Begin typing your search above and press return to search.

కొడాలి నానిని ఇన్నేసి తిట్లు తిట్టేయటమా? షాకిచ్చే రియాక్షన్

By:  Tupaki Desk   |   14 Sep 2022 3:51 AM GMT
కొడాలి నానిని ఇన్నేసి తిట్లు తిట్టేయటమా? షాకిచ్చే రియాక్షన్
X
ఏపీలో రాజకీయాలు ఎక్కడి వరకు వెళ్లిపోయాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత వైఎస్ జగన్ సర్కారు ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత.. అప్పట్లో కొందరు మంత్రులుగా ఉన్న నేతలు ఇష్టారాజ్యంగా నోటికి పని చెప్పటం.. అప్పటివరకు మంత్రులుగా ఉన్న వారెవరూ మాట్లాడలేనన్ని బూతుల్ని తిట్టేసిన వైనం చూసి విస్మయానికి గురైన పరిస్థితి. మంత్రిగా వ్యవహరిస్తూ.. విపక్ష నేతను ఉద్దేశించి అలాంటి పదజాలాన్ని వాడొచ్చా? అన్న సందేహానికి గురయ్యే పరిస్థితి.

ప్రత్యర్థులు చేసే రాజకీయం నచ్చకపోవచ్చు. వారు తప్పులు చేసి ఉండొచ్చు. కానీ.. మర్యాదను మిస్ కాకుండా మాట్లాడాల్సిన తీరును మర్చిపోయి.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడే కొత్త సంప్రదాయానికి తెర తీసిన వారిలో వైసీపీ నేత.. జగన్ కు హార్డ్ కోర్ అబిమానిగా తనకు తాను చెప్పుకునే కొడాలి నాని ముందుంటారు. ఆయన మాటలకు.. ఆయన నోటి నుంచి వచ్చే బూతులను అర్థం చేసుకొని.. ఆయనకు కౌంటర్ ఇచ్చేందుకు కాసింత సమయం పట్టింది.

బ్యాడ్ లక్ ఏమంటే.. మనం ఏదిస్తే.. అదే తిరిగి వస్తుందన్న రీతిలో.. తాజాగా కొడాలి నానిని ఉద్దేశించి తెలుగు దేశం పార్టీ మహిళా విభాగానికి చెందిన కొందరు మహిళలు తమ నోటికి పని చెప్పటమే కాదు.. వెనుకా ముందు చూసుకోకుండా.. నోటికి వచ్చిన మాటను అనేయాలన్నదే లక్ష్యంగా మాట్లాడినట్లుగా కనిపిస్తోంది. కొడాలి నానిని బండబూతులు తిట్టేయటమేకాదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైనం షాకింగ్ గా మారింది.

ఇప్పటివరకు బూతులు తిట్టే విషయంలో కొడాలి నానికి మించినోళ్లు లేరన్న భావనకు పుల్ స్టాప్ పడేలా.. తాజాగా వీడియోలో విరుచుకుపడిన తెలుగు మహిళ తీరు సంచలనంగా మారింది. ఈ మాట తిట్టొచ్చు.. ఈ మాటను తిట్టకూడదన్న విచక్షణను పూర్తిగా వదిలేసి.. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేసిన వైనానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారటమే కాదు.. ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు తెర తీస్తోంది.

దాదాపు నిమిషం ఒక సెకను నిడివి ఉన్న ఈ వీడియోను చూసినప్పుడు అనిపించేది ఒక్కటే.. ఏపీలో భవిష్యత్తు రాజకీయాల్లో మర్యాద.. సంస్కారం.. లాంటివి అస్సలు కనిపించవేమోనన్న భావన కలుగక మానదు. తెలుగు మహిళ చేసిన వ్యాఖ్యల్ని రాసే ఉద్దేశం మాకు లేదు. ఎందుకంటే.. కొడాలి నాని బండ బూతులు తిట్టినప్పుడు ఎలా అయితే..ఆయన తిట్లను తప్పు పట్టి.. ఆయన తిట్లను రాయలేదన్నది మర్చిపోకూడదు.

ఈ రోజున ఆయనకు కౌంటర్ గా తెలుగు మహిళ చేస్తున్న వ్యాఖ్యల తీవ్రతను చెప్పటమే లక్ష్యం తప్పించి.. ఆ బూతుల్ని అదే పనిగా రాసేసి.. చదివించాలన్న ఉద్దేశం మాకు లేదన్నది గుర్తించాలి. ఏమైనా.. బూతుల రాజకీయానికి కాస్తంత పుల్ స్టాప్ పెట్టేలా అధికార వైసీపీ చొరవ తీసుకుంటే బాగుంటుందన్న మాట వినిపిస్తోంది. అంతటి సహనం ఏపీ అధికారపక్ష నేతలకు ఉందా? అన్నదే అసలు సందేహం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.