Begin typing your search above and press return to search.

త‌ప్పో.. ఒప్పో.. టీడీపీ మేల్కోవాల్సిందే!

By:  Tupaki Desk   |   23 Sep 2021 2:30 AM GMT
త‌ప్పో.. ఒప్పో.. టీడీపీ మేల్కోవాల్సిందే!
X
ఔను! ఇప్పుడు ఈ మాట‌.. టీడీపీ సీనియ‌ర్ల నుంచే వినిపిస్తోంది. ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌ను పార్టీ బ‌హిష్క‌రించింది. వైసీపీ అక్ర‌మాలు.. టీడీపీ నేత‌ల‌ను బెదిరించ‌డం.. వంటి ప‌రిణామాల నేప‌థ్యంలో ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రించిన‌ట్టు టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. వాస్త‌వ‌మే అయిన్ప‌టికీ.. కొంద‌రు నాయ‌కుల‌కు అప్ప‌టికే బీఫారాలు ఇచ్చేశారు. అంద‌రూ నామినేష‌న్లు వేశారు. దీంతో పార్టీ బ‌హిష్క‌ర‌ణ పిలుపు ఇచ్చినా.. చాలా మంది ప్ర‌చారం చేశారు. అయితే.. అప్ప‌ట్లో ఇలా ప్ర‌చారం చేసిన వారిని పార్టీ నిలువ‌రించ‌లేదు. అంతేకాదు.. పోటీ చేయొద్దు.. ప్రచారం చేయొద్దు.. అని చెప్ప‌లేదు. దీంతో వారంతా ప్ర‌చారం చేసుకున్నారు.

సొంతగా డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టారు. కొంద‌రు అప్పులు చేసి మ‌రీ.. ఖ‌ర్చులు చేశారు. బాగానే వ‌ర్క‌వుట్ చేశారు. ఇక‌, ఫ‌లితాలు కూడా వ‌చ్చేశాయి. దాదాపు 700 ఎంపీటీసీల్లో టీడీపీ నేత‌లు విజ‌యం ద‌క్కించు కున్నారు. అయితే.. ఇప్ప‌టికీ.. టీడీపీ అధిష్టానం నుంచి ఎలాంటి భ‌రోసా క‌నిపించ‌లేదు. క‌నీసం వారికి విషెస్ చెప్ప‌లేదు. ఎంతో ఒత్తిళ్లు ఎదుర్కొని.. మ‌రీ.. వైసీపీ నేత‌ల‌ను ఎదిరించి పోటీలో నెగ్గినా.. వారిని ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీ అధినేత ప‌ల‌క‌రించ‌లేదు. దీంతో వారంతా ప్ర‌స్తుతం నైరాశ్యంలో మునిగిపోయారు. కొన్ని చోట్ల అంటే.. ఆచంట‌.. తూర్పులో ఒక మండ‌ల ప‌రిధిలో.. అనంత‌లో మ‌రో మండ‌ల ప‌రిదిలో ఎంపీపీ సీటు కూడా టీడీపీకి ద‌క్కే అవ‌కాశం ఉంది.

అయితే.. వీరిని గైడ్ చేసేవారు క‌నిపించ‌డం లేదు. ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రించామ‌ని ప్ర‌క‌టించిన చంద్ర‌బా బు.. ఆ మాట‌ల‌నే ప‌ట్టుకున్నారు త‌ప్ప‌.. గెలిచిన వారి గురించి ఆలోచించ‌డం లేద‌నే టాక్ వినిపిస్తోంది. కొన్ని చోట్ల జ‌న‌సేన‌తో స‌ర్దుబాటు చేసుకుంటే.. టీడీపీ ఎంపీపీ స్థానం ద‌క్కించుకునే అవ‌కాశం ఉంది. దీంతో గెలిచిన వారు.. పార్టీ నుంచి వ‌చ్చే ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. మ‌రో రెండు రోజులు మాత్ర‌మే ఎంపీపీ ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఉండ‌డం.. వీరికి స‌రైన దిశానిర్దేశం లేక‌పోవ‌డంతో ఏం చేయాలో తెలియ స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. మ‌రోవైపు.. వైసీపీ నేత‌లు దూకుడు పెంచారు.

టీడీపీ స‌హా.. జ‌న‌సేన నుంచి గెలిచిన ఎంపీటీసీల‌కు వ‌ల విసురుతున్నారు., సామ దాన భేద దండోపాయ‌లు ప్ర‌యోగిస్తున్నారు. ఈ స‌మ‌యంలో చంద్ర‌బాబు త‌న‌దైన శైలిలో స్పందించి.. పార్టీ త‌ర‌ఫున గెలిచిన వారిలో భ‌రోసా నింపాల్సిన అవ‌స‌రం ఉంద‌నేది సీనియ‌ర్ల మాట‌. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబుఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌డంలేదు. పోనీ.. అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల ద్వారా అయినా.. నేత‌ల‌ను అక్క‌డ‌కు పంపించి.. చ‌ర్య‌లు చేప‌ట్ట‌లేదు. దీంతో పార్టీకి మొత్తానికే మోసం వ‌స్తుంద‌ని అంటున్నారు.

అయితే.. చంద్ర‌బాబు ఈ విష‌యంలో ఒకింత వెనుక‌డుగు వేస్తున్నార‌నే టాక్ కూడా వినిపిస్తోంది. బ‌హిష్క‌రించాం క‌నుక‌.. ఇప్పుడు ఎంపీపీ స్థానాలు ద‌క్కించుకుని చ‌క్రం తిప్పితే.. వైసీపీ నుంచి మ‌రింత వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని ఆలోచిస్తున్నారా? అనే చ‌ర్చ సాగుతోంది. అయిన‌ప్ప‌టికీ.. ఎవ‌రు ఏమ‌నుకున్నా.. గెలిచిన అభ్య‌ర్థుల‌ను ద‌క్కుతున్న ఎంపీపీ స్థానాలను వ‌దులు కోవ‌డం స‌రికాద‌నే సూచ‌న‌లు మాత్రం వ‌స్తున్నాయి. మ‌రి చంద్ర‌బాబు ఇప్ప‌టికైనా.. స్పందిస్తారా.. లేదా.. చూడాలి.