Begin typing your search above and press return to search.

తెలంగాణ హైకోర్టుకు తాత్కాలిక సీజే.. ఆయన ప్రత్యేకత ఏమంటే?

By:  Tupaki Desk   |   28 Aug 2021 5:33 AM GMT
తెలంగాణ హైకోర్టుకు తాత్కాలిక సీజే.. ఆయన ప్రత్యేకత ఏమంటే?
X
తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ మామిడన్న సత్యరత్న రామచందర్ రావును నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు విడుదలయ్యాయి. కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి రాజిందర్ కష్యప్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.రామచందర్ రావులో బోలెడన్ని ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పొచ్చు. లాయర్ గా సుదీర్ఘకాలంగా కెరీర్ కొనసాగిన ఆయన.. న్యాయమూర్తిగా ఆ మధ్యలో అపాయింట్ అయ్యారు. తాజాగా తాత్కాలిక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎంపిక అయ్యారు.

ఆయన్ను పక్కా హైదరాబాదీగా పేర్కొనొచ్చు. కారణం ఆయన పుట్టింది.. పెరిగింది.. చదువుకున్నది.. హైదరాబాద్ లోనే కావటం విశేషం. 1966లో హైదరాబాద్ లో జన్మించిన ఆయన.. సెయింట్ పాల్స్ స్కూల్లో పదో తరగతి.. లిటిల్ ఫ్లవర్స్ కాలేజీలో ఇంటర్.. భవన్స్ న్యూ సైన్స్ కాలేజీలో డిగ్రీ.. ఉస్మానియా వర్సిటీలో ఎల్ఎల్ బీ పూర్తి చేసిన ఆయన.. అత్యధిక మార్కులు సాధించిన ఘనత ఆయన సొంతం. ఇందుకుగాను సీబీఎస్ఎస్ ఆచార్యులు స్మారక గోల్డ్ మెడల్ ను సొంతం చేసుకున్నారు.

1989లో న్యాయవాదిగా ఆయన ఎన్ రోల్ అయ్యారు. అనంతరం లండన్ లోని కేంబ్రిడ్జి వర్సిటీలో 1991లో ఎల్ఎల్ఎంను పూర్తి చేశారు. ఆ సమయంలోనే కామన్ వెల్త్ స్కాలర్ షిప్..బ్యాంక్ ఆఫ్ క్రెడిట్.. కామర్స్ ఇంటర్నేషనల్ కు సెలెక్టు అయ్యారు. న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలు పెట్టిన ఆయన పలు ప్రముఖ బ్యాంకులకు న్యాయవాదిగా పని చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా సేవలు అందించారు కూడా.

తన సుదీర్ఘ ప్రాక్టీస్ లో సివిల్.. ఆర్బిట్రేషన్ కంపెనీ లా.. ఆడ్మినిస్ట్రేటివ్.. లేబర్.. సర్వీస్ లాకు సంబంధించి కేసుల్లో ఆయన దిట్టగా పేరుంది. ఇదిలా ఉంటే 2012లో ఆయన్నుఉమ్మడి హైకోర్టుకు అదనపు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. 2013లో పూర్తిస్థాయి జడ్జిగా నియమితులయ్యారు. ఇక్కడో ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాలి. జస్టిస్ రామచందర్రావు తండ్రి జస్టిస్ ఎం. జగన్నాథరావు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రిటైర్ కాగా.. ఆయన తాత జస్టిస్ రామచందర్రావు కూడా హైకోర్టు జడ్జిగా సేవలు అందించారు.

అంతేకాదు.. వీరి తాత సోదరుడు జస్టిస్ ఎం. క్రిష్ణారావు కూడా హైకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు. ఇలా కుటుంబం మొత్తంహైకోర్టు న్యాయమూర్తులుగా పని చేసిన వైనం చాలా అరుదుగా ఉంటుందని చెప్పక తప్పదు.