Begin typing your search above and press return to search.

జగన్ కోసం ఆలయం.. ప్రత్యేకతలివీ!

By:  Tupaki Desk   |   16 Aug 2021 11:30 AM GMT
జగన్ కోసం ఆలయం.. ప్రత్యేకతలివీ!
X
రాజకీయ అభిమానం ఈ కాలంలో చాలా ఎక్కువ. అధినేతలను ప్రసన్నం చేసుకోవడానికి నేతలు ఏమైనా చేస్తారు. ఆకట్టుకుంటారు. తద్వారా మంత్రి పదవులు, కేబినెట్ పదవులు పొందుతారు. పార్టీలో అగ్రతాంబూలం దక్కించుకుంటారు.

అయితే ఆరాధన అంతకుమించితే మాత్రం ఎలా ఉంటుందో చూపించాడు వైసీపీలోని ఒక ఎమ్మెల్యే. నిజానికి చనిపోయిన రాజకీయ నేతలకు గుడులను కట్టినవారిని చూశాం.. తమిళనాట అమ్మ జయలలితకు ఇలానే గుడులు ఉన్నాయి. ఏపీలోని రాజగోపాలపురం, చెన్నారెడ్డిపాలెం, కడప జిల్లాల్లో ఉమ్మడి ఏపీని పాలించిన దివంగత వైఎస్ఆర్ కు దేవాలయాలను ఆయన అభిమానులు నిర్మించారు.

ఇక తెలంగాణలో కూడా టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కోసం హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో ఒక దేవాలయం కట్టారు. ఇక ఏపీలోని అమరావతి పరిధిలో తూళ్లూరు సమీపంలోని హరిశ్చంద్రపురం గ్రామం వద్ద టీడీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు కోసం కూడా ఆలయాన్ని నిర్మించడానికి ప్రయత్నించినా అది కార్యరూపం దాల్చలేదు.

ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ వంతు వచ్చింది. ఆయన కోసం ఓ భక్తుడు గుడికట్టాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకొని రాష్ట్రంలో అధికారం సంపాదించిన జగన్ ఇప్పుడు అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎంగా ఎదిగారు. తన పార్టీ నాయకులకు ఆరాధకుడిగా మారారు. సహజంగానే, ఆయన పార్టీ నాయకులు ఆంధ్రా ప్రజలకు దేవుడిచ్చిన బహుమతిగా మాత్రమే కాకుండా, దేవుడికే దేవుడిగా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ సీఎంకు ఏకంగా గుడికట్టారు.

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి తాజాగా ముఖ్యమంత్రి పట్ల తన విశ్వాసాన్ని.. భక్తిని ప్రదర్శించడానికి ఏకంగా జగన్ మోహన్ రెడ్డి కోసం ఒక దేవాలయాన్ని నిర్మించారు. పూర్తయ్యే దశలో ఉన్న ఆలయం త్వరలో శంకుస్థాపనకు సిద్ధమైంది. ఇది ఏ ఇతర హిందూ దేవుడి ఆలయాన్ని పోలి ఉండకుండా చాలా ప్రత్యేకతలతో నిర్మిస్తున్నారు. ఈ మేరకు డిజైన్ ను తాజాగా బయటపెట్టారు.

గర్భగుడిలో జగన్ విగ్రహంతో పాటు ప్రతి నవరత్నాలు..జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొమ్మిది సంక్షేమ పథకాలకు వేర్వేరు మందిరాలు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి సంక్షేమ పాలనను ప్రతిబింబించే అద్దాల మందిరం కూడా ఉంది. స్పష్టంగా మధుసూధన్ రెడ్డి 2014 లో సీటు కోల్పోయినప్పటికీ తనకు పార్టీ టికెట్ ఇచ్చిన జగన్ పట్ల తన గౌరవాన్ని చూపించాలని అనుకుంటున్నారు. తాను రాముడి కోసం హనుమంతుడి తరహాలో జగన్‌ భక్తుడిని అని చెప్పుకుంటూ తాను ముఖ్యమంత్రి పట్ల తన భక్తిని ఇలా ఆలయం నిర్మించి ప్రదర్శిస్తున్నానని చెప్పాడు.

"నాకు నా భార్య.. పిల్లలు కావాలా లేక జగన్ మోహన్ రెడ్డి కావాలా అని మీరు నన్ను అడిగితే, నేను రెండోదాన్ని ఇష్టపడతాను. షాజహాన్ తన భార్య కోసం తాజ్ మహల్ నిర్మించి ఉంటే, ప్రజల కోసం నేను జగన్ కోసం ఒక దేవాలయాన్ని నిర్మించాను, ”అని వైసీపీ ఎమ్మెల్యే పేర్కొనడం విశేషం.

ఆసక్తికరంగా, పశ్చిమ గోదావరి జిల్లాలోని గోపాలపురంలో జగన్ కోసం మరో ఆలయం కూడా నిర్మిస్తున్నారు ఈ దేవాలయాన్ని జగనన్న కాలనీ ప్రక్కనే ఉన్న స్థానిక ఎమ్మెల్యే తలారి వెంకట్ రావు నిర్మిస్తున్నారు, ఇక్కడ పేదలకు ఇంటి స్థలాలు కేటాయించారు. ఇలా సీఎం జగన్ కు త్వరలోనే రెండు దేవాలయాలు నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది.