Begin typing your search above and press return to search.

ఈ వీకెండ్ వేడితో అద‌ర‌గొడుతుంద‌ట‌

By:  Tupaki Desk   |   27 April 2018 7:53 AM GMT
ఈ వీకెండ్ వేడితో అద‌ర‌గొడుతుంద‌ట‌
X
ఎండాకాలం వ‌చ్చిందంటే ఒక‌లాంటి దిగులు. మండే ఎండ‌తో బ‌య‌ట‌కు వెళ్లాలంటే హ‌డ‌లిపోయే ప‌రిస్థితి. ఇంట్లో నుంచి కాలు బ‌య‌ట పెట్టినంత‌నే కారు సిద్ధంగా ఉండే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు. క‌ష్ట‌మంతా సామాన్యులు.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారిదే. కారులాంటి సుఖం కుద‌ర‌దు.. అలా అని బ‌య‌ట‌కు రాకుండా ఉండ‌లేరు.

మండే ఎండ‌లోనూ క‌ష్టాన్ని పంటి బిగువున పెట్టుకొని ప‌ని చేసుకుంటూ పోతారు. గ‌డిచిన ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాది ఎండ‌ల తీవ్ర‌త ఎక్కువ‌గానే ఉంటోంది. ఏప్రిల్ లో గ‌తం కంటే ఎక్కువ‌గానే ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతున్నాయి. ఇక‌.. రానున్న మేలో పెరిగే ఎండ‌ల‌తో మంట పుట్ట‌టం ఖాయం.

గ‌తంలో హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో ఎండ‌ల తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్నా.. ఉక్కుపోత ఉండేది కాదు. కానీ.. పెరిగిన కాలుష్యం పుణ్య‌మా అని చెమ‌ట‌లు ప‌డుతున్న ప‌రిస్థితి. ఏప్రిల్ రెండో వారంలోనే భారీ ఎత్తున ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతున్న పరిస్థితి. ఇదిలా ఉంటే.. ఈ వీకెండ్ కు ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని చెబుతున్నారు.

వాతావ‌ర‌ణంలో తేమ శాతంలో వ‌చ్చే మార్పుల కార‌ణంగా ఈ శ‌ని.. ఆదివారాల్లో ఎండ‌ల తీవ్ర‌త భారీగా పెరిగే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ఉష్ణోగ్ర‌త‌లు సాధార‌ణం కంటే కూడా రెండు డిగ్రీల వ‌ర‌కూ అధికంగా న‌మోదు అవుతాయ‌ని చెబుతున్నారు. ఈ రోజు (శుక్ర‌వారం) కాస్త చ‌ల్ల‌గానే ఉన్నా.. అందుకు బ‌దులుగా శ‌ని.. ఆదివారాలు మాత్రం ఎండ‌లు మండిపోవ‌టం కాయ‌మ‌ని చెబుతున్నారు. సో.. ఈ వీకెండ్ కు ప్లాన్ చేసుకునే వేళ‌.. ఎండ‌ల్ని కూడా దృష్టిలోపెట్టుకొని షెడ్యూల్ ఖ‌రారు చేసుకుంటే మంచిది. లేదంటే అన‌వ‌స‌ర‌మైన ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందులు ఖాయం.