Begin typing your search above and press return to search.

షర్మిల పాదయాత్రకు బ్రేక్.. కానీ నిరసన షెడ్యూల్ మీద ప్రకటన

By:  Tupaki Desk   |   11 Nov 2021 4:30 AM GMT
షర్మిల పాదయాత్రకు బ్రేక్..  కానీ నిరసన షెడ్యూల్ మీద ప్రకటన
X
దివంత మహానేత వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థాన యాత్రకు తాత్కాలిక బ్రేక్ పడింది. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో పాదయాత్రను జరపటం సరికాదన్న ఉద్దేశంతో ఆమె తన యాత్రకు బ్రేకులు వేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనల్ని తాను గౌరవిస్తానని.. అందుకే తన పాదయాత్రను ఆపుతున్నట్లుగా పేర్కొన్న ఆమె.. తన బ్రేక్ తాత్కాలికమేనని స్పష్టం చేశారు.

కోడ్ ముగిసిన వెంటనే ప్రజాప్రస్థాన యాత్ర మళ్లీ మొదలవుతుందని చెప్పారు. గడిచిన 21 రోజులుగా సాగుతున్న ప్రజాప్రస్థాన యాత్రను ఆపినట్లు పేర్కొన్న షర్మిల.. దాని స్థానే మరో షెడ్యూల్ ను ప్రకటించటం గమనార్హం. తన పాదయాత్రలో వందల కొద్దీ సమస్యల్ని అడిగి తెలుసుకున్నట్లు ఆమె చెప్పారు.

గతంలో ప్రతి గింజ కొంటామని చెప్పిన కేసీఆర్ సర్కారు ఇప్పుడు మాత్రం వడ్లను కొనమని చెప్పటం.. మాట తప్పటం కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలోని రైతుల్లో 91 శాతం మంది అప్పులు పాలైనట్లుగా సర్వేలు చెబుతున్నాయన్నారు. రైతులు పండించిన వడ్లను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఈ నెల 12 నుంచి 72 గంటల పాటు హైదరాబాద్ లో రైతు వేదన దీక్షను చేయనున్నట్లు ఆమె ప్రకటించారు.

రైతులకు తమ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్న షర్మిల.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఇచ్చిన మాట ప్రకారం చివరి గింజ వరకు కొనాలన్నారు. ‘అసెంబ్లీలో కేసీఆర్ మాట ఇచ్చారు. ఆయన తన మాట నిలబెట్టుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. మొత్తంగా ధాన్యం కొనుగోలు మీద ఎవరికి వారుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ అధికారపక్షమైన టీఆర్ఎస్ కేంద్రం తీరుకు నిరసనగా ఆందోళన చేస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా బీజేపీ ఇప్పటికే నిరసనకు ప్లాన్ చేసింది. షర్మిల ఇప్పుడు అదే బాటలో పయనిస్తున్న విషయాన్ని ప్రకటించారు.