Begin typing your search above and press return to search.

టీ బీజేపీ కొత్త వ్యూహం.. రెండేళ్ల ముందే ఆ 10 మంది అభ్యర్థులపై ప్రకటన?

By:  Tupaki Desk   |   24 Sep 2021 5:35 AM GMT
టీ బీజేపీ కొత్త వ్యూహం.. రెండేళ్ల ముందే ఆ 10 మంది అభ్యర్థులపై ప్రకటన?
X
తెలంగాణలో తన బలాన్ని పెంచుకోవటానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ తాజాగా కొత్త ఎత్తు వేస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు మరో రెండేళ్లు సమయం ఉన్న వేళ.. సరికొత్త ప్రయోగానికి తెర తీసింది. ఎన్నికలకు రెండేళ్లు ముందుగానే తొలుత పది అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే పార్టీ అభ్యర్థులకు టికెట్లను ఖరారు చేసి..వారి పేర్లను అధికారికంగా ప్రకటించాలని భావిస్తోంది. అదే జరిగితే.. ప్రత్యర్థుల్ని ఎదుర్కోవటంలో మరింత దూకుడు ప్రదర్శించినట్లు అవుతుందన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అంతేకాదు.. క్యాడర్ లో జోష్ నింపేందుకుఒక క్రమపద్దతిలో నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల్ని ఖరారు చేయాలనే ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తొలిదశ ప్రజా సంగ్రామయాత్ర ముగింపు సందర్భంగా పది సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించాలన్న యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. చార్మినార్ లోని భాగ్యలక్ష్మి ఆలయం నుంచి మొదలైన ఆయన యాత్ర పలు జిల్లాల్లోని 22 అసెంబ్లీ నియోజకవర్గాలు.. ఆరు ఎంపీ సథానాల్ని కవర్ చేస్తూ అక్టోబరు రెండు హుజూరాబాద్ లో ముగించనున్నారు. ఇదిలా ఉంటే.. తొలుత అభ్యర్థుల్ని ప్రకటించే పది అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే.. అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి వివాదాలు లేని.. సమర్థుడైన అభ్యర్థులు పక్కాగా ఉన్న వాటిని తొలుత ఎంపిక చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులకు ఉన్న ఆదరణతో పాటు.. వారి సామాజిక నేపథ్యం.. వారికున్న ఓట్ బ్యాంక్ తో పాటు.. ఇతర అంశాల్ని కూడా ప్రాతిపదికగా తీసుకుంటారని చెబుతున్నారు. అందరి కంటే ముందే అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయటం ద్వారా.. ప్రజల్లోకి వారు వెళ్లటం ద్వారా పార్టీకి మేలు జరుగుతుందని భావిస్తున్నారు. ముందస్తుగా ప్రకటిస్తారని భావిస్తున్న పది నియోజకవర్గాలు ఏమిటన్నది చూస్తే..

1. చార్మినార్
2. నాంపల్లి
3. కార్వాన్ - అమర్ సింగ్
4. గోషామహల్ - రాజాసింగ్ (సిట్టింగ్ స్థానం)
5. వికారాబాద్ - మాజీ మంత్రి చంద్రశేఖర్
6. ఆందోల్ - మాజీ మంత్రి బాబూ మోహన్
7. నరసాపూర్
8. దుబ్బాక - రఘునందన్ రావు (సిట్టింగ్)
9. ఎల్లారెడ్డి - మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి
10. హుజూరాబాద్ - మాజీ మంత్రి ఈటల రాజేందర్