Begin typing your search above and press return to search.

​చిత్తూరులో ఘోర ప్రమాదం

By:  Tupaki Desk   |   15 March 2016 6:21 AM GMT
​చిత్తూరులో ఘోర ప్రమాదం
X
విజయవాడ సమీపంలోని గొల్లపూడి వద్ద సోమవారం రాత్రి చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంతో ఏర్పడిన విషాదం నుంచి కోలుకోకముందే ఏపీలోని చిత్తూరు జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గొల్లపూడి దగ్గర జరిగిన యాక్సిడెంట్ లో నలుగురు మెడికోలతో పాటు.. బస్సు డ్రైవర్ ఘటనా స్థలంలో మరణించగా.. మరో 31 మంది గాయాలపాలయ్యారు. ఈ ఘటనకు బస్సు డ్రైవర్ దే పూర్తి తప్పన్నది తెలిసిందే.

ఇదిలా ఉంటే.. మంగళవారం ఉదయం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రాయలవారి కోట రెండో మలుపు వద్ద తాజాగా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు ఘటనాస్థలంలోనే దుర్మరణం పాలయ్యారు. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం ఎలా జరిగిందన్న విషయంపై పోలీసులు వెల్లడిస్తున్న వివరాల ప్రకారం.. బెంగళూరులోని యలహంకకు చెందిన 15 మంది తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శనం కోసం వెళుతున్నారు. వీరంతా ప్రయాణిస్తున్న టెంపో.. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల నుంచి వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో టెంపో నుజ్జునుజ్జు అయ్యింది.

టెంపోలోని ఆరుగురు ఘటనాస్థలంలోనే మరణించారు. తీవ్ర గాయాలైన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. విజయవాడ దగ్గర జరిగిన ప్రమాదం షాక్ నుంచి తేరుకోని వారికి.. గంటల వ్యవధిలోనే చిత్తూరు జిల్లాలో ఇంత భారీ రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవటం చూసినప్పుడు.. ఏపీ రోడ్లకు ఏమైనా శని పట్టిందా? అనిపించక మానదు. వినేందుకు ఇబ్బందిగా ఉన్నా.. కొన్ని గంటల వ్యవధిలోనే రెండు భారీ ప్రమాదాలు చోటు చేసుకోవటం.. పది మంది దుర్మరణం పాలు కావటం ఆందోళన కలిగించే అంశమే.