిష్యత్తులో జరిగే మూన్ మిషన్‌ లకు కూడా ఆయన అర్హత సాధించారని నాసా తెలిపింది. ఆర్టెమిస్‌ అంటే మానవసహిత అంతరిక్ష యాత్రా కార్యక్రమం. దీనికి అమెరికా ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది.

2024 నాటికి తొలి మహిళను, మరో మనిషిని చంద్రుడిపైకి, ముఖ్యంగా చంద్రుడి ధ్రువ ప్రాంతానికి చేర్చడం ఈ మిషన్‌ లక్ష్యం. కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తరువాత నాసా యాత్రకు వెళ్లే మూడో భారత సంతతి వ్యక్తిగా రాజాచారి రికార్డు సాధించబోతున్నారు. ప్రస్తుతం రాజా చారి వయసు 43 ఏళ్లు. రాజాచారి 2012లో సునీతా విలియమ్స్‌ ను కలిశారు. విస్కాన్సిన్‌ రాష్ట్రంలోని మిల్వాకీ నగరంలో రాజాచారి జన్మించారు. అయోవాలోని సెడార్‌ ఫాల్స్‌ లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. భార్య, పిల్లలతో కలిసి వాటర్లూ సిటీలో స్థిరపడ్డారు. 1999లో యూఎస్ ఎయిర్‌ ఫోర్స్ అకాడమీ నుంచి ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. ఆ తరువాత, మసాచుసెట్స్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) నుంచి ఆస్ట్రోనాటిక్స్ అండ్‌ ఏరోనాటిక్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ పొందారు. ఆ తర్వాత యూఎస్ నేవల్‌ టెస్ట్‌ పైలట్‌ స్కూల్‌ లో కోర్సు పూర్తి చేసిన రాజాచారి, అమెరికన్‌ ఎయిర్‌ ఫోర్స్ అకాడమీలో పైలట్‌ ట్రైనింగ్‌ తీసుకున్నారు. ఎఫ్-35, ఎఫ్-15, ఎఫ్-16, ఎఫ్-18వంటి అమెరికా యుద్ధవిమానాలను ఆయన నడిపారు. అమెరికా వాయుసేన తరఫున ఇరాక్‌ యుద్ధంలో ఎఫ్-15-ఇ యుద్ధ విమానాలను కూడా నడిపారు.

రాజాచారి తెలుగు కుటుంబానికి చెందినవారు. ఆయనకు తెలంగాణతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన తాత వెంకటాచారి మహబూబ్ నగర్ వాసి. హైదరాబాద్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మ్యాథ్స్‌ ప్రొఫెసర్‌ గా పని చేశారు. తండ్రి శ్రీనివాసాచారి ఉస్మానియా యూనివర్శిటీలోనే ఇంజినీరింగ్ పూర్తిచేశారు. ఆ తర్వాత 1970లో అమెరికాకు వచ్చి అయోవా రాష్ట్రంలోని సెడార్‌ ఫాల్స్‌లో స్థిరపడ్డారు. 2010లో శ్రీనివాసాచారి చనిపోయారు. రాజాచారి ఇప్పటివరకు మూడుసార్లు హైదరాబాద్‌ కు వచ్చారు. ఇక్కడ వారికి చాలామంది బంధువులు కూడా ఉన్నారు. రాజాచారి చివరిసారిగా 2006లో భారత్‌ ను సందర్శించారు. బెంగళూరు ఎయిర్‌ షోలో అమెరికన్‌ ఫైటర్‌ జెట్ల బృందానికి ఆయన ప్రాతినిధ్యం వహించారు. అంతకు ముందు కూడా ఆయన అనేకసార్లు భారత్‌ ను సందర్శించారు.