Begin typing your search above and press return to search.

సైబర్ క్రైమ్ : ఆ వీడియోలు చూపించి ముందు టెంప్ట్ .. ఆ తర్వాత !

By:  Tupaki Desk   |   29 Sep 2021 11:30 PM GMT
సైబర్ క్రైమ్ : ఆ వీడియోలు చూపించి ముందు టెంప్ట్ .. ఆ తర్వాత !
X
సోషల్ మీడియా ఎంతటి ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. సోషల్ మీడియా వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అంతకంటే ఎక్కువగా నష్టాలు కూడా ఉన్నాయి. కొందరు సోషల్ మీడియా ఉపగించుకొని డబ్బు ఆర్జిస్తుంటే .. మరికొందరు అదే సోషల్ మీడియా తో మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల విడుదల చేసిన నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో డేటా ప్రకారం సైబర్‌ నేరాల రేటు (లక్ష జనాభాకు) 2019తో పోలిస్తే 2020లో 3.7 శాతం పెరిగింది. లైంగిక వేధింపులకు సంబంధించిన నేరాలు సైబర్‌క్రైమ్‌ లో రెండవస్థానంలో ఉన్నట్టు బ్యూరో నివేదికలు చూపుతున్నాయి.

సోషల్‌ మీడియాలో అపరిచితులతో చేసే స్నేహాల పట్ల ఎప్పుడూ అప్రమత్తత అవసరమనే విషయాన్ని నిపుణులు స్పష్టం చేస్తూనే ఉన్నారు. సెక్స్‌ టోర్షన్‌ తో సంబంధం గల ముఠా మిమ్మల్ని అశ్లీల వీడియోలు చూడటానికి ఆహ్వానిస్తుంది. మీరు ఆ వీడియోల పట్ల ఆసక్తి చూపినప్పుడు ఆ గ్యాంగ్‌ మీకు అలాంటి వీడియోలనే చూపించడం మొదలుపెడుతుంది. మానసికంగా మిమ్మల్ని ప్రలోభపెట్టి మీ నుంచి వీడియోలను సేకరిస్తుంది. తర్వాత వాటిని లీక్‌ చేస్తానని బెదిరించి, బ్లాక్‌ మెయిల్‌ కు దిగుతుంది అని చెబుతున్నారు. సర్వత్రా డిజిటల్‌ మయమైన ఈ కాలంలో అమ్మాయిలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, నేరాలకు అడ్డుకట్టవేయడానికి ముందు నేరాలకు అవకాశం ఇవ్వరాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

అమెరికాలోని వార్విక్‌ విశ్వవిద్యాలయ అధ్యయనం ప్రకారం, కరోనా సమయంలో అంతటా సైబర్‌ నేరాలు వేగంగా పెరిగాయి. ఇంట్లో ఉండటం వల్ల ప్రజలు మొబైల్, కంప్యూటర్లలో మరింత చురుకుగా మారారు. దీనితో పాటు ఇంటర్నెట్‌ దుర్వినియోగం కూడా పెరిగింది. ఇటీవల తెలంగాణలోని ఓ రెస్టారెంట్‌ వాష్‌ రూమ్‌ లో ఫోన్‌ కెమరా రహస్య ప్రదేశంలో ఉంచి, రికార్డ్‌ చేస్తున్నట్టు గుర్తించారు. సుప్రీంకోర్టు న్యాయవాది నిపుణ్‌ సక్సేనా ఈ సైబర్‌ నేరాల గురించి మాట్లాడుతూ ‘భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌ 354(సి) దీనిని నేరంగా పరిగణిస్తుంది. ఈ నేరం ఎలక్ట్రానిక్, డిజిటల్‌ గాడ్జెట్ల ద్వారా జరుగుతుంది. మహిళల వ్యక్తిగత క్షణాలు ఒక పరికరంలో రికార్డ్‌ చేస్తే, అది నేరంగా పరిగణించబడుతుంది. మహిళల వ్యక్తిగత చిత్రాలు స్టోర్‌ చేయడం, షేర్‌ చేయడం, ప్రసారం చేయడం.. అన్నీ నేరం పరిధిలోకి వస్తాయని, సెక్షన్‌ 292, సెక్షన్‌ 294 కు వర్తిస్తాయని వారు పేర్కొన్నారు.

మార్చి, 2021లో లక్నోలో ఒక వివాహిత తన తల్లితో పాటు ఉరివేసుకుంది. ఆ అమ్మాయి మాజీ ప్రియుడు అతనితో సన్నిహితంగా ఉన్న వీడియోలను ఆమె భర్తకు పంపిస్తానని బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నాడు. సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో, సమాజంలో తమ పరువేమవుతుందోననే భయంతో తల్లితో పాటు ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. మార్చి, 2020లో అహ్మదాబాద్‌ లో ఓ అమ్మాయి బాయ్‌ఫ్రెండ్‌ ఆమె తనతో సన్నిహితంగా ఉన్న వీడియోను స్నేహితులకు లీక్‌ చేశాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. మే, 2019 లో మీరట్‌లో ఒక మహిళ తన ఐదేళ్ల కూతురితో కలిసి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె మాజీప్రియుడు మొబైల్‌ అమ్మేముందు వారిద్దరి వ్యక్తిగత ఫొటోలను తొలగించలేదు. ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఆ మహిళ తన ప్రాణాలు తీసుకుంది.